‘ప్రాణరక్షణ’పై అవగాహన శిబిరం
శిక్షణ పొందుతున్న చిన్నారులు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: అమరావతి వాకర్స్ రన్నర్స్ (అవార) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కొండవీటివాగు వరద మళ్లింపు ప్రాజెక్ట్ వద్ద ‘ప్రాణరక్షణ శిబిరం’ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త, సాహితీప్రియుడు డాక్టర్ రామారావు కన్నెగంటి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి 5 కి.మీ., 10 కి.మీ. పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పరిసరాలను పరిశుభ్రం చేసుకొని, ఫల వనాలు పెంచే ప్రయత్నం చేస్తున్న అవార చిన్నారులు, వాలంటీర్లు, సభ్యులను అభినందించారు. అనంతరం నీటి ప్రవాహ జాగ్రత్తలు, ప్రాణరక్షణ, పర్యావరణ అవగాహన, ఈత విద్యలో శిక్షణ ఉత్సాహభరితంగా సాగింది. వాలంటీర్లు విత్తనాలు, మొక్కలను నదీతీరంలో నాటారు. ఈత శిక్షకులు శకుంతలాదేవి, పంకజ్, వైష్ణవి, ఉపాధ్యాయులు, వాలంటీర్లు, అరవింద పాఠశాల, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల, పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వచ్చే ఆదివారం ప్రకృతి శిబిరంలో పాల్గొనాలనుకునే వారు 94941 26812 నంబరులో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.