logo
Published : 06 Dec 2021 02:56 IST

సర్వేకు నెలలు..!

అపరిష్కృతంగానే వందల దరఖాస్తులు...
నగరం మొత్తానికి ఇద్దరే

నగరపాలకలో టౌన్‌ సర్వేయర్‌ విభాగం

ఏటీ అగ్రహారానికి చెందిన శ్రీనివాసరావు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థలం సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే నవంబరు మొదటి వారంలో ఓ కార్పొరేటర్‌ జోక్యంతో కదలిక వచ్చింది. ఇందుకు రూ.15 వేలు ఖర్చయిందన్నారు.

నల్లపాడుకు చెందిన రామారావు ఖాళీ స్థలం సబ్‌డివిజన్‌ చేసి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే రెండు నెలలైనా అతీగతి లేదు. ఫోన్లు చేసినా తీయటం లేదని చెప్పారు.

ఈనాడు, అమరావతి

గుంటూరు నగరపాలకలో సర్వే కోసం ప్రజలు ఎంతగా అవస్థలు పడుతున్నారో పై ఉదంతాలే నిదర్శనం. నగరంలో సర్వే దరఖాస్తుల పరిష్కారానికి నెలల తరబడి సమయం పడుతోంది. వీటి పరిష్కారానికి ఒక పద్ధతి లేకుండా ఉంటోందని దరఖాస్తుదారులే గగ్గోలు పెడుతున్నారు. ఒక ప్రాధాన్య క్రమం ప్రకారం కాకుండా ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన వారికి, అమ్యామ్యాలు సమర్పించుకున్నవారికి వెంటనే సర్వే నిర్వహిస్తున్నారనే ఆరోపణలను నగరపాలక మూటగట్టుకుంటోంది. పది లక్షలకు పైగా జనాభా కలిగి సుమారు 2లక్షలకు పైగా అస్సెస్‌మెంట్లు ఉన్న ఇంత పెద్ద నగరానికి ఇద్దరు టౌన్‌ సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు తూర్పు, మరొకరు పశ్చిమ నియోజకవర్గం చూస్తున్నారు. నగర ప్ర£ణాళిక విభాగం పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు. ప్రస్తుతం నగరంలో ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా సర్వే సర్టిఫికెట్‌ కావాలని రిజిస్ట్రేషన్‌ అధికారులు అడుగుతున్నారు. దీంతో నగరంలో సర్వేకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. సగటున నెలకు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ ఏడాది జవనరి నుంచి ఇప్పటి దాకా 1865 దరఖాస్తులు రాగా 1082 మాత్రమే పరిష్కరించారు. ఇంకా 700కు పైగా అపరిష్కృతంగానే ఉన్నాయి.
ఖాళీ స్థలం పన్నుకు అదే ప్రామాణికం
ఒక్క రిజిస్ట్రేషన్‌ కోసమే కాదు.. ఖాళీ స్థలాలకు పన్ను వేయాలన్నా దానికి సర్వే నివేదికను ప్రామాణికంగా తీసుకోవాలని రెవెన్యూ విభాగానికి ఆదేశాలున్నాయి. ఖాళీ స్థలాలు కలిగిన యజమానులు పన్ను వేయించుకోవడానికి తొలుత తమ స్థలం ప్రభుత్వ భూమిలో లేదని పట్టా ల్యాండ్‌ అని సర్వేయర్‌ ద్వారా ధ్రువీకరించుకోవాలి. అప్పుడే అధికారులు దానికి పన్ను వేస్తారు. ఇలా ప్రతిదీ సర్వేతోనే ముడిపడి ఉంది. సకాలంలో సర్వే పూర్తి చేయడానికి నగరపాలకలో సరిపడా సర్వేయర్లు లేరు. కనీసం ఆరుగురు సర్వేయర్లు అవసరమని గుర్తించారు. అపార్టుమెంట్లకు సబ్‌డివిజన్‌ రిపోర్టు సర్వేయర్‌ నుంచి తెచ్చుకోవాలని చెబుతారు. అది ఉంటేనే ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తారు. అత్యవసరంగా ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే వారే ఎంతోకొంత ఇచ్చుకుని సర్వే చేయించుకుంటున్నారని తెలుస్తోంది.
15 రోజులే గడువు
సర్వే దరఖాస్తు పరిశీలనకు 15 రోజులే గడువు విధించారు. దరఖాస్తుదారులు తొలుత నగరపాలక సిటిజన్‌ ఛార్టర్‌లో అందజేసి నిర్దేశిత ఫీజు చెల్లించగానే దాన్ని ప్రణాళిక విభాగం గుమస్తాకు పంపుతారు. ఆయన నమోదు చేసుకుని సర్వేయర్‌కు కేటాయిస్తారు. అయితే 15 రోజులు కాదు కదా 150 రోజులకు కూడా కొందరివి పరిష్కారానికి నోచుకోవటం లేదు. కొంతకాలం కొవిడ్‌ అని, మరికొన్ని రోజులు జగనన్న కాలనీలకు లేఅవుట్ల మార్కింగ్‌, రోడ్ల విస్తరణ మార్కింగ్‌ పనులకు హాజరుకావడం వల్లే సర్వేలో జాప్యం జరుగుతోందని ప్రణాళికవర్గాలు తెలిపాయి. అదనంగా మరో ఇద్దరు సర్వేయర్లను పంపాలని సర్వే ఉన్నతాధికారులకు లేఖ రాశామని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుల పెండింగ్‌, వాటి పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై అవసరమైతే విచారణ జరుపుతామని ప్రణాళికవర్గాలు వెల్లడించాయి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని