Amaravati Padayatra: బహిరంగ సభకు అనుమతివ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తాం: శివారెడ్డి
వెంగమాంబపురం: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. 36వ రోజు యాత్రను రైతులు వెంగమాంబపురం నుంచి ప్రారంభించారు. ఇవాళ్టి యాత్ర మాటమడుగు, బంగారుపల్లి మీదుగా సాగనుంది. బంగారుపల్లిలో మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్న రైతులు రాత్రికి వెంకటగిరిలో ఇవాళ్టి యాత్రను ముగించనున్నారు.
పాదయాత్రలో నిబంధనలు అతిక్రమించారని 42 కేసులు నమోదయ్యాయంటూ.. తిరుపతిలో డిసెంబరు17న తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. సభకు చాలా షరతులు పెట్టారని వాటికి సమధానం ఇవ్వడానికి ఐకాస నేతలు తిరుపతి వెళ్లారని చెప్పారు. అయినా సభకు అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శివారెడ్డి వివరించారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. పాదయాత్రలో నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే అని ఆయన చెప్పారు.
మరోవైపు రైతుల యాత్రకు పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రూ.10లక్షల విరాళం ప్రకటించారు.