logo

తాగునీరు లేని బడులు

కృష్ణా జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ తాగునీరు, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తొలి విడత నాడు నేడు పనుల్లో భాగంగా జిల్లాలోని 400 పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించారు. మిగతా పాఠశాలలన్నింటిలోనూ

Published : 07 Dec 2021 04:30 IST

ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ తాగునీరు, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తొలి విడత నాడు నేడు పనుల్లో భాగంగా జిల్లాలోని 400 పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించారు. మిగతా పాఠశాలలన్నింటిలోనూ మౌలికవసతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. తాజాగా కేంద్ర జలశక్తిశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలోనూ జిల్లాలోని పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు వెల్లడైంది. తాగునీటి వసతి, శానిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉందనేది అధ్యయనం చేసిన జలశక్తిశాఖ నివేదికను విడుదల చేసింది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే అనేక పాఠశాలల్లో చేతి పంపులపైనే విద్యార్థులు ఆధారపడుతున్నారు. వందల సంఖ్యలో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. అవి ఉన్నా.. లేనట్టే అనే పరిస్థితి ఉంటోంది.

కృష్ణా జిల్లాలో 3173 ప్రభుత్వ బడులున్నాయి. వీటిలో 3.11లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. విజయవాడ సహా నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో మౌలికవసతులు కొంతవరకూ బాగనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం.. చాలాచోట్ల అరకొర సౌకర్యాలే ఉన్నాయి. నాడు నేడు పనులు చేపట్టినవి మినహా.. మిగతా పాఠశాలల్లో కనీసం తాగడానికి కూడా సరైన నీళ్లు లేవు. చాలా బడుల్లో తాగునీటిని విద్యార్థులే ఇళ్ల వద్ద నుంచి వచ్చేటప్పుడు బాటిల్‌లో తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయలు డబ్బా నీటిని ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త ట్యాంకులు నిండిపోయి..

నాడు నేడులో భాగంగా కొన్ని పాఠశాలల్లో కట్టిన మరుగుదొడ్ల ట్యాంకులు కూడా ఇప్పటికే నిండిపోయాయి. ఏడాదిలో ట్యాంకులు నిండిపోవడం ఏంటనేది అర్థం కాక.. అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ట్యాంకులు చిన్నగా కట్టడం, లేదంటే.. వర్షపునీరు లోపలికి వెళ్లిపోవడం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ట్యాంకులు నిండిపోయిన వాటిని తలుపులు వేసి వదిలేశారు. నాడునేడులో ఆరంభంలో బాగానే పనులు చేపట్టినా.. సమయం దగ్గరవుతున్న కొద్ధీ. త్వరగా ముగించారు. ఆఖరిలో కొన్ని పాఠశాలలకు ప్రహరీలు, రంగులు, మరమ్మతులు లాంటివి తూతూమంత్రంగా కానిచ్చేశారు. ప్రధానంగా కిటీకీలు, తలుపులు లాంటివి మరమ్మతులు అయిపోయినట్టుగా చూపించేశారనే విమర్శలున్నాయి.

ఆయాలను పెట్టినా నిర్వహణ లేక..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలను నియమించినప్పటికీ నిర్వహణ సరిగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళ్లినప్పుడు కూడా ఆయాలు చాలాచోట్ల ఉండడం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆయాలను పెట్టకుండానే.. లాగించేస్తున్నారనే విమర్శలున్నాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లను శభ్రం చేసేందుకు ఇచ్చిన సామగ్రిని కూడా కనీసం తెరవకుండా అలాగే వదిలేశారు. విజయవాడ నగరం, శివారుల్లో ఉండే స్కూళ్లకు అధికారులు ఎక్కువగా తనిఖీలకు వస్తుండడంతో మౌలిక సౌకర్యాల కల్పన బాగానే చేస్తున్నారు. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను పట్టించుకునేవాళ్లు కూడా ఉండడం లేదని.. అక్కడి సిబ్బందే స్వయంగా చెబుతున్నారు.


జిల్లాలోని పాఠశాలల్లో పరిస్థితి ఇదీ..

మొత్తం పాఠశాలలు: 3173

విద్యార్థులు: 3.11లక్షలు

మొత్తం నిరుపయోగ టాయ్‌లెట్లు: 683

చేతులు కడిగేందుకు సింక్‌లు లేనివి: 835

తాగునీటి సదుపాయం..

ఇప్పటికీ చేతి పంపులే ఆధారం: 2408

నల్లా పైపులున్నవి: 2410

బాటిల్‌ వాటర్‌పై ఆధారపడేవి: 2402

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని