logo

@ నాటు కోళ్లు

‘కొవిడ్‌లో సరికొత్తగా ఆలోచించి.. అందరికీ భిన్నమైన ఓ వ్యాపారాన్ని గుడివాడకు చెందిన యువకుడు ఆరంభించాడు. మార్కెట్‌లో ఎంతో గిరాకీ ఉన్న నాటు కోళ్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించాలని భావించాడు. అప్పటికే తమ ఇంటిలో, ఊరిలో ఎంతోమంది

Published : 07 Dec 2021 04:30 IST

ఈనాడు, అమరావతి

‘కొవిడ్‌లో సరికొత్తగా ఆలోచించి.. అందరికీ భిన్నమైన ఓ వ్యాపారాన్ని గుడివాడకు చెందిన యువకుడు ఆరంభించాడు. మార్కెట్‌లో ఎంతో గిరాకీ ఉన్న నాటు కోళ్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించాలని భావించాడు. అప్పటికే తమ ఇంటిలో, ఊరిలో ఎంతోమంది నాటుకోళ్లను పెంచుతుండడంతో.. వాటికి ఉన్న డిమాండ్‌ను గుర్తించి.. అదే తన వ్యాపారానికి అనువైనదిగా భావించాడు. కేవలం తమ చుట్టుపక్కలే కాకుండా.. ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకునేలా, ఇక్కడి నుంచి వారికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇండియన్‌ హెన్స్‌ పేరుతో ఓ యాప్‌ను తయారుచేయించుకున్నాడు. దానిలో తమ దగ్గర ఉన్న కోళ్ల రకాలను అప్‌లోడ్‌ చేసి.. ధరలను కూడా పెట్టి విక్రయించడం ఆరంభించాడు. క్రమంగా వ్యాపారం అందరికీ తెలియడంతో.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోళ్లను ఇక్కడి నుంచి పంపిస్తున్నారు.’

గుడివాడకు చెందిన సూరపనేని శ్రీనివాస్‌(32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ట్రావెల్స్‌లో టిక్కెట్లను బుక్‌ చేసే వ్యాపారం కొన్నాళ్లు చేశాడు. కొవిడ్‌ నేపథ్యంలో పూర్తిగా వ్యాపారం దెబ్బతినడంతో.. ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అసలైన నాటుకోళ్ల రకాలను మార్కెట్‌లోనికి తీసుకొస్తే జనం ఆదరణ ఉంటుందని భావించాడు. గుడివాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నఎరుకుపాడు గ్రామం వద్ద తమకు ఉన్న స్థలంలో కోళ్ల ఫాంను ఏడాదిన్నర కిందట ఏర్పాటు చేశాడు. కృష్ణా జిల్లాలో దొరికే వాటితో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి 60 రకాల నాటుకోళ్లను తీసుకొచ్ఛి. వాటితో పిల్లలను పొదిగించారు. ఖరీదైన పందెం కోళ్ల నుంచి మామూలు నాటుకోళ్ల వరకూ అన్నీ ఉన్నాయి. తనకు ఉన్న రెండున్నర ఎకరాల స్థలంలో చిన్నఎరుకుపాడు వద్ద నాటు కోళ్ల ఫాంను ఏర్పాటు చేశారు. కోళ్లకు వైరస్‌ల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుందని తెలిసి.. ముందస్తుగానే సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. విశాలంగా ఉండేలా.. ఏర్పాట్లు చేయడంతో పాటు పశువైద్య నిపుణుల సలహాలను తీసుకుంటూ పిల్లలను పొదిగిస్తున్నారు.

ఐదు వేల మంది డౌన్‌లోడ్‌ చేశారు..

తన ఆలోచనకు తగ్గట్టుగా ఇండియన్‌హెన్స్‌ పేరుతో ఓ యాప్‌ను రూపొందించాడు. దానిలో తన కోళ్ల ఫారంలో ఉన్న అన్ని జాతులను అప్‌లోడ్‌ చేసి, ఏ రకం ఎంత ధర అనేది పెట్టారు. యాప్‌కు అతి తక్కువ సమయంలోనే మంచి ఆదరణ వచ్చింది. ఇప్పటివరకు ఐదు వేల మందికి పైగా.. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యాప్‌లో బుక్‌ చేస్తే ఆరంభంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉండేవారికి మాత్రమే సరఫరా చేసేవాళ్లు. ప్రస్తుతం పెద్దమొత్తంలో వచ్చే ఆర్డర్లకు.. శ్రీకాకుళం, విజయనగరం వరకూ ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి పంపిస్తున్నారు.

ఆరంభంలో కష్టాలు..

నాటు కోళ్ల ఫాంను ఏర్పాటు చేసిన ఆరంభంలో విక్రయాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత జిల్లాలో జరిగే పెద్ద ఫంక్షన్లకు కోళ్లను సరఫరా చేస్తుండేవాళ్లు. తాము పెంచుకుంటామంటూ వచ్చేవాళ్లకు కూడా సరైన దిశానిర్దేశం చేసి కోడి పిల్లలను ఇచ్చారు. స్థానికంగా ఉండే రైతులకు కూడా కోడి పిల్లలను ఇచ్చి ఆరు నెలలు వాళ్లు పెంచిన తర్వాత తిరిగి కొనుగోలు చేస్తున్నారు. పందెం కోళ్లతో పాటు గిన్నె కోడి, టర్కీ, కడక్‌నాథ్‌ వంటి రకాలను కూడా పెంచుతున్నారు. వీటి గుడ్లపైనా మంచి ఆదాయం రావడం మొదలైంది. ప్రస్తుతం పది మంది వరకూ సిబ్బంది పనిచేస్తున్నారు.

కరోనా సమయంలోనే ఆలోచన..

కరోనా సమయంలో ఏదైనా ఆన్‌లైన్‌ వ్యాపారం పెట్టాలని ఆలోచన వచ్చింది. చాలా వ్యాపారాలను పరిశీలించిన తర్వాత నాటుకోళ్లకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఇది చేద్దామని నిర్ణయించుకున్నాను. మిగతా ప్రాంతాల్లో దొరికే ధరల కంటే కాస్త తక్కువకు, నాణ్యమైన కోళ్లను అందిస్తే.. ఆదరణ బాగుంటుందని నిపుణులు చెప్పారు. అందుకే.. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన రంగంలోనే ప్రయత్నం చేద్దామని ఆరంభించాను.

- సూరపనేని శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని