logo

మరణంలోనూ వీడని దాంపత్య బంధం

భర్త అంటే ఆమెకు ప్రాణం. భార్య పట్ల అతనికి ఎనలేని ప్రేమ. ఆ దంపతులకు ఓ గారాల పట్టి. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలోకి అనారోగ్యం చొరబడింది. భర్త ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో ఆమె

Updated : 07 Dec 2021 06:34 IST

భర్త మృతిని తట్టుకోలేక భార్య హఠాన్మరణం


యోహాను, ఆనందకుమారి (పాతచిత్రం)

కోరుకొల్లు (కలిదిండి), న్యూస్‌టుడే: భర్త అంటే ఆమెకు ప్రాణం. భార్య పట్ల అతనికి ఎనలేని ప్రేమ. ఆ దంపతులకు ఓ గారాల పట్టి. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలోకి అనారోగ్యం చొరబడింది. భర్త ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో ఆమె తల్లడిల్లింది. వీలైనంత మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేసినా.. ఎట్టకేలకు మృత్యువే జయించింది. భర్త ఆయువును నిర్దాక్షిణ్యంగా కాటేసింది. దీంతో కన్నీటిపర్యంతమైన ఆ ఇల్లాలి గుండె ఆగిపోయింది. మరణంలోనూ భర్త నీడను వీడలేనంటూ తోడుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు.. కోరుకొల్లుకు చెందిన ఊసల యోహాను (59) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన భార్య ఆనందకుమారి (55) ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలు. వీరికి ఒక కుమార్తె (20) ఉంది. ఉద్యోగం నిమిత్తం వీరు 20ఏళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థిరపడ్డారు. భర్త అనారోగ్యానికి గురవడంతో కొన్నిరోజులు స్వగ్రామంలో గడిపి వెళ్దామని ఆ కుటుంబం గత నెలలో కోరుకొల్లు వచ్చారు. యోహాను ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం ఉదయం 10.30గంటలకు మృతిచెందారు. భర్త మరణంతో ఆనందకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయంత్రానికి భర్త మృతదేహాన్ని ఖననం చేసి సాయంత్రం 5.30గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన బంధువులకు ఊహించని సంఘటన ఎదురైంది. తీవ్ర ఉద్వేగానికి గురైన ఆనందకుమారి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసింది. వెంటనే ఆమె మృతదేహానికీ అంత్యక్రియలు నిర్వహించారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు తనను విడిచి కానరాని లోకాలకు వెళ్లారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక వారి కుమార్తె గుండె పగిలేలా రోదిస్తోంది. ఈ ఘటనతో గ్రామం శోకసంద్రంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని