logo

కు.ని శస్త్రచికిత్సలపై సిబ్బంది నిర్లక్ష్యం!

నెల కిందట గన్నవరం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతికి రెండో కాన్పు జరిగింది. కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్‌ చేయించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో విజయవాడ పాతాసుపత్రిలోని సంబంధిత

Published : 07 Dec 2021 04:30 IST

శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు (పాత చిత్రం)

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: నెల కిందట గన్నవరం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతికి రెండో కాన్పు జరిగింది. కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్‌ చేయించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో విజయవాడ పాతాసుపత్రిలోని సంబంధిత విభాగాన్ని సంప్రదించగా.. 15 రోజులు తరువాత రావాలని వారు సూచించారు. ఆతరువాత వస్తే మళ్లీ పరీక్షలన్నీ చేయించుకుని మందులు వాడి రావాలని చెప్పారు. విసుగెత్తిన ఆ యువతి బంధువులు చేసేదేమీ లేక ఇంటికి తిరుగు పయనమయ్యారు.

* విజయవాడ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి కు.ని. ఆపరేషన్‌ కోసమని విజయవాడ పాతాసుపత్రిని సంప్రదిస్తే కొద్ది రోజులు తరువాత రావాలని తిప్పి పంపించేశారు. ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదిస్తే రూ.30వేలు ఖర్చు అవుతుందని తెలియడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ విజయవాడ పాతాసుపత్రిలోని తాజా పరిస్థితి. ఇక్కడ కుటుంబ నియంత్రణ విభాగం సిబ్బంది తీరే వేరు. శస్త్రచికిత్స కోసమని వస్తే ప్రధాన వైద్యుడు ఉండరు. కొందరు సిబ్బంది.. మందులు వాడి రావాలని, మరి కొందరు కొద్ది రోజులు తరువాత ఆపరేషన్‌ చేస్తారని సమాధానం ఇచ్చి రోగులను ఇంటికి పంపించేస్తున్నారు. రోజూ ఒకటి లేదా రెండు ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారని సమాచారం. పాతాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించుకొని ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.

దిద్దుబాటు చర్యలు : కు.ని ఆపరేషన్ల విభాగంపై వస్తున్న ఫిర్యాదులపై ‘న్యూస్‌టుడే’ సోమవారం ఉదయం సూపరింటెండెంట్‌ డా.వై.కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆయన హుటాహుటిన పాతాసుపత్రికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పలువురు రోగులు ఇచ్చిన సమాచారాన్ని రాసుకున్నారు. సోమవారం నిర్వహించిన నాలుగు ఆపరేషన్లలో తానే స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ 15 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చూస్తామన్నారు. ఏ సమస్య ఉన్నా రోగులు ఆసుపత్రిలో ఉన్న సమాచారం బోర్డుల్లో ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని