logo
Updated : 07/12/2021 06:31 IST

నకిలీలకు అడ్డుకట్ట

కంకిపాడులో అగ్రి-ఆక్వా ల్యాబ్‌

కంకిపాడు, న్యూస్‌టుడే

కంకిపాడు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో రూ.1.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ అగ్రి-ఆక్వా ల్యాబ్‌లో వ్యవసాయ, అనుబంధ పంటల రైతులకు ఉపయోగకరంగా ఉంది. నకిలీ పురుగు మందులు, విత్తనాలను గుర్తించడమే కాకుండా ఉద్యాన, మత్స్య, పశు విభాగాలకు సంబంధించి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. నకిలీలను తొలి దశలో నివారించడానికి ఆధునిక సాంకేతిక పరికరాలతో ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు బాధ్యుడితో కలిపి ఆరుగురిని నియమించారు. జిల్లాలో ఏటా నకిలీ విత్తనాలు, పురుగు మందుల బెడదతో రైతులు నష్టపోతున్నారు. సంక్లిష్ట నిబంధనలతో నష్ట పరిహారం సక్రమంగా అందడం లేదు. మొలక శాతాన్ని నిర్ధరించే మూట కట్టే విధానానికి శాస్త్రీయత లేదు. అందులో గింజలన్నిటికీ గాలి, వెలుతురు, తేమ సమానంగా అందదు. ల్యాబ్‌లో ప్రతి గింజకూ అన్ని సమపాళ్లలో అందేలా చూస్తారు. ఫలితం 99 శాతం కచ్చితంగా ఉంటుంది. గింజల భౌతిక స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. చీడపీడలు, వైరస్‌, బ్యాక్టీరియా, రంగు, రుచి, వాసన, జీవం, పరిమాణం, తేమ శాతం తదితర అన్ని అంశాలపై స్పష్టమైన నివేదిక ఇస్తారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలోని కేంద్రాల నుంచి డీ కోడింగ్‌ చేసి విత్తనాలను ఇక్కడికి పంపుతున్నారు. ఆ వివరాలను యూనిక్‌ సంఖ్యతో జోడించి గోప్యంగా ఉంచుతారు. ఆయా కేంద్రాలకు నివేదిక పంపుతారు.

విత్తన నాణ్యతను పరీక్షిస్తున్న టెక్నీషియన్లు

సర్వీసింగ్‌ శాంపిల్‌: కేంద్రం నిర్వహణపై నాలుగు నెలలపాటు ఉన్నతాధికారులు పలుమార్లు సమీక్షలు జరిపారు. ఫలితాలు కచ్చితంగా ఉంటున్నాయని నిర్ధరణకు వచ్చిన మీదటే రైతులకు నేరుగా ఉపయోగపడే ‘సర్వీసింగ్‌ శాంపిల్‌’ విధానం అమలుకు ఏర్పాట్లు చేశారు. ఏ రైతైనా ఇక్కడికి వచ్చి విత్తనం, ఎరువుల నాణ్యత పరీక్షించుకోవచ్చు.


చేపలు, రొయ్యల పెంపకానికి

చేపలు, రొయ్యల పెంచడానికి అనువైన నీటి కోసం రైతులు నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. లవణ శాతంతో పాటు ఇతర ఖనిజాలు, రసాయనాలు, కర్బనం తదితర వివరాలను పెంపకందార్లు తెలుసుకుంటున్నారు. ఫలితంగా సాగులో జాగ్రత్తలు, సంరక్షణపై అవగాహన కలుగుతోంది. మరికొద్ది రోజుల్లో సేవలు మరింత విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

- పి.సుధాజాకబ్‌, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల


అపరాల సాగు..  సస్యరక్షణ

వరి మాగాణుల్లో అపరాల సాగులో సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వి.సత్యప్రియలలిత, జె.పద్మావతి, కె.లహరి తెలిపారు. దిగువ రకాలు సాగుకు మేలని చెబుతున్నారు.

మినుము: ఎల్‌బీజీ-17, ఎల్‌బీజీ-645, ఎల్‌బీజీ-648, ఎల్‌బీజీ-685, ఎల్‌బీజీ-752, ఎల్‌బీజీ-787, టీబీజీ-104, పీయూ 31, జీబీజీ-1, జీబీజీ-45, జీబీజీ-12. ● పెసర: ఎల్‌జీజీ-460, టీఎం- 96-2, ఐపీయం 2-14, జీజీజీ-1 మొదలైనవి ● నవంబరు 15 నుంచి డిసెంబరు 15 మధ్య ఈ విత్తనాలు వేస్తే దిగుబడి బాగుంటుంది. ఎకరానికి 16 నుంచి 18 కిలోలు చల్లాలి. మొక్కల సాంద్రత ఎక్కువైతే పైరు త్వరగా బెట్టకు వస్తుంది. చీడ పీడల సమస్యలు అధికమవుతాయి. సిఫార్సుకు మించకుండా విత్తనం చల్లికలో మెలకువలు పాటించి సరైన సాంద్రతతో మొక్కలు మొలిచేలా చల్లితే మంచి దిగుబడి పొందవచ్ఛు విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సమ్‌ 70 డబ్ల్యూఎస్‌ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌ఎస్‌తో విత్తనశుద్ధి చేశాక 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా 2.5 గ్రా కార్బండిజమ్‌ శిలీంద్ర నాశినితో విత్తనశుద్ధి చేసుకుంటే పైరుకు రసం పీల్చు పురుగులు ఆశించవు. వేరు కుళ్లు, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్ఛు చల్లే ముందు కిలో విత్తనానికి 20 మి.లీ. రైజోబియం + 20 మి.లీ. పి.ఎస్‌.బి. కల్చర్‌ + 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.

- న్యూస్‌టుడే,  ఘంటసాల,


ఖనిజ లవణాల మిశ్రమంతో పశువులకు మేలు

జిల్లాలో సుమారు 7.5 లక్షలకుపైగా పశువులు ఉన్నాయి. పశువుల ఆరోగ్య పరిరక్షణలో ఖనిజ లవణాల మిశ్రమానిది ప్రధాన పాత్ర. పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా సాగాలంటే వాటిని కొద్ది మోతాదులో రోజూ ఇవ్వాల్సిందే. అవి జీవ రసాయన చర్యలకు మూలమైన జీవ రసాల పనితీరును ప్రభావితం చేస్తాయి. వాటి లోపం వలన జీర్ణక్రియ, పునరుత్పత్తి ప్రక్రియ, ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాల్షియం, పాస్పరస్‌, సోడియం, పొటాషియం, కాపర్‌, కోబాల్ట్‌, మెగ్నీషియం, క్లోరిన్‌, ఐరన్‌ ముఖ్యమైన ఖనిజ లవణాలు. పశువుల దాణాలో 2 శాతం వరకు మినరల్‌ మిక్చర్‌ను చేర్చుకుంటే మంచిది. పశుపోషకులకు రైతు భరోసా కేంద్రాల్లో 50 శాతం రాయితీపై ఖనిజ లవణాల మిశ్రమాన్ని సరఫరా చేస్తున్నారని ఆగిరిపల్లి మండల పశువైద్యాధికారిణి డా.వి.కరుణశ్రీ వెల్లడించారు.

ఉపయోగాలు: దూడలకు 20-25 గ్రాములు రోజూ ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.● పడ్డలకు రోజుకు 50 గ్రాముల మినరల్‌ మిక్చర్‌ తినిపిస్తే పునరుత్పత్తి, అవయవాల పనితీరు మెరుగవుతుంది.

* సకాలంలో ఎదకు వస్తాయి. రక్త వృద్ధి బాగుంటుంది.

* పాడి పశువులకు రోజుకు 100-200 గ్రాముల మినరల్‌ మిక్చర్‌ పెడితే పునరుత్పత్తి చక్రం సక్రమంగా ఉంటుంది.

* పాల దిగుబడి పెరుగుతుంది.

* ఈనిన తర్వాత వచ్చే పాల జ్వరం, మాయపడక పోవడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

*● మట్టి, కాగితాలు లాంటివి తినవు. మూత్రం తాగవు.

- న్యూస్‌టుడే, ఆగిరిపల్లి


రైతుసందేహం

పసుపులో ఆకుమచ్చ తెగులు యాజమాన్యం గురించి తెలియజేయండి

- జి.ప్రసాద్‌, రైతు, చిట్టూర్పు


శాస్త్రవేత్త  సలహా

తెగులు ఆశించిన ఆకులు కోసి పారేయాలి. తరువాత మాంకోజెబ్‌+కార్బండిజమ్‌ కలిపిన మందును 2 గ్రాములు, లేదా ప్రోపికోనజోల్‌ 1 మి.లీ. లేదా థయోఫానెట్‌ మిథైల్‌ 1 గ్రాము, 0.5 మి.లీ.జిగురు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

- న్యూస్‌టుడే,  ఘంటసాల 


 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని