logo

మద్యం మత్తులో కారు నడిపిన వైద్యవిద్యార్థి

ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి పూటుగా మద్యం తాగారు. అయినప్పటికీ వారిలో ఒకరు మత్తులోనే అతివేగంగా కారు నడిపి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న నలుగురిని ఢీకొట్టాడు. నలుగురూ తీవ్రగాయాలతో

Updated : 07 Dec 2021 06:29 IST

 నలుగురికి తీవ్ర గాయాలు 

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి పూటుగా మద్యం తాగారు. అయినప్పటికీ వారిలో ఒకరు మత్తులోనే అతివేగంగా కారు నడిపి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న నలుగురిని ఢీకొట్టాడు. నలుగురూ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన ఎ.నిఖిల్‌రెడ్డి(26), వైజాగ్‌లోని తారకరాం నగర్‌కు చెందిన మెండు తరుణ్‌(24), మహారాణిపేటకు చెందిన గొట్టి ముక్కుల అఖిల్‌(23) ముగ్గురు స్నేహితులు. వీరు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ఇటీవల కొండాపూర్‌లోని మసీదుబండకు వచ్చి ఉంటున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిఖిల్‌రెడ్డి కారులో మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌లోని ఫూజన్‌ పబ్‌కు వచ్చారు. ఇక్కడ మద్యం తాగి అర్ధరాత్రి 12.10 నిమిషాలకు ఇంటికి బయలుదేరారు. మత్తులో ఉన్న నిఖిల్‌రెడ్డి కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో దుర్గం చెరువు నర్సరీ వద్దకు రాగానే అదుపు తప్పింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు వ్యక్తులను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఆ నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారు నేపాల్‌కు చెందిన రాహుల్‌ గౌతమ్‌ (24), పంకజ్‌ అగ్రహారి, వినోద్‌ నాయక్‌(19), సూరజ్‌ గౌతమ్‌(27)లుగా గుర్తించారు. వీరంతా కొంత కాలం క్రితం మాదాపూర్‌ ప్రాంతానికి వలస వచ్చారు. అరుణోదయ కాలనీలో నివాసముంటూ ఇనార్బిట్‌మాల్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుకింగ్‌ మాస్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నిఖిల్‌రెడ్డిని పోలీసులు శ్వాస పరీక్ష నిర్వహించగా 116 ఎంజీగా తేలింది. ఈ మేరకు వైద్య విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని