logo
Updated : 07/12/2021 06:24 IST

ఇక పై.. ఆటలకు రుసుం!

అద్దెకు క్రీడా మైదానాలు

తెరపైకి పే అండ్‌ ప్లే విధానం

న్యూస్‌టుడే, విజయవాడ సిటీ, అమరావతి ఫీచర్స్‌

క్రీడలపరంగా చూస్తే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం. కొవిడ్‌తో మైదానాలకు చాలా మంది దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే క్రీడాకారులు ఆటల బాట పడుతున్నారు. ఈ తరుణంలో వారిని ప్రోత్సహించాల్సిందిపోయి మైదానాల్లో ఆడుకోవాలన్నా.. ఆట నేర్చుకోవాలన్నా డబ్బులు చెల్లించాలనే నిబంధనను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాప్‌) తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. 2006లో జీవో నంబరు 18, 2012లో పే అండ్‌ ప్లే విధానంపై ఉత్తర్వులు వెలువడగా అప్పట్లో క్రీడా సంఘాలు, వ్యాయామోపాధ్యాయులు ఆందోళన చేయడంతో వాటిని ఆచరణలోకి తీసుకురాకుండా పక్కనపెట్టారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలని తాజాగా శాప్‌ నుంచి జిల్లా క్రీడాభివృద్ధి అధికారులకు మార్గదర్శకాలు అందాయి.

22 రకాల క్రీడల్లో శిక్షణకు 14 ఏళ్లలోపు వారికి ప్రవేశ రుసుం, నెలవారీ ఫీజు, 14 ఏళ్లకు పైన వారికి మరో ఫీజు నిర్ణయించింది. టెన్నిస్‌ ఆటకు 14 ఏళ్లలోపు వారికి ప్రవేశ రుసుంగా రూ.800, నెలకు ఫీజు రూ.400 చొప్పున చెల్లించాలి. అదే 14 ఏళ్లకు పైన వారు ప్రవేశ ఫీజుగా రూ.వెయ్యి, ప్రతి నెలా రూ.500 చెల్లించాలి. బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, స్విమ్మింగ్‌కు మూడెంకల ధరలు నిర్ణయించారు.

గుంటూరు జిల్లాలో శాప్‌ పరిధిలో పని చేసే వివిధ క్రీడల శిక్షకులు 24 మంది ఉన్నారు. కృష్ణాలో మరో 20 మంది వరకు ఉన్నారు. వీరు ప్రతి నెలా క్రీడాకారుల నుంచి రూ.17,500 ఫీజుల రూపంలో వసూలు చేయాలనే లక్ష్యం పెట్టారు. ఇందులో రూ.15,200 నగదు వేతనంగా వారికిచ్చి మిగిలిన మొత్తం స్టేడియాల నిర్వహణకు వెచ్చించాలని సూచనలు చేశారు.

ఇప్పటివరకు శాప్‌ పర్యవేక్షణలోని క్రీడా మైదానాలు.. మండల, గ్రామస్థాయిలో ఉండే పాఠశాలల మైదానాలు ప్రైవేట్‌ కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చింది లేదు. ఇప్పుడు వాటిని అద్దెకు ఇవ్వాలని సూచనలు చేశారు. విజయవాడ లాంటి నగరాల్లో అవుట్‌డోర్‌ స్టేడియానికి రూ.3వేలు, ఇండోర్‌ స్టేడియానికి రూ.4వేలు, టెన్నిస్‌ కోర్టులు రూ.2వేలు, స్విమ్మింగ్‌పూల్‌ రూ.2,500, కోచింగ్‌ హాలుకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పాఠశాలల్లోని మైదానాల్ని రూ.1500 నుంచి రూ.20వేల వరకు అద్దెలకు ఇచ్చి వసూలు చేయనున్నారు.

శాప్‌ ప్రతిపాదనలను అమలు చేస్తారా లేదంటే మీరేమైనా మార్పులు చేస్తారా అని ఉన్నతాధికారులు జిల్లాల వారిగా అభిప్రాయాలుస్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ఏ క్రీడకు ప్రవేశ రుసుం, నెలవారీ ఫీజు, ఏడాది, మూడేళ్లు, శాశ్వత సభ్యత్వానికి ఎంత వసూలు చేయగలరని వివరాలు కోరుతున్నారు. శాప్‌ మైదానాలు, సాధారణ పాఠశాలల్లోని ఆట స్థలాలు, పూల్స్‌, శిక్షణ కేంద్రాలకు అద్దె ఎంత వసూలుచేస్తే బాగుంటుందని వివరాలు కోరారు.

గుంటూరు జిల్లాలో మాచర్ల, సత్తెనపల్లి, పొన్నూరు, బాపట్ల, పిడుగురాళ్లలో క్రీడా వికాస కేంద్రాలు ఉన్నాయి. పొన్నూరులో పూర్తిగా ఆటలు నడుస్తున్నాయి. మాచర్ల, బాపట్ల ప్రారంభమైనా ఆటల్లేవు. వీటిలో ఇక నుంచి అడుగుపెట్టాలంటే క్రీడాకారులు నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు బీఆర్‌ స్టేడియంలోనూ ఆటపాటలకు డబ్బులు వసూలు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, కృష్ణలంకలో క్రీడా వికాస కేంద్రాలు, ఆత్కూరులో ఇండోర్‌ స్టేడియం, నాగాయలంకలో వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలు ఉన్నాయి. వీటిలో ఆడుకోవాలన్నా.. ఆటలు నేర్చుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడనుంది.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు సుమారు 2వేల నుంచి 2,500 బడుల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో ఆటలు.. క్రీడాయేతర కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి నగదు ఇప్పటివరకు వసూలు చేయట్లేదు. ఇప్పుడు వాటిని కూడా శాప్‌ పరిధిలోకి తీసుకుని శుభకార్యాలు, ఈవెంట్స్‌, ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించే క్రీడా పోటీలకు అద్దెలకు ఇవ్వాలని మార్గదర్శకాలు అందాయి. పే అండ్‌ ప్లే విధానం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని వ్యాయామోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో శిక్షణకు పేద విద్యార్థుల నుంచి ప్రతి నెలా ఫీజులు వసూలు చేసే ఆలోచన విరమించుకోవాలని క్రీడాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని