logo

అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం

‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించి, న్యాయం చేయడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ సూచించారు. శాఖాపరంగా

Published : 07 Dec 2021 04:30 IST

వినతి పత్రాలు స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించి, న్యాయం చేయడమే అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ సూచించారు. శాఖాపరంగా తమ పరిధిలోని కాని అర్జీలను, ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

కళాశాలలో ఫీజుల భారం : జగ్గయ్యపేటలోని ఎస్‌.జి.ఎస్‌. ఎయిడెడ్‌ కళాశాలలో 1200 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల సదరు కళాశాలను ఎయిడెడ్‌ నుంచి ప్రైవేటు యాజమాన్యంలోకి మార్చారు. విద్యార్థులపై ఫీజుల భారం పడిందని, పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ ‘స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు.

* పాతబస్తీ వించిపేటకు చెందిన జి.లక్ష్మీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వృద్ధురాలైన ఈమె బాగోగులను చిన్న కుమారుడు చూస్తున్నాడు. తనకున్న 25 సెంట్ల ఇంటిని పెద్ద కుమారుడు, కోడలు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను జీవించి ఉన్నంత కాలం తన పేరునే ఇల్లు ఉండేలా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించింది.

* నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎస్‌.సత్తిబాబు గత 5 సంవత్సరాల నుంచి హృదయ, ఇతర జబ్బులతో బాధపడుతున్నాడు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.40 వేలు మంజూరు చేయగా చికిత్స పొందాడు. అతనికి వచ్చిన వ్యాధులకు జీవితాంతం మందులు వాడాల్సి ఉంది. తనకు అంత ఆర్థిక స్తోమత లేదని, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సాయం చేయాలని కోరుతూ విన్నవించాడు.

గంపలగూడెం మండలం నుంచి రాక.. : నూజివీడు డివిజన్‌ పరిధిలోని గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన ఎస్‌.రవి అనే వ్యక్తి.. తెల్ల రేషన్‌ కార్డు మంజూరు కోసం విజయవాడ సబ్‌కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. గతంలో ఒక పాత కారు ఉండగా, తుక్కు కింద విక్రయించినట్టు తెలిపారు. ఈ విషయమై నూజివీడు ఆర్టీవో నుంచి ధ్రువీకరణ పొందినట్టు పేర్కొన్నాడు. కానీ ప్రభుత్వ దస్త్రాల్లో కారు ఉన్నట్లు నమోదవడంతో రేషన్‌ కార్డు ఇవ్వడం లేదని, ప్రభుత్వ పథకాలు మంజూరు కావడం లేదని, ఆదుకోవాలని విన్నవించాడు.

61 వినతుల స్వీకరణ : స్పందనలో మొత్తం 61 వినతులు స్వీకరించినట్టు సబ్‌కలెక్టర్‌ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖ 26, విజయవాడ నగర పాలక సంస్థ 8, పీఆర్‌ 6, ప్రీలిటిగేషన్‌ సెల్‌ (పి.ఎల్‌.సి.ఎఫ్‌) 4, ఆరోగ్య శాఖ 3, ఇతర శాఖలకు సంబంధించి 14 అర్జీలు ఉన్నట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని