logo

సర్వే దరఖాస్తుల పెండింగ్‌పై ఆగ్రహం

గుంటూరు నగరంలో భూములు, స్థలాల కొలతలు కోరుతూ వస్తున్న సర్వే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకుండా నెలలు తరబడి పెండింగ్‌ పెట్టడంపై నగర కమిషనర్‌ చల్లా అనురాధ విచారణకు ఆదేశించారు. సోమవారం ‘ఈనాడు’లో

Published : 07 Dec 2021 04:30 IST

డీసీపీతో విచారణకు ఆదేశించిన కమిషనర్‌


సోమవారం ప్రచురితమైన కథన క్లిప్పింగ్‌

ఈనాడు-అమరావతి: గుంటూరు నగరంలో భూములు, స్థలాల కొలతలు కోరుతూ వస్తున్న సర్వే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకుండా నెలలు తరబడి పెండింగ్‌ పెట్టడంపై నగర కమిషనర్‌ చల్లా అనురాధ విచారణకు ఆదేశించారు. సోమవారం ‘ఈనాడు’లో అమరావతి సంచికలో ‘సర్వేకు నెలలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఉదయాన్నే సంబంధిత సర్వేయర్లను పిలిచి వందల దరఖాస్తులు అపరిష్కృతంగా ఎందుకు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రణాళికాధికారులకు క్లాస్‌ తీసుకున్నారు. ఇప్పటి దాకా సర్వేకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో సకాలంలో పరిష్కరించినవి ఎన్ని? నిర్దేశిత గడువు ముగిసినా పరిష్కరించకుండా ఆలస్యం చేసినవి ఎన్నో వేర్వేరుగా గుర్తించి నివేదిక ఇవ్వాలని డీసీపీ మధుకుమార్‌ను ఆదేశించారు. సర్వే నిర్వహణకు డబ్బులు డిమాండ్‌ చేయటంపైనా విచారణ చేయాలని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే బాధ్యులైన సర్వేయర్లను సరెండర్‌ చేస్తామని కమిషనర్‌ తెలిపారు. నగరంలో పది విలీన గ్రామాలు కలవటం, నగరంలో పలు రహదారులు విస్తరించటంంతో వాటి మార్కింగ్‌ నిర్వహణకు ఇంకా అదనంగా సర్వేయర్లు అవసరమని, ఈ విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి మరో ఇద్దరు సర్వేయర్లను అదనంగా పంపాలని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు