logo
Updated : 07/12/2021 06:08 IST

దక్షిణ ముడితేనే.. దస్త్రం కదిలేది!

ఈనాడు, అమరావతి

అందరికీ వాటాలంటూ బేరాలు

విలువను బట్టి పైకం నిర్ణయం

2019 మే నెలలో బాపట్ల తహసీల్దారు రైతుల నుంచి రూ.లక్ష తీసుకుంటూ కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు పట్టుబడ్డారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లించడానికి సొమ్ము డిమాండ్‌ చేశారు. రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది.

జిల్లాలో మేడికొండూరు మండలంలో వీఆర్వో రూ.90వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశమైంది. గ్రామస్థాయి ఉద్యోగి రూ.90వేలు లంచం డిమాండ్‌ చేయడంతో రెవెన్యూలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది.

పల్నాడులో మాచవరం మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఒక వీఆర్వో సాయంతో తహసీల్దారు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఈ విషయం ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో ఐదుగురు వీఆర్వోలను అక్కడి నుంచి బదిలీ చేశారు.

భూమికి సంబంధించిన ధ్రువపత్రాలు కావాలన్నా.. మార్పులు చేర్పులు చేయాలన్నా.. నిరభ్యంతర పత్రం అవసరమైనా లబ్ధిదారుల చేతిచమురు వదులుతోంది. కొందరు సిబ్బంది, అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే కొందరు నేతలతోపాటు యంత్రాంగానికి ముడుపులు ఇవ్వడం బహిరంగ రహస్యం.

లబ్ధిదారుల అవసరాలే ఆసరా..

భూముల విలువ అనూహ్యంగా పెరగడం, కార్యాలయాల చుట్టూ తిరిగి సంబంధిత ధ్రువపత్రాలు ఇచ్చి అవసరమైన పత్రాలు తీసుకునే సమయం చాలామందికి ఉండకపోవడం, కుటుంబసభ్యుల మరణాలు, ఆస్తుల బదిలీల సమయంలో కుటుంబసభ్యుల ధ్రువీకరణ పత్రాలు తొందరగా తీసుకోవాలన్న ఉద్దేశంతో కొందరు లబ్ధిదారులు ఎంతోకొంత ఇస్తే తొందరగా పని అవుతుందన్న నమ్మకంతో పైసలు తీసుకుని పని చేయండని చెప్పడంతో ప్రతి పనికి సొమ్ము ఆశించడం కొందరికి అలవాటైపోయింది. సొమ్ము ఇచ్చుకోని లబ్ధిదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆశ్రయిస్తున్న వారిలో చిన్న పనికి అధికంగా సొమ్ము డిమాండ్‌ చేయడం, పనిచేయకుండా తిప్పించుకుంటున్న సందర్భాల్లోనే ముందుకు వస్తున్నారు. రెవెన్యూలో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పనులు చేయడానికి ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకువచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. దరఖాస్తు వెళ్లగానే మాకేంటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. కార్యాలయంలో రోజువారీగా అనేక ఖర్చులుంటాయని, అన్నీ బయటకు చెప్పుకోలేమని మీలాంటివారు కూడా ఇవ్వకపోతే మాజేబు నుంచి పెట్టుకోవాలా? అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మా కష్టాలు మాకున్నాయని,. తప్పనిసరి పరిస్థితుల్లోనే అడుగుతున్నామని అర్థం చేసుకోవాలని కొందరు నెమ్మదిగా చెబుతున్నారు. 

విలువ ఆధారంగా రేటు 

గుంటూరుతో పాటు ఇతర పట్టణాల పరిసరాల్లో ఉన్న పల్లెల్లో భూముల విలువ అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో భూమికి సంబంధించిన వివాదాలు కూడా పెరిగాయి. జిల్లా నుంచి విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి, ఇతర అవసరాల కోసం రెవెన్యూ నుంచి ధ్రువపత్రాలు అవసరమవుతాయి. దీన్ని ఆసరాగా తీసుకుని రేటు నిర్ణయిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుండా ఎవరిచేత అయినా సిఫార్సు చేయిస్తే సాకులు చెబుతూ కాలయాపన చేస్తారు. వెబ్‌సైట్‌ పని చేయనందున తామేమి చేయలేమని చేతులేత్తేస్తారు తహశీల్దారు కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లతో కుమ్మక్కైన కొందరు వీఆర్వోలు డబ్బులు అవసరమైనప్పుడు అడంగల్‌ నుంచి కొందరి భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకం తీసివేసి పెండింగ్‌లో పెట్టడం వంటివి చేస్తున్నారు. తహసీల్దారు పనుల ఒత్తిడిలో కొన్నిసార్లు కంప్యూటర్‌ ఆపరేటర్‌పై ఆధారపడటాన్ని ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు.


లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

పట్టుబడిన వీఆర్వో కిశోర్‌బాబు, పక్కన మధ్యవర్తి ఖాజీపీరా

మేడికొండూరు, న్యూస్‌టుడే: మూడు ధ్రువపత్రాల జారీకి రూ.90 వేలు లంచం తీసుకుంటూ మేడికొండూరు వీఆర్వో కిశోర్‌బాబు పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్సీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. మేడికొండూరుకు చెందిన చావపాటి షమీముల్లాకు తన తండ్రి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆర్థిక స్థితి, నివాస, ప్రాపర్‌ పర్సన్‌ ధ్రువ పత్రాలు అవసరమయ్యాయి. వాటి కోసం మేడికొండూరు ఒకటో గ్రామ రెవెన్యూ అధికారి కట్టెపోగు కిశోర్‌బాబును కలవగా, రూ.90వేలు లంచం అడిగారు. అంత మొత్తం ఇచ్చుకోలేక షమీముల్లా అవినీతి నిరోధిక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనలతో షమీముల్లా మేడికొండూరులోని వీఆర్వో కిశోర్‌బాబు సొంత కార్యాలయంలో సోమవారం సాయంత్రం లంచం ఇచ్చారు. అదే సమయానికి దాడి చేసిన ఏసీబీ అధికారులు కిశోర్‌బాబుతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన గ్రామవాసి షేక్‌ ఖాజీపీరా (కేకే)ను పట్టుకుని కేసు నమోదు చేశారు.


 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని