logo
Updated : 07/12/2021 06:15 IST

పల్లెల్లో పాల ప్రగతి 

గడ్డి తెస్తున్న మహిళలు

రాజుపాలెం, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తరువాత ప్రధాన జీవనాధారమైన పాడి పరిశ్రమపై రైతులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో మాగాణి భూములున్న గ్రామాల్లోనే అధికంగా పాల ఉత్పత్తి జరిగేది. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న వారికి ప్రకృతి సహకరించకపోవడంతో ఈ ఏడాది ఆయా గ్రామాల్లోనూ గేదెల పెంపకం గణనీయంగా పెరిగింది. మహిళలు పాల విక్రయం ద్వారా ఆర్థిక స్వాలంబన పొందుతూ కుటుంబానికి అండగా నిలుస్తుండటంతో పల్లెలు పాల ప్రగతిని సాధిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది రోజుకు రెండు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరగ్గా, ఈ ఏడాది మూడు లక్షలకు చేరుకోవడంతో నలభై శాతం పాల దిగుబడి పెరిగింది పదేళ్ల క్రితం గ్రామాల్లో పశువుల మేత కొరత ఉండగా, ప్రస్తుతం వారు సాగు చేసే విస్తీర్ణంలో కొంత భాగాన్ని పశుగ్రాసం కోసం కేటాయిస్తున్నారు.


జామ రైతు వినూత్న యోచన

కాయలు స్వయంగా అమ్ముతున్న రైతు వెంకటరామిరెడ్డి

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామానికి చెందిన రైతు వాసిపల్లి వెంకటరామిరెడ్డి మూడేళ్ల క్రితం 1.5 ఎకరాల్లో తైవాన్‌ జామ సాగుకు ఉపక్రమించారు. ఒక్కో మొక్క రూ.35 చొప్పున కడియంలో కొనుగోలు చేశారు. ఎకరానికి వెయ్యి మొక్కలు నాటగా, రూ.50 వేలు పెట్టుబడి పెట్టారు. ఆరు నెలలకు కాయలు వచ్చాయి. ఏటా రెండు కాపులు రావడంతో సగటున 15 టన్నుల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకెళ్తే ధర తక్కువగా అడుగుతున్నారని పొలం పక్కనే ఉన్న ప్రధాన రోడ్డుపై పెట్టి విక్రయించడం మొదలుపెట్టారు. మార్కెట్‌లో కిలో రూ.20 నుంచి రూ.30కు సరకు అడుగుతున్నారు. రోడ్డు పక్కన కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకపోవడంతో లాభం పెరిగిందని రైతు తెలిపారు. ఎకరానికి ఏటా రూ.లక్షకు పైగా లాభం వచ్చిందని చెప్పారు.

- న్యూస్‌టుడే,  ఫిరంగిపురం గ్రామీణం


తక్కువ ఖర్చుతో అధిక రాబడి

కౌలు సాగు కలిసి రాకపోవడంతో పాడి పరిశ్రమపై దృష్టి సారించి బలుసుపాడుకు చెందిన చిన్నం కోటేశ్వరమ్మ జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం రూ.లక్షతో రెండు గేదెలు కొనుగోలు చేశారు. రోజుకు ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు పాలు ఇంటి చుట్టు పక్కల వారికి, కేంద్రాలకు విక్రయిస్తారు. ఏడాదికి రూ.1.5 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.


పాడే జీవనాధారం

పెదకూరపాడుకు చెందిన గోగులపాటి సంతోషం రైతుకూలీ. ఇటీవల ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశారు. తెలిసిన వారి వద్ద రుణం తీసుకుని నాలుగు గేదెలు కొనుగోలు చేశారు. వాటిలో రెండు గేదెల ద్వారా రోజుకు 18 లీటర్ల పాలు కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. నెలకు ఖర్ఛులు పోగా రూ.15 వేలు ఆదాయం సమకూరుతోంది.


నెల ఆదాయం రూ.60 వేలు

రామిరెడ్డిపేటకు చెందిన బిజ్జం బాలచౌడేశ్వరి కుటుంబానికి పరిశ్రమమే ఆధారం తొలుత ఐదు గేదెలు తీసుకున్నారు. అన్ని ఖర్చులు పోగా రాబడి సంతృప్తిగా ఉండటంతో మరో ఎనిమిది కొనుగోలు చేశారు. రోజుకు సుమారు 70 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు.ఖర్చులు పోగా నెలకు రూ.60 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.


తమలపాకు తోటల్లో తెగుళ్ల నివారణ

శీతాకాలంలో డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తమలపాకు తోటలకు భారీ నష్టం కలిగించే ఎండు తెగులు, ఆకు మొదలు కుళ్లు నివారణకు రైతులు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తూర్పుగోదావరి జిల్లా రామన్నగూడెం తమలపాకు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రమాదేవి తెలిపారు. ఎండు తెగులు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. భూమికి దగ్గరగా ఉన్న ఆకులపై ఒక రకం మచ్చలు, గుండ్రంగా లేని పక్షంలో గోధుమ రంగు వలయాలతో ఉండి క్రమేణ నల్లగా మారతాయి. వీటి వల్ల ఆకులు కుళ్లి నాణ్యత తగ్గుతుంది. రెండో రకం మచ్చలు జేగురు వర్ణంలో వలయాలు లేకుండా ఉంటాయి. ఈ తెగులు వేరుకు ఆశించినప్పుడు గోదుమ వర్ణంలోకి మారి కుళ్లిపోతాయి. తీగలు పసుపు రంగులోకి మారి వేరు కుళ్లడం వల్ల నీరు, పోషక పదార్థాలు అందక చనిపోతాయి. నెలకు ఒకసారి ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని ఒక లీటరు మందును ఒక మీటరు దూరానికి భూమిలోని చాళ్లలో పోయాలి. ఆకులపై 15 రోజులకు ఒకసారి 0.5 శాతం బోర్డో మిశ్రమాన్ని 200 లీటర్ల మందు నీటిని పిచికారీగా ఫిబ్రవరి నెల వరకు వాడాలి. ఇలా చేయకపోతే ఈ తెగుళ్లను అరికట్టడం సాధ్యం కాదని వివరించారు.

- న్యూస్‌టుడే, పొన్నూరు


రైతు ప్రశ్న -  శాస్త్రవేత్త సలహా

- న్యూస్‌టుడే, సత్తెనపల్లి

వరిలో మానిపండు తెగులు.. అగ్గితెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు తెలియజేయగలరు.

- బి.కోటేశ్వరరావు, వడ్డవల్లి


వరిలో దిగుబడి తగ్గేలా చేసే మానిపండు తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైట్‌ 2.5 గ్రాములు లేదా కార్బండిజిమ్‌ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజెల్‌ 0.6 గ్రాము లేదా ఐసోఫ్రోథయొలేన్‌ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్‌ 3ఎల్‌ 2.5. మి.లీ. లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి.

- డాక్టర్‌ జి.శివనారాయణ, ప్రిన్సిపల్‌ సైంటిస్టు(ఎక్స్‌టెన్షన్‌), లాంఫాం, గుంటూరు


 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని