logo

భాష కరువై... బంధం బరువై...

విజయవాడ కృష్ణలంకకు చెందిన రవి..రవళి(పేర్లు మార్చాం)కి మూడు నెలలక్రితం పెళ్లయ్యింది. ఒకటయ్యారేగానీ వారి మధ్య సరైన సాన్నిహిత్యం లేదు. స్పర్థలు పెద్దవయ్యాయి. వారి మధ్య అసలు గొడవ ఎందుకని ఆరాతీస్తే రవి ఇంట్లో ఎప్పుడూ చరవాణితో ఎక్కువ సమయం గడుపుతాడని, భార్యతో మాట్లాడేందుకు

Updated : 08 Dec 2021 06:11 IST
చిన్న విషయాలకే మనస్పర్థలు
విడిపోతున్న కొత్త జంటలు
న్యూస్‌టుడే- అమరావతి ఫీచర్స్‌

విజయవాడ కృష్ణలంకకు చెందిన రవి..రవళి(పేర్లు మార్చాం)కి మూడు నెలలక్రితం పెళ్లయ్యింది. ఒకటయ్యారేగానీ వారి మధ్య సరైన సాన్నిహిత్యం లేదు. స్పర్థలు పెద్దవయ్యాయి. వారి మధ్య అసలు గొడవ ఎందుకని ఆరాతీస్తే రవి ఇంట్లో ఎప్పుడూ చరవాణితో ఎక్కువ సమయం గడుపుతాడని, భార్యతో మాట్లాడేందుకు ఇష్టత చూపించడనే ఫిర్యాదులున్నాయి. అదే ఆరోపణను రవి భార్యపై చేసి విడాకుల వరకు వెళ్లాడు.


గుంటూరు బృందావన్‌ కాలనీకి చెందిన హేమంత్‌కి.. సునీతకి(పేర్లు మార్చాం) వివాహమై ఎనిమిది నెలలైనా వారి మధ్య అన్యోన్యత లేదు. ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతుంటారు. ఆరాతీస్తే తన మాట వినట్లేదని ఆమె.. తనను పట్టించుకోవట్లేదని అతడు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుంటారు. ఫలితంగా వారి పెళ్లి బంధం మున్నాళ్ల ముచ్చటగా మారింది.


విజయవాడ సమీప గ్రామానికి చెందిన సుమిత్ర.. సుధీర్‌(పేర్లు మార్చాం) పెద్ద కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఎంతో ఆడంబరంగా వారి వివాహం చేశారు. పట్టుమని రెండు నెలలు కలిసి ఉన్నారో లేదో ఒకరిపై మరొకరు వందలకొద్ది ఆరోపణలు చేసుకున్నారు. అసలు వారి మధ్య గొడవ ఎందుకు వచ్చిందని ఆరాతీస్తే సుమిత్ర తనతో సరిగ్గా మాట్లాడదనే భావన అతడిలో ఉంది. ఎందుకు మాట్లాడవని ఆమెను పెద్దలు గద్దిస్తే అతడే మాటలు వినేందుకు ఇష్టపడడు.. ఎప్పుడూ ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే కాలం వెళ్లదీస్తాడని చెప్పింది.


మాటలేవి..?

గతంలో పెళ్లంటే పెద్దలకు ఎంతో బాధ్యత ఉండేది. ముఖ్యంగా తాతయ్యలు.. అమ్మమ్మ.. నాయనమ్మలు అమ్మాయిల్ని దగ్గర కూర్చోబెట్టుకుని వివాహ బంధం విశిష్టత.. భర్త పాత్ర..చెప్పేవారు.  తాము నేర్చుకుందే తమ పిల్లలకు నేర్పించి పెళ్లి అనే బంధాన్ని మరింత పటిష్టం చేసేవారు. అంతా తమకు తెలుసనే ధోరణిలో యువతరం ఉండటం వారినే దెబ్బతీస్తుంది.


కుటుంబ కౌన్సెలింగ్‌ ఏదీ?

భార్యాభర్తల మధ్య గొడవల్ని దిద్దుబాటుచేసి వివాహ బంధాన్ని పటిష్టం చేసేందుకు పోలీసుశాఖ గతంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాల్ని ప్రతిష్ఠాత్మకంగా నడిపింది. విశ్రాంత ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు, సమాజంపట్ల బాధ్యతతో మెలిగే సేవాసంస్థల బాధ్యులు, డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేంద్రాలకు పర్యవేక్షకులుగా ఉండేవారు. సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, గుంటూరు, విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కేంద్రాలు చక్కగా నడిచి వేల జంటల్ని పెటాకుల వరకు వెళ్లకుండా ఒక్కటి చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కేంద్రాల అవసరం కూడా ఎంతో ఉంది.


5 సూత్రాలపై దృష్టి సారించాలి

పెళ్లి తరువాత కూడా ప్రేమ భాష ఉంటుందని విజయవాడకు చెందిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు డాక్టర్‌ డి.రమాదేవి చెబుతున్నారు.

1. నోటి నుంచి పలికే మాటలు మృదువుగా ఉండేలా చూసుకోవడం.

2. వధూవరులు తమకోసం కొంత సమయాన్ని ప్రత్యేకంగా వెచ్చించుకోవడం ఆ సమయంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండి మనసువిప్పి మాట్లాడుకోవడం.

3. పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రశంసలు తెలుపుకోవడం.

4. రోజువారీ పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవడం.

5. ప్రేమపూర్వక స్పర్శ ఉండాలి


చాలామంది నవ వధూవరుల్లో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. దీనికి కారణం వారి మధ్య సమన్వయం లేకపోవడమా..? పెళ్లిబంధంపట్ల నిబద్ధత లేకపోవడమా..? శారీరక బంధం సరిగ్గా లేకపోవడమా..? అసలు ప్రేమే లేకపోవడమా..? అంటే ఇవన్నీ ఉన్నా పరస్పర నమ్మకం, గౌరవం లేకపోవడమేనని కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో బంధాలు బలపడాలంటే పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ముఖ్యం. మాటల ద్వారా ప్రేమానురాగాలు పెరుగుతాయని నవ జంటలకు సూచిస్తున్నారు. పెళ్లిబంధం పదికాలాలపాటు పదిలంగా ఉండి కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ప్రేమ భాషను యువతీ.. యువకులు అర్ధం చేసుకోవాలని సలహ ఇస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని