logo

చదువులమ్మ ఒడికి 75 ఏళ్లు

చదువే ప్రగతికి మూలమని గ్రహించారు ఆ గ్రామస్థులు. ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని సర్కారుని అభ్యర్థించారు. సానుకూల స్పందన రాలేదు. సొంతగానే హైస్కూల్‌ ఏర్పాటుకు నడుంకట్టారు. దాతలు ముందుకు వచ్చారు.

Updated : 08 Dec 2021 10:01 IST

వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల మొదటి భవనం

ఈటీవీ- గుంటూరు, న్యూస్‌టుడే- తాడికొండ: చదువే ప్రగతికి మూలమని గ్రహించారు ఆ గ్రామస్థులు. ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలని సర్కారుని అభ్యర్థించారు. సానుకూల స్పందన రాలేదు. సొంతగానే హైస్కూల్‌ ఏర్పాటుకు నడుంకట్టారు. దాతలు ముందుకు వచ్చారు. గ్రామస్థుల సంకల్పం ఫలించి ఉన్న ఊరిలోనే ఉన్నత పాఠశాల ఏర్పాటైంది. వేలాది మంది విద్యార్థులు చదువుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడా చదువులమ్మ ఒడికి 75 ఏళ్లు నిండాయి. తాడికొండలోని వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల ప్రస్థానమిది.  1940 ప్రాంతంలో సరైన విద్యా సౌకర్యాలు లేనప్పుడు కనకయ్య హైస్కూలు ఏర్పాటుకు అంకురార్పణ చేశాడు. మల్లెల రత్తమ్మ 600 రూపాయలు విరాళం అందజేశారు. మరికొందరు కూడా ముందుకు వచ్చి తలో చేయి వేశారు. మొదటి విరాళం ఇచ్చిన రత్తమ్మ తండ్రి వెల్లంకి వెంకటప్పయ్య పేరిట 1942లో ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రారంభమైంది. ప్రభుత్వం రూ.30వేల రూపాయలు గ్రాంటుగా ఇచ్చింది. మరికొన్ని భవనాలు నిర్మించారు. 1945లో వి.వి. ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలగా మారింది. మొదట్లో మల్లెల రత్తమ్మ, ఆ తర్వాత ఆమె కుమార్తె యశోదమ్మ అధ్యక్షురాలయ్యారు. యశోదమ్మ కూడా మరో భవనం నిర్మించారు. ఆమె మరణం తర్వాత 1975లో గోగినేని కనకయ్య పాఠశాల బాధ్యతలు చేపట్టారు. 2017లో ఆయన మరణం తర్వాత రాయపాటి శ్రీనివాస్‌ అధ్యక్షులయ్యారు. ఇప్పటి వరకూ దాదాపు 15వేల మంది ఇక్కడ చదివారు. ప్రస్తుతం 390మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడే చదివిన రావూరి భరధ్వాజ తెలుగువారు గర్వించే సాహితీవేత్తగా ఎదిగారు. రాయపాటి సోదరులు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా వంటివారు ఇక్కడే చదువుకున్నారు. వందలాది మంది వైద్యులు, ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడు 75ఏళ్ల వేడుకలకు పాఠశాల సిద్ధమైంది.  

పాఠశాల 60 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని