logo

ఆర్టీసీలో మొదలైన ఎన్నికల ప్రచారం

ఏపీఎస్‌ ఆర్టీసీలో సీసీఎస్‌ ఎన్నికల ప్రచారం మొదలైంది. 2022 నుంచి, 2026 వరకు ఉద్యోగుల పొదుపు, క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (సీసీఎస్‌)కు సభ్య ప్రతినిధుల ఎన్నిక డిసెంబరు 14న నిర్వహించనున్నారు.

Published : 08 Dec 2021 05:13 IST

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే: ఏపీఎస్‌ ఆర్టీసీలో సీసీఎస్‌ ఎన్నికల ప్రచారం మొదలైంది. 2022 నుంచి, 2026 వరకు ఉద్యోగుల పొదుపు, క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (సీసీఎస్‌)కు సభ్య ప్రతినిధుల ఎన్నిక డిసెంబరు 14న నిర్వహించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణాశాఖ (పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌)లో విలీనం కావడంతో.. ప్రస్తుతం ఉన్న యూనియన్లకు గుర్తింపు లేకుండా పొయింది. ఆయా కార్మిక యూనియన్లు ఉద్యోగుల సంక్షేమ సంఘాలుగా ఏర్పడ్డాయి. యూనియన్లన్నీ సీసీఎస్‌ ఎన్నిక ద్వారా ఆధిపత్యం చూపేందుకు చూస్తున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయు), కార్మిక పరిషత్‌, ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లు ఐక్య కూటమిగా, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయు), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(యస్‌డబ్ల్యూఎఫ్‌) సంయుక్తంగా, వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఈయూ, ఎన్‌ఎంయు అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా పోటీలోకి దింపగా, వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది. కృష్ణా రీజియన్‌ పరిధిలో 6501 మంది ఉద్యోగులు ఉండగా మొత్తం 24 మంది డెలిగేట్లు(అభ్యర్థులు) బరిలో ఉన్నారు. ఈ నెల 14న ఎన్నిక నిర్వహించి, 15న ఫలితాలు ప్రకటిస్తారు. ప్రతి 200 మంది ఉద్యోగులకు ఒక డెలిగేట్‌ ఉంటారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 210 మంది సభ్య ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇలా గెలిచిన వారు డిసెంబరు29న జరిగే మరో ఎన్నికలో 9 మంది మేనేజింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. సాధారణంగా 210 మంది సభ్య ప్రతినిధులకు, 106 మంది ఏ యూనియన్‌ మద్దతుదార్లు గెలుస్తారో ఆ ప్యానల్‌కు చెందిన వారే మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా గెలిచేందుకు వీలుంటుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. డిపోల వద్ద భారీ స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని