logo

మిర్చి అధరహో

 మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అటు వ్యాపారులు, ఇటు రైతులు ఊహించని విధంగా అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం, పది రోజుల్లో క్వింటాకు డీలక్స్‌ రకాలపై రూ.1000 నుంచి రూ.1500 వరకు ధరలు పెరగ్గా..

Updated : 08 Dec 2021 06:12 IST

వారంలో క్వింటాకు రూ.1500 పైగా పెరుగుదల

మిర్చియార్డు, న్యూస్‌టుడే: మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. అటు వ్యాపారులు, ఇటు రైతులు ఊహించని విధంగా అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం, పది రోజుల్లో క్వింటాకు డీలక్స్‌ రకాలపై రూ.1000 నుంచి రూ.1500 వరకు ధరలు పెరగ్గా.. తేజ, బాడిగ రకాలపై రూ.2000 వరకు పెరిగాయి. ఆర్డరు తీసుకున్నాక ధరలు పెరుగుతుండటంతో ఎగుమతి వ్యాపారులకు ఏం చేయాలో తెలియడంలేదు. 273, 341, తేజ, బాడిగ రకాలకు ఆర్డర్లు బాగుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అధిక వర్షాలు, వరదల వల్ల కొంత మేర పంటకు నష్టం వాటిల్లింది. వాటి నుంచి కోలుకుంటున్న తరుణంలో తామర పువ్వు పురుగు, ఎర్ర నల్లి కారణంగా మిరప పంట దెబ్బ తినడంతో ధరలు పెరిగేందుకు మరో ప్రధాన కారణమంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మిరప పంటను పీకేస్తున్నారు. దిగుబడి పైనా ప్రభావం చూపడంతో పాటు కొత్త పంట మార్కెట్లోకి రావడం జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో శీతలగిడ్డంగుల్లో ఉన్న మిర్చికి డిమాండ్‌ పెరుగుతుంది.

శీతల గిడ్డంగుల్లో నిల్వలు

శీతల గిడ్డంగుల్లో 20 లక్షల నుంచి 25 లక్షల మిర్చి బస్తాలు నిల్వలు ఉంటాయని అధికారులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయానికి 5 లక్షల బస్తాల కంటే ఎక్కువ నిల్వలు ఉండవు. గతేడాది కరోనా రెండో దశ మిర్చి ఎగుమతులపై ప్రభావం చూపింది. గుంటూరు మిర్చియార్డుకు వేసవి సెలవులు పది రోజులు ముందుగానే ప్రకటించాల్సి వచ్చింది. మిర్చి క్రయవిక్రయాలకు అవకాశం లేక పోవడంతో రైతులు శీతలగిడ్డంగుల్లో మిర్చి బస్తాలను నిల్వ పెట్టుకున్నారు. వ్యాపారుల మాయాజాలం కారణంగా రెండు నెలల్లో ధరలు నేల చూపు చూశాయి. రైతులు ఊహించనంతగా ధరలు పతనం కావడంతో ఆందోళనకు గురయ్యారు. మరీ తక్కువకు మిర్చిని అమ్ముకునేందుకు ముందుకు రాలేదు. ధరలు పెరుగుతాయని ఎదురు చూశారు.


ఊరిస్తున్న ధరలు

వైరస్‌తో మిర్చి పంట

అన్నదాతల ఆశలు ఆవిరి కాలేదు. వారం, పది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో రైతులు మిర్చిని అమ్ముకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అవసరమైనంత మేరకు మాత్రమే మిర్చిని శీతలగిడ్డంగుల నుంచి వెలుపలకు తీసి విక్రయిస్తున్నారు. ధరలు ఇంకా పెరుగుతాయేమోనని భావిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి పంటకు వైరస్‌ల బెడద పట్టి పీడిస్తోంది. మిర్చి పూతకు తామర పురుగు ఆశిస్తుందని, ఆకుల కింద ఎర్ర నల్లి ఉంటుందని వ్యాపారులు, రైతులు తెలిపారు. రాబోయే పక్షం రోజులు ఎంతో కీలకమని, ఇవి అదుపులోకి వస్తే మూడు వారాల్లో కొత్త పంట అందుబాటులోకి వస్తుందని, లేదంటే ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటున్నారు. చైనా, మలేసియా, ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ తదితర దేశాల్లో ప్రస్తుతం నాణ్యమైన మిర్చికి డిమాండ్‌ ఉంది. బాడిగ నాణ్యమైన మిర్చికి కొన్ని లాట్లకు రూ.18,000కు పైగానే ధర పలికిందని వ్యాపార వర్గాలు, అధికారులు పేర్కొన్నారు. ఖమ్మం, నరసరావుపేట శీతలగిడ్డంగుల్లో మిర్చి ధర పాట క్వింటాకు రూ.19,000 వరకు పలికినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని