logo
Published : 09/12/2021 04:08 IST

జమీదింటకుర్రులో విషాదం

వేదాచార్యులు శ్రీనివాసాచార్యుల మృతితో ఖిన్నులైన శిష్యగణం

అంబులెన్స్‌లో  శ్రీనివాసాచార్యుల మృతదేహం

గుడివాడ, కావలి, న్యూస్‌టుడే: గుడివాడ  మండలం జమీదింటకుర్రు, గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రలో బుధవారం విషాదం అలముకుంది. ఆ గ్రామాలకు చెందిన అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు (59), ఆయన సతీమణి రాజ్యలక్ష్మి (54) ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో కారుడ్రైవర్‌ పురుషోత్తం (26)తో సహా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేదసంస్కృత విశ్వవిద్యాలయం డీన్‌(ప్రొఫెసర్‌)గా కొనసాగుతున్న శ్రీనివాసాచార్యులుకు వేదవేదాంగ ప్రముఖులు, వేదాచార్యులు, శతప్రతిష్ఠాచార్యులుగా, రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయ ప్రతిష్ఠ జరిగినా ఆయన శిష్యుడు ఒక్కడైనా ఉండేలా వేదవిద్యను బోధించిన ప్రముఖులుగా పేరుంది. గ్రామీణ గుడివాడ మండలం జమీదింటకుర్రుకు చెందిన రంగాచార్యులు, శన్నోదేవి దంపతుల కుమారుడు శ్రీనివాసాచార్యులు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్థానికంగా జరగ్గా, తండ్రిసోదరులు గుడ్లవల్లేరు మండలం పెంజెండ్రలో ఉండడంతో వారింటికి వెళ్లి ఆ గ్రామంతో కూడా అనుబంధం ఏర్పరచుకున్నారు. చినతిరుపతి వేదపాఠశాలలో వైఖానస ఆగమ విద్యలో ప్రతిభ చూపి ప్రవేశ, వర, ప్రవరల్లో దిట్ట అనిపించుకున్నారు. ఏలూరు, విశాఖలో బీఏ, బీఎల్‌ పూర్తి చేశారు. మచిలీపట్నంలో వాస్తు, జ్యోతిష్యశాస్త్రం అభ్యసించారు. 1984లో చినతిరుపతి వేదపాఠశాలలో తొలుత అధ్యాపకులుగా, తర్వాత ప్రధానాచార్యులుగా, ప్రిన్సిపల్‌గా 2014 వరకూ సేవలందించారు. 2015 నుంచి పెదతిరుపతిలో వేదవిశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగమశాస్త్ర సమావేశాలు, ఆగమ గ్రంథాల పునరుద్ధరణ చేయించారు. పెద తిరుపతి పవిత్రోత్సవాలు, సంప్రోక్షణల్లో రుత్విక్కుగా బాధ్యతలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 150 దేవాలయాల ప్రతిష్ఠోత్సవాల్లో ఆయన భాగం పంచుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షడ్భుజయోగానందరంగకృష్ణ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా, రెండో కుమారుడు తులసీవెంకటరామనరసింహమూర్తి చినతిరుపతిలో వేదపాఠశాల అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసాచార్యులు దంపతుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. పలు ప్రాంతాలకు చెందిన వైఖానస మార్గ వ్యవహారికులు, అర్చకులు, శిష్యగణం తీవ్రమనోవేదనకు గురయ్యారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కావలి ప్రాంతీయాసుపత్రిలో విలపిస్తున్న శిష్యులు

ఆసుపత్రికి తరలివచ్చిన శిష్యులు

ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ గురువు ఘటనాస్థలంలో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి ఆ శిష్యులు బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మృతదేహాలను నెల్లూరు జిల్లా కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. కందుకూరు స్టేషన్‌ సీఐ యాలమూరి శ్రీరాం సిబ్బందితో వచ్చి పరిశీలించారు. తిరుపతి నుంచి పెద్ద కుమారుడు యోగానందరంగకృష్ణ సహా శిష్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. నాన్నగారూ అంటూ కుమారుడు చేస్తున్న రోదనలు చూసి అక్కడివారి కళ్లు చెమ్మగిల్లాయి. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని