logo

మేమే తవ్వుకున్నా ..అమ్ముకున్నా 

అది పేరుకే ఉచితం.. కొత్త వ్యక్తి అడుగు పెట్టాలంటే అంత వీజీ(సులువు) కాదు. బెదిరింపులు.. దాడులు.. ఘర్షణలు..! గత కొన్నేళ్లుగా ఉన్న వ్యాపారులే.. అంతా సిండికేట్‌. వారు చెప్పిందే ధర. ఎవరైనా సరే... ఆ 14 మంది దగ్గరే కొనుగోలు

Updated : 09 Dec 2021 05:40 IST

ఈనాడు, అమరావతి

ట్రక్కు టెర్మినల్‌లో నిలువ చేసిన బూడిద

అది పేరుకే ఉచితం.. కొత్త వ్యక్తి అడుగు పెట్టాలంటే అంత వీజీ(సులువు) కాదు. బెదిరింపులు.. దాడులు.. ఘర్షణలు..! గత కొన్నేళ్లుగా ఉన్న వ్యాపారులే.. అంతా సిండికేట్‌. వారు చెప్పిందే ధర. ఎవరైనా సరే... ఆ 14 మంది దగ్గరే కొనుగోలు చేయాలి. కొత్త లారీ, వాహనం కనపడకూడదు. బూడిద తవ్వకాల సిండికేట్‌ వ్యాపారం ఇది.

విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ బూడిద(ఫ్లైయాష్‌)పై గుత్తాధిపత్యం కొనసాగుతోంది. తాజాగా చెరువు నుంచి తీసిన బూడిదను జాతీయ రహదారి పక్కనే రాశులు పోసి విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం బూడిదతో నిండిపోతోంది. ఈ బూడిద వ్యాపారంలో వీటీపీఎస్‌ యాజమాన్యం ప్రేక్షకపాత్ర వహిస్తోంది. కొంతమంది వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.  వీటీపీఎస్‌ బూడిద చెరువుపై కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు దీనికి సూత్రధారులు. ఇబ్రహీంపట్నం పరిసరాల్లో మొత్తం 14 మంది ట్రాన్స్‌పోర్టర్లు ఉన్నారు. వీరు తప్ప ఇతరుల టిప్పర్‌ బూడిద చెరువులోకి వెళ్లేందుకు వీలు లేదు. వీటీపీఎస్‌కు  రోజుకు దాదాపు 25వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. దీనిలో 50శాతం బూడిద వెలువడుతుంది. అంటే 12.5 వేల టన్నుల బూడిద వస్తుంది. దీన్ని రెండు రకాలుగా వేరు చేస్తారు. ఒకటి నీటితో మిళితంచేసి మూలాపాడు సమీపంలో ఉన్న బూడిద చెరువుకు పంపుల ద్వారా తరలిస్తారు. ఇది ప్లాంటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంది. రెండో విధానంలో ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెస్పిరేటర్‌ ద్వారా ఫ్లైయాష్‌ను వేరు చేస్తారు. ఇలా పొడి రూపంలో వచ్చిన ఫ్లైయాష్‌ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. 25శాతం పొడిగా ఫ్లైయాష్‌గా, 25 శాతం పాండ్‌ తడియాష్‌గా విభజిస్తారు. గత కొన్నేళ్లుగా బూడిద పేరుకుపోవడంతో దీన్ని ఉచితంగా ఇచ్చేందుకు వీటీపీఎస్‌ యాజమాన్యం అంగీకరించింది. పొడిగా ఉండే ఫ్లైయాష్‌ మాత్రం టన్ను రూ.300 చొప్పున విక్రయిస్తోంది. దీన్ని సిమెంటు తయారీలో ఎక్కువగా వాడతారు. ఈ బూడిదతో చేసిన ఇటుకలకు డిమాండ్‌ ఎక్కువ. తడి బూడిదను ఇటుకలు తయారీలో, రోడ్ల నిర్మాణంలో, పూడిక నింపేదుకు వినియోగిస్తారు. ఇబ్రహీంపట్నం పరిసరాల్లో జూపూడి, కేతనకొండ, దాములూరు, కొండపల్లి, మైలవరం ప్రాంతాల్లో ఫ్లైయాష్‌ ఇటుకల తయారీ కేంద్రాలు ఉన్నాయి.

బూడిదే కదా అంటే..!

వీటీపీఎస్‌ యామాన్యం ఒక జేసీబీని అందుబాటులో ఉంచింది. వచ్చిన వాహనాలకు బూడిద దీని ద్వారా ఎత్తి పంపిస్తుంది.  ఓ సూపర్‌ వైజర్‌ ఉంటారు. లారీకి రూ.300 చొప్పున వసూలు చేస్తారు. ముందువచ్చిన వాటికి ముందుగా ప్రాతిపదికన పంపాలి. కానీ గత రెండేళ్లుగా ఇక్కడ నిబంధనలు మారాయి. లారీలను కొంతమంది నేతలు కొనుగోలు చేశారు. బూడిద తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కాలంలో చెరువు నుంచి తీసుకువచ్చిన బూడిదను ట్రక్‌ టెర్మినల్‌ ప్రదేశంలో నిలువ చేస్తున్నారు. ఇసుక మాదిరిగా విక్రయాలకు పెట్టారు. ఇటీవల దీనిపై కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేశారు.  గతంలో అధికార పార్టీలోనే రెండు వర్గాలు బూడిద రవాణాలో ఆధిపత్యపోరు ఉండేది. ఇప్పుడు  సిండికేట్‌గా మారి విక్రయాలు చేస్తున్నారు. పైవంతెనల నిర్మాణంలో, రహదారుల నిర్మాణంలో, లేఅవుట్ల చదును, లింకు రహదారులకు ఈ బూడిదను వినియోగిస్తున్నారు. ఫిల్లింగ్‌ శాండ్‌ కింద దీన్నే వాడుతున్నారు.  ఉచితంగా లభించే ఈ బూడిద 10టైర్ల లారీ రూ.5వేల నుంచి దూరాన్ని బట్టి విక్రయిస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరిగాయని రవాణా ఛార్జీలు పెంచేశారు. గతంలోరూ.2,500లకు లారీ బూడిద లభించేది. రోజుకు 500 లారీలు విక్రయిస్తున్నారు. సగటున రోజుకు రూ.25లక్షల వ్యాపారం సాగుతోంది. ఒక ట్యాంకర్‌ బూడిద రూ.40వేల వరకు విక్రయిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ట్రక్కు టెర్మినల్‌లో బూడిదను నిలువ చేయడంపై  ఇబ్రహీంపట్నం తహశీల్దారు సూర్యారావును ప్రశ్నించగా అలా చేయకూడదని నోటీసులు ఇస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని