మెరుగైన సేవలే లక్ష్యం
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
సీపీ కాంతిరాణా టాటా వెల్లడి
పోలీసు కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
ఈనాడు - అమరావతి
విజయవాడ నగరం తనకు కొత్త కాదని, గతంలో రెండున్నర సంవత్సరాలు పనిచేశానని కొత్త సీపీ కాంతిరాణా చెప్పారు. ఈ అనుభవంతో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని వివరించారు. రాబోయే రోజుల్లో సిటీ పోలీసింగ్‌లో అనేక మార్పులు తీసుకొస్తానని అన్నారు. బుధవారం ఉదయం కాంతిరాణా.. పోలీసు కమిషనర్ కార్యాలయానికి రాగానే సాయుధ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంతిరాణా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ట్రాఫిక్ కష్టాలు తీరుస్తా.. నేర నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా. పోయిన చోరీ సొత్తును రికవరీపై ప్రత్యేక దృష్టి పెడతాం. నగరంలో మూడు వంతెనల నిర్మాణంతో గతం కంటే ట్రాఫిక్ సమస్య కొంత వరకు మెరుగైంది. ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటాం. లోగడ నేను ట్రాఫిక్ డీసీపీగా ఉన్న సమయంలో ప్రత్యామ్నాయ రోడ్ల ప్రణాళిక తయారు చేశాం. వీటిపైనా ఇప్పుడు కసరత్తు చేస్తా. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్యలు చేపడతా. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. నగరంలోకి గంజాయి రాకుండా గట్టి నిఘా ఉంచుతాం. మత్తుకు బానిసలైన వారు సన్మార్గంలో నడిచేలా దృష్టి పెడతాం. కౌన్సిలింగ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. బ్లేడ్ బ్యాచ్‌కు పునరావాసం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటాం.
స్నేహపూర్వక పోలీసింగ్.. విజయవాడ పోలీసు రాష్ట్రంలోకెల్లా అత్యుత్త యూనిట్. నగర కమిషనరేట్ పరిధిలోని పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా సిబ్బంది సామర్థ్యాలను పెంపొందిస్తాం. స్నేహపూర్వక పోలీసింగ్‌పై సిబ్బంది దృష్టి పెట్టేలా చూస్తాం.
మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దిశ యాప్‌ను వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించేలా చూస్తాం. మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో త్వరగా విచారణ పూర్తి చేస్తాం. రెండు నెలల్లోగా ఛార్జిషీటు వేస్తాం.
దుర్గమ్మ సేవలో సీపీ కాంతిరాణా
ఇంద్రకీలాద్రి: కాంతిరాణా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను బుధవారం దర్శించుకున్నారు. గతంలో భవానీ దీక్షల విరమణ సమయంలో డీసీపీగా విధులు నిర్వహించిన కాంతిరాణ తిరిగి అదే సమయంలో నగర సీపీగా బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ సోమినాయుడు, దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా దేవస్థానం ఈవో భ్రమరాంబ, ఛైర్మన్ సోమినాయుడు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, సీఐ వెంకటేశ్వర్లు ఆయన వెంట ఉన్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.