logo
Published : 09/12/2021 04:08 IST

ఆపరేషన్లుఆపేశారు...కుక్కల సంతతి పెంచేశారు ..!

నగర వాసులకు తప్పని ఇక్కట్లు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

విజయవాడలో కుక్కల స్వైర విహారంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల కిందట వాటి సంఖ్య 8 వేలు ఉన్నట్లు తేలగా, ప్రస్తుతం 16 వేలు పైనే ఉన్నాయని అంచనా. శునకాలకు కు.ని.శస్త్రచికిత్సలు ఈ ఏడాది జూన్‌ నుంచి నిలిచిపోవడం సమస్యకు ప్రధాన కారణం. వీటిని నియంత్రించేందుకు నగరపాలక సంస్థ రూ.లక్షలు ఖర్చుచేస్తున్నట్లు చెబుతున్నా, వాటి సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది.

లోపం ఎక్కడ..?

హైదరాబాదుకు చెందిన నవోదయా సొసైటీ అనే ఏజెన్సీకి నగరంలోని వీధికుక్కలను పట్టుకుని శస్త్రచికిత్సలు చేసే బాధ్యతలను గతంలో అధికారులు అప్పగించారు. నెలకు కనీసం 350 - 500 చొప్పున   ఏడాదికి 6 వేల ఆపరేషన్లు చేయడం ద్వారా రెండున్నర ఏళ్లలో మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలనేది లక్ష్యం. వారి బాధ్యతలు ఎప్పుడో పూర్తయినా వీధికుక్కల సంఖ్య తగ్గడంలేదు. ఆ మధ్య యానిమల్‌ కేర్‌ సెంటర్‌ అనే ఏజెన్సీ  ఈ శస్త్రచికిత్సలు నిర్వహించింది. అందుకు  నగరపాలక సంస్థ చెెల్లించే సొమ్ము సరిపోవడం లేదంటూ వారు  కార్యక్రమాన్ని మధ్యలో వదిలేశారు. ఆ తదుపరి మళ్లీ నవోదయా సొసైటీ వారే ముందుకు వచ్చారు. అధికారులు గతంలో వీధికుక్కల నియంత్రణకు ఒకేసారి రూ.33 లక్షలకుపైగా వ్యయం చేశారు. తర్వాత  రూ.8.03 లక్షలు, ఇటీవల  రూ.12.41 లక్షలు వ్యయం చేసినట్లు లెక్కలు తేల్చారు.  అయినా సత్ఫలితాలు రాలేదు. కుక్కలకు 6 నెలలలోపు ఆపరేషన్లు చేయని పక్షంలో వాటి సంతతి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నా, నగరపాలక సంస్థ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

దెబ్బతిన్న షెడ్లు

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సింగ్‌నగర్‌ ప్రాంతంలో యానిమల్‌ భర్త్‌ కంట్రోల్‌ షెడ్‌(ఏబీసీ)ని ఏర్పాటు చేశారు. వీధికుక్కలను అక్కడకు తరలించి శస్త్రచికిత్సలు చేయిస్తుండగా, జూన్‌ నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడి షెడ్‌ దెబ్బతినడంతో పాటు, కుక్కలను ఉంచే ప్రత్యేక గదులు సైతం పాడైపోయాయి. వాటిని తిరిగి పునర్నిర్మించాల్సి ఉంది. ఇక శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు ఏజెన్సీలు ఎక్కువ సొమ్ము డిమాండ్‌ చేస్తుండడం కూడా సమస్యగా ఉంది.

పెరిగిన సంఖ్య

వీధికుక్కలు ఏడాదికి రెండు సార్లు పిల్లలు పెడతాయి. ఒక్కొక్క కాన్పులో 8 నుంచి 10 పిల్లల వరకు పుట్టడంతో నగరంలో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు పుట్టిన పిల్లలు తిరిగి 18 నెలలకే గర్భం దాల్చడం కూడా వాటి సంఖ్య పెరుగుదలకు కారణంగా మారింది. ప్రస్తుతం అధికారులు వీధికుక్కలకు కేవలం యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌లను మాత్రమే ఇస్తున్నారు. అది కూడా రోజులకు సగటున 20 శునకాలకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవి జనాలపై దాడి చేస్తున్నాయి.పెద్దలు, పిల్లలు తరచుగా కుక్కకాటుకు గురవుతున్నారు.  

నెలరోజుల్లో ప్రారంభిస్తాం

నగరంలో వీధికుక్కల సంతతి పెరిగినమాట వాస్తవమే. మాకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. జూన్‌ నుంచి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. తాజాగా టెండరు ప్రక్రియ ఖరారైంది. నెలరోజుల్లో  తిరిగి శస్త్రచికిత్సలు ప్రారంభిస్తాం. ఈలోపు సింగ్‌నగర్‌లోని షెడ్‌కు మరమ్మతులు పూర్తి చేస్తాం.

- రవిచంద్‌, వీఏఎస్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని