logo

పోరంకిలో చోరీల కలకలం

చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌.. తాకితే చెవులు చిల్లులుపడేలా వినిపించే సైరన్లు.. అన్ని మూలలా సీసీ కెమెరాలు.. అయినా చోరులు ఖరీదైన కాలనీ కాలనీలోకి చొరబడి రెండిళ్లలో చోరీలకు తెగబడ్డారు. ఓ ఇంట్లో రూ.4 లక్షల విలువైన వెండి, బంగారు

Published : 09 Dec 2021 04:05 IST

తలుపు తాళాలను పరిశీలిస్తున్న ఎస్‌ఐలు వెంకటేష్‌, శ్రీనివాస్‌

పెనమలూరు, న్యూస్‌టుడే: చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌.. తాకితే చెవులు చిల్లులుపడేలా వినిపించే సైరన్లు.. అన్ని మూలలా సీసీ కెమెరాలు.. అయినా చోరులు ఖరీదైన కాలనీ కాలనీలోకి చొరబడి రెండిళ్లలో చోరీలకు తెగబడ్డారు. ఓ ఇంట్లో రూ.4 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. ఇది చెడ్డీ గ్యాంగ్‌ పనా? లేక? ఈ ప్రాంత చోరులా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలో పోరంకి వసంత్‌నగర్‌కు చెందిన నెల్లి సత్యనారాయణ ఆటోనగర్‌లో వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఈనెల 3వ తేదీన హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లగా కుమారుడు విశాఖపట్నంలోని అత్తగారింటికి వెళ్లాడు. ఈ నెల 7వ తేదీ రాత్రి సత్యనారాయణ దంపతులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. భార్య రూప ముందుగా వెళ్లి ఇంటి తాళాలు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో పాటు కొద్దిగా తెరచి ఉండడంతో భర్తకు తెలిపింది. లోపలకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో పడకగదిలో ఉన్న బీరువా, షోకేస్‌ల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనంతరం వారు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు వచ్చి పరిశీలించారు. ఇంటి రెండు తలుపుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పదునైన స్క్రూడ్రైవర్‌ లేదా? ఇనుప కడ్డీని దూర్చి వెడల్పు చేసిన అనంతరం సెంట్రల్‌ లాకింగ్‌ను పగులగొట్టి లోపలకు ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కాలనీతో పాటు సమీప నివాసాలకు చెందిన సీసీ కెమెరాలను పరిశీలించగా.. నలుగురు యువకులు నిక్కర్లు, ప్యాంట్లు, నల్ల బనీయన్లు ధరించి కాలనీ ప్రహరీ దూకి లోపలకు ఈనెల ఆరో తేదీన ప్రవేశించినట్లు గుర్తించారు. సత్యనారాయణ ఇంట్లో చోరులు దొంగతనం చేసిన తరువాత ఆ ఇంటికి వెనుక వైపున ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించినా వారికి విలువైన వస్తువులేవీ లభ్యం కాలేదు. గిల్టు గాజులు, ఆభరణాలు వీరి చేతికి చిక్కినా ఇవి బంగారు ఆభరణాలు కావని తేలడంతో వాటిని ప్రహరీ పక్కనే పడేశారు. క్లూస్‌ టీం పోలీసులు వచ్చి కొన్ని అనుమానాస్పద వేలిముద్రలను సేకరించారు. చోరులు ఇంటి యజమానులు లేని ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పడక గది ఏసీలు పనిచేయని, దీపాలు వెలగని నివాసాల్లో యజమానులు లేనట్లు గుర్తించి దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. చోరీ అనంతరం చోరులు కానూరు ఆటోనగర్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని