logo

ఇతరులతో సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య

ఇతరులతో సంబంధానికి అడ్డొస్తున్నాడని సహజీవనం చేస్తున్న వ్యక్తిని మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన మహిళ ఉదంతమిది. పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం సీఐ యు.శోభన్‌బాబు కేసు వివరాలను విలేకర్లకు వెల్లడించారు.

Published : 09 Dec 2021 04:05 IST

వీడిన కార్మికుడి అనుమానాస్పద మృతి మిస్టరీ

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ శోభన్‌బాబు, వెనుక నిందితులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఇతరులతో సంబంధానికి అడ్డొస్తున్నాడని సహజీవనం చేస్తున్న వ్యక్తిని మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన మహిళ ఉదంతమిది. పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం సీఐ యు.శోభన్‌బాబు కేసు వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరికి గురజాల మండలంలోని అంబాపురానికి చెందిన వ్యక్తితో విహహమైంది. అనారోగ్యంతో ఆమె భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందగా, సత్తెనపల్లిలో ఉన్న బంధువుల వద్దకు వచ్చి, ఇక్కడే ఇళ్లల్లో, హోటళ్లలో పనిచేస్తూ జీవనం పొందుతోంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన చాంద్‌బాష(43) భార్యాపిల్లల్ని వదిలిపెట్టి లారీల్లో పనిచేస్తూ ఊళ్ల వెంట తిరుగుతుంటాడు. మొదటి లాక్‌డౌన్‌లో సత్తెనపల్లి వచ్చిన అతను ఉపాధి కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న హోటల్‌లో పనికి చేరాడు. అదే హోటల్‌లో నాగమల్లేశ్వరి పనిచేస్తుంది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మద్యం తాగి కొట్టడమే కాకుండా నాగమల్లేశ్వరి వివాహేతర సంబంధాల్ని చాంద్‌బాషా ప్రశ్నిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక వదిలించుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఆమె బాషాను హతమార్చాలని నిర్ణయించుకుని తనతో ఎప్పటినుంచో సంబంధం పెట్టుకున్న రెంటచింతల గ్రామానికి చెందిన అన్నపురెడ్డి అమరయ్య, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామానికి చెందిన తన్నీరు సుబ్బారావుల సహకారాన్ని కోరింది. ఆమె వద్దకు వచ్చి వెళ్లేందుకు బాష అడ్డంకిగా ఉన్నాడని భావించిన వారిద్దరూ హతమార్చేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 3వ తేదీ రాత్రి రైల్వేస్టేషన్‌ రోడ్డులోని స్టేడియం మైదానంలోకి మద్యం తాగుదామని బాషాను ఆ ముగ్గురూ తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగించిన తరువాత గొంతునొక్కి.. ఛాతిపై చేతులతో గుద్ది అతడిని చంపారు.  చనిపోయాడని నిర్ధారించుకున్నాక పరారయ్యారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై ఎ.రఘుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని