logo

వరుస దారిదోపిడీలతో జనం ఆందోళన

యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలతో జనం భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి బోయపాలెం- లింగారావుపాలెం మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న దంపతులపై దారి కాచి దాడి చేసి నగదు, ఆభరణాలు

Published : 09 Dec 2021 04:05 IST

బాధితులు అంజమ్మ, పొనుగుబాటి వీరాంజనేయులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: యడ్లపాడు మండలంలో వరుస దారి దోపిడీలతో జనం భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి బోయపాలెం- లింగారావుపాలెం మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న దంపతులపై దారి కాచి దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. మంగళవారం కూడా అదే తరహాలో చెంఘీజ్‌ఖాన్‌- కొత్తసొలస మార్గంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న తల్లీకుమారుడు, అత్తా అల్లుడిపై దాడి చేసి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. కొత్తసొలసకు చెందిన సాగి నాగలక్షి, ఆమె కుమారుడు ధనుష్‌ మంగళవారం గ్రామ సమీపంలోని తమ కోళ్లఫారం వద్దకు వెళ్లి పనులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం రాగానే మాస్కులు, టోపీలు ధరించిన ఆరుగులు యువకులు కర్రలు చూపించి అడ్డగించారు. ద్విచక్ర వాహనంతో సహా బాధితులను ముందుగానే పక్కనున్న పత్తిచేలోకి బలవంతంగా తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. నాగలక్ష్మి మెడలోని 3.75 సవర్ల బంగారు గొలుసు, చెవిపోగులు, వెండి పట్టీలు, ఉంగరం లాక్కున్నారు. కొద్దిసేపటికి అదే మార్గంలో అదే గ్రామానికి చెందిన పొనుగుబాటి వీరాంజనేయులు ఫిరంగిపురం సమీపంలోని తాళ్లూరులో ఉన్న తన అత్త గోరంట్ల అంజమ్మను ద్విచక్ర వాహనంపై ఎక్కించుని ఇంటికి వస్తున్నాడు. రోడ్డు పక్కనే తన పొలంలో ఉన్న పత్తిబస్తాను ద్విచక్ర వాహనంపై పెట్టుకోవటానికి వాహనాన్ని ఆపాడు. దుండగులు అక్కడికి వచ్చి వాహనంతో సహా ఇద్దరిని పొలాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టి అంజమ్మ వద్ద ఉన్న చెవి కమ్మలు, ముక్కు పుడక, సెల్‌ఫోన్‌, రూ.1500 నగదు లాక్కున్నారు. వారి వద్ద ఉన్న తినుబండారాలను తీసుకుని ఆరగించి బాధితులను వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు గ్రామస్థులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి దుండగులు జాడ కనిపించలేదు. సంఘటనా స్థలాన్ని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై రాంబాబు సందర్శించారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వచ్చి సాక్ష్యాధారాలను సేకరించింది. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశారు.

అరిస్తే చంపేస్తామని బెదిరింపు

సాగి నాగలక్షి, ధనుష్‌ కోళ్లఫారం నుంచి ఇంటికి బయలుదేరిన అనంతరం ధనుష్‌ బాబాయి శివరామ్‌ కూడా అదేమార్గంలో కోళ్లఫారం నుంచి ఇంటికి వచ్చి చూడగా ధనుష్‌, నాగలక్ష్మి కనిపించలేదు. అనుమానించిన అతను తిరిగి కోళ్ల ఫారం వైపు వెళుతుండగా దుండగుల వద్ద బందీగా ఉన్న వారు గమనించి కేకలు వేయటానికి ప్రయత్నించగా, అరిస్తే చంపేస్తామని దుండగులు ఆయుధాలు చూపి బెదిరించారు. దుండగులు బాధితులతో శ్రీకాకుళం జిల్లా యాసలో తెలుగులో మాట్లాడి బెదిరించారు. వారు వేరే భాషలో మాట్లాడుకున్నట్లు బాధితులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని