logo

AP News: అదితికి వెళితే అథోగతి

విజయవాడ నగరంలో మరో సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. తమ వద్ద గ్రాము బంగారం తాకట్టు పెడితే అధికంగా డబ్బులు ఇస్తామంటూ భవానీపురంలోని అదితి గోల్డ్‌ సంస్థ వినియోగదారులను మోసగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది

Published : 14 Dec 2021 09:18 IST

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

భవానీపురంలోని అదితి గోల్డ్‌ కార్యాలయం

భవానీపురం, గవర్నరుపేట, న్యూస్‌టుడే: విజయవాడ నగరంలో మరో సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. తమ వద్ద గ్రాము బంగారం తాకట్టు పెడితే అధికంగా డబ్బులు ఇస్తామంటూ భవానీపురంలోని అదితి గోల్డ్‌ సంస్థ వినియోగదారులను మోసగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో గ్రాము బంగారం తాకట్టుపెడితే రూ.3 వేలు ఇస్తే తాము రూ.3600లు ఇస్తామంటూ సంస్థ ప్రతినిధులు నమ్మబలికారు. 75 పైసలు వడ్డీ మాత్రమే అని చెప్పడంతో నమ్మి ఎంతో మంది బంగారం తాకట్టు పెట్టారు. గత రెండున్నర నెలలుగా భవానీపురంలోని సంస్థ కార్యాలయాన్ని తెరవడం లేదు. దీంతో మోసపోయినట్లుగా గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఈ విధంగా వెలుగులోకి... అదితి గోల్డ్‌ సంస్థలో బంగారం తాకట్టు పెట్టిన వారు అనేక మంది ఉన్నట్లు సమాచారం. ఇతర బ్యాంకులు, సంస్థల్లో బంగారం ఉంటే వాటిని కూడా విడిపిస్తామని, అప్పుడు ఉన్న మార్కెట్‌ రేటు ప్రకారం మిగిలిన డబ్బులు ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. గ్రాముకు అధిక మొత్తంలో డబ్బులు, తక్కువ వడ్డీ అని చెప్పడంతో చాలా మంది ఆకర్షితులయ్యారు. అధిక సంఖ్యలో ప్రజలు బంగారం తాకట్టు పెట్టారు. భవానీపురానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ అతని సోదరుడికి చెందిన 500 గ్రాముల బంగారాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 6, 7 తేదీల్లో తాకట్టుపెట్టారు. కొన్ని రోజులకే సంస్థ కార్యాలయం తెరవలేదు. అనుమానం వచ్చి ఫోన్‌ చేయగా పని చేయట్లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి భవానీపురం పోలీసులకు సెప్టెంబరు 24న ఫిర్యాదు చేశారు. సోమవారం పోలీసు కమిషనరేట్‌లోని స్పందన కార్యక్రమంలోనూ ఆమె ఫిర్యాదు చేశారు.  

రూ.కోట్లలోనే మోసం... అదితి సంస్థకు విజయవాడలోని భవానీపురం, గవర్నర్‌పేటతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శాఖలున్నాయి. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌, తదితర ప్రాంతాల్లో కూడా కార్యాలయాలున్నాయి. మిగిలిన చోట్ల కూడా మూసివేసినట్లు తెలుస్తోంది. ఒక్క భవానీపురం శాఖలోనే రూ. కోట్ల మేర మోసం జరిగినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కనీసం విచారణ జరిపారా అన్నదానిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేసి ఉంటే నిందితులు దొరికేవారనే అభిప్రాయం బాధితులు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలైనా భవానీపురం పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాధితురాలు విజయలక్ష్మి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల చుట్టూ నాలుగైదు సార్లు తిరిగినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై భవానీపురం సీఐ మురళీకృష్ణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా అదితి గోల్డ్‌ సంస్థకు సంబంధించి తమకు అందిన ఫిర్యాదుపై సెప్టెంబరు 25న కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నిర్వాహకులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని