AP News: పిల్లల కోసం పరితపించి ‘గర్భిణి’ నాటకం.. ఆపై ఏమైందంటే!
ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్టుడే: పిల్లల కోసం పరితపిస్తున్న ఆమె ఆ బాధ తట్టుకోలేక తాను గర్భవతినని అందరికీ చెప్పింది. తొమ్మిది నెలల పాటు ఆ నాటకాన్ని కొనసాగించింది. కాన్పు సమయం దగ్గర పడుతుంటే.. ఏం చేయాలో తెలియలేదు. చివరకు బిడ్డను ప్రసవించాక ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. దీనిపై పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో అందరూ నివ్వెరపోయారు. కృష్ణాజిల్లా కొండపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొండపల్లికి చెందిన యువతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాకు చెందిన వ్యక్తితో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో కుటుంబసభ్యులు, పరిసరాల వారు సూటిపోటి మాటలు అంటున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తాను నెల తప్పినట్లు అత్తగారి ఇంట్లో చెప్పి 9 మాసాల కిందట పుట్టింటికి వచ్చింది. ఈ కాలంలో పొట్ట చుట్టూ వస్త్రాలు చుట్టుకుని, ప్రతి నెల వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి అని వెళ్లేది. ఈ నెల 5న ప్రసవానికి వైద్యులు తేదీ ఇచ్చారని అందరికీ చెప్పి నమ్మించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి తనకు నొప్పులు వచ్చాయని, అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు తనకు కాన్పు చేస్తానని వచ్చి, బిడ్డ పుట్టాక తీసుకెళ్లిపోయారని ఆందోళన చెందుతూ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్, సిబ్బందితో బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. అనుమానంతో ఆమెను వైద్యపరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్ష చేసి ఆ వివాహిత గర్భవతి కాదని, కాన్పు కాలేదని, అది అంతా నాటకమని నిర్ధారించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేయడంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. అందరూ కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ నివ్వెరపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.