logo
Updated : 16/01/2022 13:35 IST

Ap News: సాఫ్ట్‌వేర్‌ పందెంకోడి..లాభాలు చూసి సహకారం అందిస్తున్నారు

ఈనాడు-అమరావతి

తాను పెంచుతున్న పుంజుతో శ్రవణ్‌కుమార్‌

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మనుషులను సొంతూళ్లకే కాదు... సంప్రదాయ వ్యాపకాలకు దగ్గర చేస్తోంది. వ్యవసాయం, చేతిపనులు, స్థానిక ఉద్యోగాలు, వ్యాపారాలు వీటన్నిటిని కాదనుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం వేల కిలోమీటర్లు యువత వలస వెళ్తున్నారు. అయితే... కరోనా ఫుణ్యమా అని గ్రామాలకు తిరిగి వస్తున్నారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో ఇంటి నుంచి పని చేస్తున్నారు. విరామ సమయాన్ని పందెం కోళ్లు, వివిధ జాతుల కోళ్ల పెంపకానికి కేటాయిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఘట్టమనేని శ్రవణ్‌కుమార్‌. పందెం కోళ్లంటే చాలా మందికి బాగా మోజు. సంక్రాంతికి కొన్నిచోట్ల కోడిపందేలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఒక్కో కోడి పుంజును రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తారు. జాగ్రత్తగా చేసుకుంటే కోళ్లు పెంచే వ్యాపకం లాభదాయకమని చెబుతున్నారు శ్రవణ్‌కుమార్‌. పందెం కోళ్లలో పెరూ దేశానికి చెందిన కోళ్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే ఈయన దేశీయజాతి కోళ్లను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫేస్‌బుక్‌లో ప్రత్యేక ఖాతా తెరిచి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు వ్యతిరేకించిన కుటుంబ సభ్యులే లాభాలు చూసి సహకారం అందిస్తున్నారు.

సరదాగా మొదలెట్టి...

పిల్లలకు పౌష్ఠికాహారం కోసం నాటు కోడిగుడ్ల కోసం మార్కెట్‌లో ప్రయత్నిస్తే పాడైన గుడ్లు, నాణ్యత లేని గుడ్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. కొనుగోలు చేసిన గుడ్లు పాడవడంతో పడేయాల్సి వచ్చింది. కరోనాతో పల్లెటూరిలో ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉండడంతో సరదాగా నాటుకోళ్లు పెంచుదామనే ఆలోచనతో ఇంటి వద్ద రెండు కోళ్లతో ప్రారంభించారు. రాత్రివేళ ఉద్యోగం, పగటివేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండడంతో వివిధ జాతుల కోళ్లు, పందెం కోళ్ల గురించి అధ్యయనం చేశారు. ఆసక్తి పెరగడంతో గుడివాడ, భీమవరం, హైదరాబాద్‌లో పందెం కోళ్ల పెంపకందారుల వద్దకు వెళ్లి పుంజులు కొనుగోలు చేశారు. కొన్ని సామాజిక మాధ్యమాలు, స్నేహితుల ద్వారా తెలుసుకుని తెచ్చుకున్నారు. పచ్చకాకి, కాకిడేగ, సేతువు, కక్కెర, రసంగి, నెమలి రకాలు పెంచుతున్నారు. దేశీయ కోళ్లు బెరస, టేకరా జాతి, విడికాళ్ల కోడి జాతులు ఉన్నాయి. తూర్పుజాతి, మెట్టవాటం, రిచ్‌వాటం కోళ్ల జాతులకు ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉంది. పెరూ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కోళ్లను దేశీయజాతి కోళ్లతో సంకరం చేసి కొత్తవి సృష్టిస్తున్నారు. ఒక బ్రీడ్‌ను తయారుచేయాలంటే రెండు సంవత్సరాలకుపైగా పడుతుందన్నారు.

రూ.35వేల పెట్టుబడితో ప్రారంభించి..

కోళ్ల పెంపకంపై ఆసక్తి పెరగడంతో తొలుత రూ.35వేలు పెట్టి కోళ్లు కొనుగోలు చేశారు. క్రమంగా ఆసక్తి పెరిగి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాతుల గురించి తెలుసుకుని వాటి పెంపకం ప్రారంభించారు. రూ.2.5లక్షలు వెచ్చించి కోళ్లకు ఆవాసం నిర్మించారు. కోళ్లకు తరచూ వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు తెలుసుకుని వాటిని అవలంబిస్తున్నారు. అన్నికోళ్లు ఒకేచోట పెంచితే వైరస్‌ వంటి విపత్తు వస్తే జాతి మొత్తం కోల్పోతామని గుర్తించి ప్రకాశం, గుంటూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పెంచుతున్నారు. వైరస్‌ ఒకచోట వ్యాపించి కోళ్లు మరణించినా మిగిలిన చోట్ల ఆకోడి జాతిని కాపాడుకోవచ్చనే భావనతో నాలుగుచోట్ల పెంచుతున్నానని శ్రవణ్‌కుమార్‌ వివరించారు. ఒక్కొక్క గుడ్డు రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. 15రోజుల కోడిపిల్ల రూ.1000, మూడు నెలలు అయితే రూ.3వేలు, 6నెలల కోడిపిల్ల రూ.11వేలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే తన పెట్టుబడి పోగా లాభాలు వస్తున్నాయన్నారు.

సెమన్‌ సేకరించివృద్ధి..

శ్రవణ్‌కుమార్‌ ఎంపిక చేసుకున్న కోడిపుంజుల నుంచి సెమన్‌ సేకరించి నిల్వ చేసి పెట్టలకు వేస్తున్నారు. దీనివల్ల పెట్టలకు గుడ్లు పెట్టే శక్తి పెంపొందిస్తున్నారు. కోడిపుంజు పెట్ట కోళ్లను తొక్కి అలసిపోకుండా చేస్తున్నారు. సేకరించిన సెమన్‌ను సెలైన్‌ వాటర్‌ లేదా కొబ్బరినీళ్లలో కలిపి ి పెట్టకోళ్లకు ఎక్కిస్తున్నారు. పునరుత్పత్తిలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని పుంజులను పెంచుతున్నారు. ఖాళీ సమయాన్ని యువత విభిన్నంగా ఆలోచించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధిలో విభిన్న రంగాలను ఎంచుకుని విజయం సాధించవచ్చని శ్రవణ్‌కుమార్‌ వివరించారు.

సామాజిక మాధ్యమం వేదికగా మార్కెట్‌

శ్రవణ్‌కుమార్‌ వినియోగదారులు ఏజాతి కోళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఏప్రాంతం వారు ఏజాతి కోళ్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు? మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న జాతులు ఏవి? అన్న విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా కోళ్లను పెంచారు. కోడిపిల్లలను, గుడ్లను అమ్మడానికి ఘట్టమనేని ఫామ్స్‌ అనే సామాజిక మాధ్యమాల్లో విక్రయానికి పెట్టారు. సామాజిక మాధ్యమం వేదికగా అమ్మకాలు మొదలెట్టారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుతం సరఫరా చేయలేని విధంగా మార్కెట్‌ ఉందని శ్రవణ్‌ చెబుతున్నారు. సుమారు 5వేల మంది తాను పెడుతున్న వివరాలను చూసి ఎప్పటికప్పుడు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. కొందరు నేరుగా ఫామ్‌ వద్దకు వచ్చి కోళ్లను చూసి కొనుగోలు చేస్తున్నారన్నారు. దేశీయ జాతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం కోడిపిల్లలు, గుడ్లను మాత్రమే అమ్ముతున్నానని, పుంజులను అలాగే పెంచుతున్నానన్నారు. రెండేళ్లుగా కష్టపడితే దేశీయ జాతిలో మంచి కోళ్లను సృష్టించానని, దీనిని మరింత అభివృద్ధి చేసిన తర్వాత మార్కెట్‌లో పెడతానన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని