logo

నిబంధనల ఉల్లంఘన

కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పడం.. పరిమితికి మించి భారీగా సరకులు వేసుకోవడం.. పన్ను చెల్లించకుండానే తిరగడం.. కనీస అగ్నిమాపక నిబంధనలు కూడా

Published : 15 Jan 2022 03:59 IST

కనీస భద్రతా ప్రమాణాలు కరవు

ప్రైవేటు బస్సుల తనిఖీల్లో వెలుగులోకి

ఈనాడు - అమరావతి

కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా అనుమతి తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిప్పడం.. పరిమితికి మించి భారీగా సరకులు వేసుకోవడం.. పన్ను చెల్లించకుండానే తిరగడం.. కనీస అగ్నిమాపక నిబంధనలు కూడా పాటించకపోవడం.. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండానే వాహనం నడపడం వంటి అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. అధిక ధరల ఫిర్యాదులపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై రవాణా అధికారులు తనిఖీల్లో ఇవి వెలుగుచూస్తున్నాయి. కేవలం ప్రయాణికులను మాత్రమే చేరవేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ, దీనికి విరుద్ధంగా వివిధ సరకులను రవాణా చేస్తున్నారు. వేగంతో వెళ్లే బస్సులపై బరువైన వస్తువులను వేయడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా రవాణా శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్నారు.

* జిల్లా మీదుగా రాకపోకలు సాగించే బస్సుల తనిఖీల కోసం రవాణా శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దున ఉన్న వారధి కూడలి, పొట్టిపాడు టోల్‌ ప్లాజా, కీసర టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కోచోట రెండేసి బృందాలు తనిఖీలు సాగిస్తున్నాయి. తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 11 గంటల వరకు సోదాలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. వీటిల్లో పలు ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 150 కేసుల వరకు నమోదు చేశారు. ఇందులో సరకులు తీసుకెళ్తున్నవే ఎక్కువ ఉన్నాయి.

* విజయవాడ నుంచి పలు వ్యాపార వస్తువులను బుక్‌ చేసుకుని పార్శిల్‌ ఏజెన్సీల మాదిరిగా రవాణా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపార సంబంధమైన వస్తువులను రవాణా చేయకూడదు. చాలా ట్రావెల్స్‌ సంస్థలు ఇలా అనుమతి లేకుండా చేరవేస్తున్నాయి. అధికారులు నమోదు చేసిన కేసుల్లో ఈ తరహావి ఎక్కువగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వసూలు చేసే ఛార్జీలను రవాణా శాఖ అధికారులు కొలమానంగా తీసుకుంటున్నారు. వీటి ప్రకారమే ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు ఉంటున్నాయా? లేదా అన్నది పరిశీలిస్తున్నారు. కనీసం ప్రయాణించే వారికి సంబంధించిన జాబితా కూడా ఉండడం లేదు. పలు వాహనాల్లో మంటలను ఆర్పే సిలిండర్లు కూడా లేనట్లు గుర్తించారు. ప్రథమ చికిత్స పెట్టెలు లేవు. బస్సు చోదకులు ముగ్గురు కనీసం డ్రైవింగ్‌ లైసెన్సు కూడా లేకుండా నడుపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని బస్సుల ఆకృతులు మార్చేశారు. సరైన పర్మిట్లు, పన్ను చెల్లించకుండానే నడుపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులపై రవాణా అధికారులు కాంపౌండింగ్‌ ఫీజు వసూలు చేయడంతో పాటు పన్ను, జరిమానా కూడా విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని