logo

గుడివాడ మంచినీటి చెరువుకు గండి

పట్టణానికి మంచినీటిని అందించే చెరువుకు శుక్రవారం గండి పడడంతో స్థానికులతోపాటు సమీప కాలనీల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వందల క్యూసెక్కుల నీరు కట్టను దాటి బయటకు పొంగడంతో

Published : 15 Jan 2022 03:59 IST

మునిగిన పంట చేలు నిర్వహణ లోపంతో అనర్థం

గుడివాడ, న్యూస్‌టుడే

చెరువుకు పడిన గండి

పట్టణానికి మంచినీటిని అందించే చెరువుకు శుక్రవారం గండి పడడంతో స్థానికులతోపాటు సమీప కాలనీల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వందల క్యూసెక్కుల నీరు కట్టను దాటి బయటకు పొంగడంతో పక్కనే ఉన్న పెద ఎరుకపాడు, ఆదర్శనగర్‌ కాలనీలు ముంపు బారిన పడ్డాయి. పక్కనే ఉన్న పంటచేలు నీటిమునిగాయి. నీటి ఒరవడి ఎక్కువగా ఉండటంతో గండిని పూడ్చడం ఇప్పుడే సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.

పట్టణ పరిధిలోని పెద ఎరుకపాడు పక్కనే దాదాపు 60 ఏళ్లనాటి 75 ఎకరాల మంచినీటి చెరువు ద్వారా పట్టణానికి తాగునీటిని అందిస్తున్నారు. జనాభా పెరగడంతో 20 ఏళ్ల కిందట దాని పక్కనే 110 ఎకరాల్లో మరో మంచినీటి చెరువును(రిజర్వాయర్‌)ను పటిష్ఠంగా నిర్మించారు. పాత చెరువు మాత్రం మట్టి కట్టలతో చెట్లతో నిండిపోయింది. దీని నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. చెట్లు కూలడమో, ఎలుకల బొరియలతోనో గుంత పెరిగి వర్షాలకు అది శుక్రవారం మధ్యాహ్నం గండిగా మారింది. నీరు పక్కనే ఉన్న పెద ఎరుకపాడు, ఆదర్శనగర్‌కాలనీల్లోని రోడ్లపైకి చేరడంతో ప్రజలు ఆందోళన చెంది వీధుల్లోకి చేరారు. చెరువుకు గండి పడిన విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఇక్కడి నుంచి నీరు చేలల్లోకి వెళ్లి పక్కనే ఉన్న చంద్రయ్యడ్రెయిన్‌లోకి చేరింది.

రోడ్డుకు గండి కొట్టి చంద్రయ్య డ్రెయిన్‌లోకి మళ్లింపు

నీరు జనావాసాల్లోకి చేరకుండా నాయకులు స్పందించి పొక్లెయిన్‌తో నీరు మరింత త్వరగా డ్రెయిన్‌లోకి చేరేలా సీపూడి రహదారిలో రెండు చోట్ల భారీ గండ్లు కొట్టించారు. దీంతో నీరు నేరుగా చెరువు నుంచి డ్రెయిన్‌లోకి చేరుతోంది. చెరువు గట్లకు చెట్లు ఉండడం వల్ల కోత పెరగకపోవడంతో ప్రమాదం తప్పింది. పరిసరాల్లోని ఇళ్ల ఆవరణల్లోకి నీరు చేరింది. మురుగునీటి పారుదల కూడా సక్రమంగా లేకపోవడంతో నీరు అలాగే నిలిచి ఉంది. దాదాపు వంద ఎకరాల్లోని వరి కుప్పలు, మినుముపైరు చేలల్లోకి నీరు నిలిచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చేందుకు అధికారులు గుత్తేదారుడితో బుసక బస్తాలను సిద్ధం చేయిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, వైకాపా నాయకులు పాలేటి చంటి, అడపా బాబ్జి తదితరులు ముంపుప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని