logo

జోరుగా కోడి పందేలు! రూ.కోట్లలో లావాదేవీలు

కైకలూరు నియోజకవర్గం ఆళ్లపాడులో ఒక కోడి పందెం గరిష్ఠంగా రూ.5లక్షల వరకు కాశారు. శుక్రవారం ఆళ్లపాడులో రూ.కోట్లలో పందేలు కాశారు. దీనికి అదనంగా పేకాట, గుండాట సరేసరి. ఆకివీడు,

Published : 15 Jan 2022 03:59 IST

ఈనాడు, అమరావతి

* కైకలూరు నియోజకవర్గం ఆళ్లపాడులో ఒక కోడి పందెం గరిష్ఠంగా రూ.5లక్షల వరకు కాశారు. శుక్రవారం ఆళ్లపాడులో రూ.కోట్లలో పందేలు కాశారు. దీనికి అదనంగా పేకాట, గుండాట సరేసరి. ఆకివీడు, భీమవరం ప్రాంతాల నుంచి ఇక్కడి బరికి పందెం రాయుళ్లు వచ్చారు. ఇదే నియోజకవర్గంలో చేపలపాడు గ్రామంలో 20 పందేలు రూ.లక్ష చొప్పున కాశారు. ఈ పందాల్లో ఒక్కో పుంజు ఖరీదు రూ.50వేలు కావడం గమనార్హం. ఇక్కడకు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా పందేల కోసం జనం వచ్చారు.

* పామర్రు నియోజకవర్గం కూచిపూడిలో వర్షాల వల్ల ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో కోడి పందేలను నిర్వహించారు. వాటితోపాటు పేకాట, గుండాట నంబర్లాట తదితర జూదాలు జోరుగా సాగాయి. యుద్దనపూడి వద్ద కోడిపందేల బరులతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల వాహనాలు నిలిచిపోయాయి.

అంపాపురంలో కోడి పందేల బరి

రూ.కోట్లలో నగదు.. విచ్చలవిడిగా జూదాలు.. రూ.లక్షల్లో కోడిపందేలు.. మద్యం ప్రవాహం.. విందులు.. ఇదీ శుక్రవారం భోగి సందర్భంగా పల్లెల్లో కనిపించిన సంక్రాంతి సంబరాల తీరు. గత రెండు రోజులుగా హడావుడి చేసిన పోలీసులు శుక్రవారం మౌనంగా ఉన్నారు. బరులు యధావిధిగా నడిచాయి. 144 సెక్షన్‌ లేదు.. భౌతిక దూరం లేదు. కొవిడ్‌ నిబంధనలు తూచ్‌. వాన జల్లులను సైతం లెక్క చేయకుండా బరులు సిద్ధం చేశారు. కొన్ని గ్రామాల్లో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా పందేలు నిర్వహించారు. ఎక్కడెక్కడి నుంచో పందెం రాయుళ్లు, జూదగాళ్లు వచ్చారు. కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు మండలాల్లో భారీగా బరులు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే పాటల ద్వారా బరుల నిర్వహణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం పోలీసులు కొంత హడావుడి చేసి బరులు తొలగిస్తున్నట్లు ఫొటోలు తీసుకున్నారు. వారు వెళ్లిపోగానే బరులు సిద్ధం చేశారు. పందెం రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు నిర్వహించారు. ఒక్కో బరిలో రోజులో కనీసం 50 పందేలు నిర్వహించారు. కేవలం పందేల ద్వారానే రూ.కోటి చేతులుమారాయి. పైపందేలు, పేకాల, మద్యం, మాంసాహారం వ్యాపారం సరేసరి. ఇలాంటి బరులు కైకలూరు నియోజకవర్గంలో దాదాపు 60కు పైగా వెలిశాయి. పామర్రు నియోజకవర్గంలోనూ పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారి పక్కనే నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలువురు మండల స్థాయి నాయకులు, కొంత మంది ప్రజాప్రతినిధులు కోడి పందేలకు హాజరయ్యారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ పందేలు జోరుగా సాగాయి.

ఎల్‌ఈడీ తెరలపై తిలకిస్తున్న చిన్నారులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కావడంతో హైదరాబాద్‌ ప్రాంతం నుంచి జనం భారీగా వచ్చారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలంలో భారీగా పందేలు జరిగాయి. ఓ ప్రజాప్రతినిధి వియ్యంకుడు లింగాల సమీపంలో ఏర్పాటు చేసిన బరిలోనూ రూ.లక్షల్లో లావాదేవీలు జరిగాయి. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో తెలంగాణ మద్యం ప్రవహించింది. చందర్లపాడు, నందిగామ కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో మూడు గ్రామాల్లో చొప్పున కోడిపందేలు నిర్వహించారు. ఇక్కడ కూడా మొదట పోలీసులు హడావుడి చేసినా నేతల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో మౌనంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి, చాట్రాయి, నూజివీడు, ముసునూరు మండలాల్లో బరులు ఏర్పాటయ్యాయి. గుడివాడ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. ఉత్సవాల పేరుతో పందేలు, జూదాలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం అంబాపురంలో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. నున్న, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో కోడిపందేలు జోరుగా సాగాయి. కమిషనరేట్‌ పోలీసులు సైతం మౌనంగానే ఉన్నారు. మూడు రోజులు కోడిపందేల నిర్వహణకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో భారీగానే జరిగాయి. పెనమలూరు మండలంలోనూ పందేలు జరిగాయి. అసలైన బరులు శనివారం నిర్వహించనున్నారు.

అంపాపురంలో వాహనాల పార్కింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని