logo

పేదరికం విద్యకు అడ్డు కాకూడదు

పేదరికం విద్యకు అడ్డుకాకూడదని.. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కాకుమాను నన్నపనేని వారి జిల్లా పరిషత్‌

Published : 17 Jan 2022 04:55 IST

పాఠశాల వ్యవస్థాపకుడు నాగయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్‌, సుచరిత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పూర్వ విద్యార్థులు

కాకుమాను: పేదరికం విద్యకు అడ్డుకాకూడదని.. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కాకుమాను నన్నపనేని వారి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరితతో కలిసి ఆయన హాజరయ్యారు. తొలుత పాఠశాల వ్యవస్థాపకులు నన్నపనేని నాగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాబార్డు నిధులతో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సురేష్‌ జ్యోతి వెలిగించి సభలో మాట్లాడారు. ఉద్యోగ అవకాశాలు పొందాలంటే.. చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఆంగ్లంలో పట్టు సాధించాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒ నైపుణ్యాన్ని పెంపొందించే కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాకుమాను పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. అందరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. బడిని జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు విద్యను అందించాలని 75 ఏళ్ల క్రితం నాగయ్య అనే వ్యక్తికి వచ్చిన ఒక ఆలోచన ఎంతోమందికి మంచి జీవితాలను అందించిందన్నారు. పాఠశాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందని, సీఎంతో మాట్లాడి ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. పూర్వ విద్యార్థి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పాఠశాలలకు కేంద్రం కూడా నిధులు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ సుబ్బారావు, డీఈవో గంగాభవాని, పారిశ్రామికవేత్త ప్రసాద్‌బాబు, ఏరీస్‌ రత్తయ్య, ఐఏఎస్‌ అధికారి ఎలీషా, రాష్ట్ర టెలికాం సంస్థ జనరల్‌ మేనేజర్‌ రత్నబాబు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ రామ్‌గోపాల్‌, హెచ్‌ఎం రోస్‌మేరీ, సర్పంచి శివకుమారి, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని