logo

4రోజులు 1307కేసులు

జిల్లాలో కరోనా గడిచిన నాలుగు రోజుల్లో 1307 వచ్చాయి. ఇవి నానాటికీ ఎగబాకుతున్నాయి. మూడు రోజుల నుంచి సగటున రోజుకు 300 పైగా నమోదు కావడమే జిల్లాలో వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. గడిచిన 24 గంటల్లో 368 కేసులు బ

Published : 17 Jan 2022 04:55 IST

ఈనాడు, అమరావతి

జిల్లాలో కరోనా గడిచిన నాలుగు రోజుల్లో 1307 వచ్చాయి. ఇవి నానాటికీ ఎగబాకుతున్నాయి. మూడు రోజుల నుంచి సగటున రోజుకు 300 పైగా నమోదు కావడమే జిల్లాలో వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. గడిచిన 24 గంటల్లో 368 కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా గుంటూరు నగరంలో 185 రాగా ఆ తర్వాత మంగళగిరి 33, నరసరావుపేట 26, తెనాలి 22, తాడేపల్లిలో 20 చొప్పున వచ్చాయి. గ్రామీణంలో కన్నా పట్టణాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. జనాల రాకపోకలు అధికంగా ఉండడం, భౌతిక దూరం పాటింపు వంటివి విస్మరించడం వల్లే పట్టణాల్లో అధిక కేసులు రావడానికి కారణమవుతోందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖవర్గాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా రచ్చబండ్లపై కూర్చోవద్దని విస్తృత ప్రచారం కల్పించారు. చాలా వరకు మాస్కుధారణ తప్పనిసరి అని చెప్పటంతో దాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలతోనే గ్రామీణంలో వైరస్‌ కేసులు అదుపులో ఉండటానికి కారణమవుతోంది. పట్టణాల్లో పర్యవేక్షణ కొరవడటం, మాస్కులు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కలిగిన వారు యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరైనా అనుమానించి పరీక్షలు చేయించుకోమని సూచించే వరకు అప్రమత్తం కావడం లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం 1893 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులు చాలా స్వల్పంగా ఉన్నాయి.

వైరస్‌బారిన పీజీలు, హౌస్‌సర్జన్లు

వైద్యుల బృందం మెల్లగా వైరస్‌బారిన పడుతోంది. మూడు రోజులుగా పరిశీలిస్తే గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఐదుగురు పీజీ వైద్యులు, మరో ముగ్గురు హౌస్‌ సర్జన్లకు వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రి వైద్యులు ఆందోళన చెందారు. ఇకమీదట పీపీఈ కిట్లు ధరించాకే వార్డుల్లో కేసుల పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన పీజీలు, హౌస్‌ సర్జన్లే దీని బారిన పడితే మున్ముందు వైరస్‌తో పోరాటం చేయడానికి వైద్యులు ఉండరని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని ఆయా విభాగాధిపతులు సూచించారు. పారామెడికల్‌ సిబ్బంది మరో ఐదారుగురు పాజిటవయ్యారని, అందరూ ఇళ్ల వద్దే చికిత్సలు పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

వార్డుల్లో బయటపడుతున్న కేసులు

ఇతర వ్యాధులతో చికిత్స పొందటానికి ఇన్‌ పేషెంట్లుగా ఉంటున్న వారిలోనూ కరోనా లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల క్రితం ఒకరు ఎముకలు-కీళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం, మరొకరు జనరల్‌ సర్జరీ కోసం శస్త్రచికిత్స మందిరాలకు వచ్చారు. వారు దగ్గు, జలుబు వంటి లక్షణాలు కలిగి ఉండడంతో తొలుత వారికి వైరస్‌ పరీక్షలు చేయాలని పంపారు. వారిద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారికి శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. ఇలా పలు విభాగాల్లో అనుమానిత కేసులకు పరీక్షలు చేయిస్తుంటే పాజిటివ్‌ వస్తోందని వైద్యులు తెలిపారు. ఈసారి జలుబు అనేది చలి వల్ల వస్తుందా లేక కరోనా లక్షణమా అనేది అర్థం కాకుండా ఉందని వైద్యాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా చలికి జలుబు చేస్తుంది. అలాంటిది కరోనా కేసుల్లోనూ జలుబు ఒక లక్షణం కావడంతో అది ప్లూనా లేక కరోనా అనేది నిర్ధారించుకోవటానికి పరీక్షలు చేయించాల్సి వస్తోందని, ఈ క్రమంలోనూ గడిచిన వారం రోజుల్లో ఒక్క జీజీహెచ్‌లోనే నాలుగు కేసులు వచ్చినట్లు తెలిపారు. మొత్తంగా కేసులు పెరుగుతున్నా ఎవరికీ ఇబ్బంది కలగటం లేదు. వైరస్‌ నిర్ధారణ అయిన ఐదు రోజుల్లోపే తిరిగి నెగెటివ్‌ వచ్చేస్తోందని జీజీహెచ్‌లో కరోనా కేసులు పరిశీలిస్తున్న వైద్యాధికారి ఒకరు వివరించారు. గతంలో దగ్గు అనేది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపేది. ప్రస్తుతం వస్తున్న కరోనా కేసులను చూస్తుంటే లంగ్స్‌పై ప్రభావం ఏ మాత్రం కనిపించటం లేదు. ఇది శుభపరిణామమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని