logo

విస్తరణపై మెలిక

నగరంలోని నందివెలుగు రోడ్డు 100 అడుగులకు విస్తరిస్తారా లేక 80 అడుగులు చేస్తారా అనేది అస్పష్టంగా ఉంది. ఆ రహదారిలో ఇరువైపులా ఇళ్లు, స్థలాలు ఉన్న వారికి ఈ విషయంలో ఒక స్పష్టత లేదు. మొత్తంగా

Published : 17 Jan 2022 04:55 IST

80 లేదా 100 అడుగులపై కొరవడిన స్పష్టత

కొలిక్కిరాని నందివెలుగు రోడ్డు పనులు

ఈనాడు, అమరావతి

గాంధీబొమ్మ నుంచి విస్తరణకు నోచుకోని రహదారి

నగరంలోని నందివెలుగు రోడ్డు 100 అడుగులకు విస్తరిస్తారా లేక 80 అడుగులు చేస్తారా అనేది అస్పష్టంగా ఉంది. ఆ రహదారిలో ఇరువైపులా ఇళ్లు, స్థలాలు ఉన్న వారికి ఈ విషయంలో ఒక స్పష్టత లేదు. మొత్తంగా ప్రజలు అయోమయంలో ఉన్నారు. రైల్వే గేటు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు విస్తరించిన దీన్ని 100 అడుగులకు విస్తరించేలా సుమారు రెండేళ్ల క్రితమే పనులు ప్రారంభించారు. ఆ మేరకు రహదారి విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోయినవారికి 100 అడుగులకు లెక్కించి ఇప్పటికే పరిహారం కింద టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. వాటిని చాలా మంది అమ్ముకున్నారు. ప్రస్తుతం 70 శాతం విస్తరణ పనులు పూర్తయ్యాయి. మరో 30 శాతం మిగిలి ఉన్నాయి. ఆ రోడ్డులో కూర్చొన్న గాంధీ బొమ్మ నుంచి బస్టాండ్‌ వరకు విస్తరించాలి. ఇది బస్టాండ్‌కు సమీప ప్రాంతం కావడం, ఆపై జనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ షాపుల నిర్వాహకులకు వ్యాపారాలు బాగా ఉంటాయి.

ఇక్కడ 100 అడుగులు చేస్తే తమకు షాపులు మిగలవని, విస్తరణలో భాగంగా సింహభాగం స్థలాన్ని కోల్పోతామని, ఇక్కడ మాత్రం 80 అడుగులతో సరిపెట్టాలని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధిని కలిసి కోరారు. వ్యాపారుల మాట కాదనలేక ఆయన కౌన్సిల్‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో 80 అడుగులే విస్తరించేలా ఆమోదం పొందారు. మిగిలిన వారు ఈ విషయం తెలుసుకుని కొంత భాగం 100 అడుగులకు మరికొంత 80 చేయాలనుకోవడం ఏమిటి? చేస్తే రహదారి మొత్తం ఏకంగా 100 అడుగులకు చేయాలి లేదంటే 80 అడుగులకే పరిమితం కావాలని నగరపాలక అధికారులను కోరారు. ప్రస్తుతం ఎన్ని అడుగులకు విస్తరిస్తారో స్పష్టత ఇచ్చాకే తాము టీడీఆర బాండ్లు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో ఆ రహదారి విస్తరణ పనులు కొద్ది నెలలు క్రితం నిలిచిపోయాయి.

ఇప్పటికే వంద అడుగుల పనులు చేసిన ప్రాంతంలో రోడ్డు మధ్యలో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండుకు దగ్గరలో పనులు ఆగిపోవడంతో అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడి వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. నిత్యం వాహనాలు, పాదచారుల రాకపోకలతో కూర్చొనే గాంధీబొమ్మ విపరీతమైన జనరద్దీ ఏర్పడుతోంది. ఇక్కడ కూడా గతంలో నిర్ణయించినట్లు 100 అడుగులకే పనులు చేపట్టి ఉంటే ఇప్పటికే ఈ ప్రాంతంలోనూ సెంట్రల్‌ డివైడర్‌, లైటింగ్‌ ఏర్పాటయ్యేవని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు త్వరలో జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 100 అడుగులని చెప్పి కొంతభాగాన్ని 80 అడుగులకే పరిమితం చేస్తే దానివల్ల ఆ ప్రాంత వాసులు కోర్టు దాకా వెళ్లే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రాకుండా మెజార్టీ ప్రజల అభీష్టానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. దీనిపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను వివరణ కోరగా ‘కూర్చొనేగాంధీ బొమ్మ వద్ద షాపులు, మసీదు అడ్డువస్తున్నాయి. ప్రధానంగా షాపుల నిర్వాహకులు 80 అడుగులతో ముగించాలని కోరుతున్నారు. దీనిపై నగరపాలక కౌన్సిల్‌ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని