logo
Updated : 17 Jan 2022 07:44 IST

Vijayawada: ఇదోరకమైన నేరం..!

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

జనవరి 8వ తేదీ రాత్రి 7.15 గంటల సమయంలో ఏలూరు లాకులు కూడలిలో ద్విచక్ర వాహనంపె వెళుతున్న ఓ యువకుడు అదుపు తప్పి పడిపోయాడు. అటుగా వెళుతున్న జయశంకర్‌ అతడిని పైకి లేపుతుండగా, మరో ఇద్దరు యువకులు వచ్చి సాయం చేశారు. ఆ తర్వాత సాయం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు, కిందపడిన యువకుడు.. ముగ్గురు కలిసి అదే ద్విచక్రవాహనంపై తుర్రు మంటూ వెళ్లిపోయారు. ఇంతలో జయశంకర్‌ తను జేబును చూసుకుంటే.. రూ.15వేల విలువైన చరవాణి కనిపించలేదు. పడిపోతున్నట్లు నటించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఇలా నాటకమాడి చాకచక్యంగా చరవాణి దొంగిలించాడు.

* కంప్యూటర్‌ పని వచ్చా.. మీకు రోజుకు రూ.1800 జీతం. ఇంటి నుంచే పనిచేయవచ్చు.. అంటూ ఓ యువతి చరవాణికి మెసేజ్‌ వచ్చింది. దీనికి ఆమె ఆకర్షితులై.. వాట్సాప్‌ ఛాటింగ్‌ చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోమనని అవతలి వ్యక్తి చెప్పడంతో... తన బ్యాంకు ఖాతా, భర్త, తల్లి ఖాతాలను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మీరు పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మించారు. ఆమె నమ్మి ముందుగా రూ.200లు పెట్టుబడి పెట్టారు. వెంటనే ఆమెకు రూ.363లు ఆదాయం వచ్చింది. పూర్తిగా నమ్మకం కలగటంతో నాలుగు విడతల్లో రూ.3,62,084 చెల్లించగా, ఆమెకు రూ.7,35,480ల ఆదాయం వచ్చిందని ఫోన్‌కు సమాచారం వచ్చింది. సదరు సొమ్మును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా కుదరలేదు. ఇంటి నుంచే ఉద్యోగం అంటూ నమ్మి మోసపోయిందా యువతి.

* ఫేస్‌బుక్‌లో లోను ఇస్తామనే ప్రకటన చూసి దరఖాస్తు చేశాడో యువకుడు. తర్వాత రోజే ఒక వ్యక్తి ఫోన్‌ చేసి, మీకు రూ.3లక్షల రుణం వచ్చిందని, దీనికి మీరు బీమా చేయాలని చెప్పి రూ.4,500లు కట్టించుకున్నారు. ఆ తర్వాత రోజు ఈఎంఐ ఛార్జీలు, ఆర్‌బీఐ ఛార్జీలు, జీఎస్టీ, ఇన్‌వాయిస్‌లు అంటూ.. సదరు యువకుడి నుంచి రూ.65,000, రూ.20,000 రూ.27,000 రూ.3,08,332లు ఇలా... రూ.8,10,464లు వసూలు చేశారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. రూ.3లక్షల రుణానికి రూ.8.10లక్షలు ఎలా కట్టారంటే... మోసగాళ్ల తియ్యని మాటలకు మోసపోయానంటున్నారు బాధితుడు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రోజుకో కొత్త తరహా మోసం నగరవాసులను భయపెడుతోంది. ఒకపుడు ఏటీఎం కేంద్రాల్లో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయటంతో ఆ తరహా మోసాలు కొంత మేర తగ్గాయి. ఇప్పుడు సాయం పేరుతో.. మనకు తెలియకుండానే జేబులో ఉన్న చరవాణి, పర్సులు, వాహనాలు దొంగిలించేస్తున్నారు.

అపరిచిత ప్రకటనలను నమ్మొద్దు

ఇంటి వద్ద నుంచే పని చేయండి..మీకు ఆక్షణీయమైన జీతం ఇస్తామంటే.. అందులో మోసం ఉన్నట్టే లెక్క. ఒక వ్యక్తికి రూ.వేలలో జీతం చెల్లిస్తున్నారంటే.. అతని పనితీరు బాగుంటేనే ఇస్తారు. అదేమీ లేకుండా, విద్యార్హతలు లేకపోయినా కంప్యూటర్‌ పని వస్తే చాలని అంటున్నారంటే.. అనుమానించాల్సిందే. రిజిస్ట్రేషన్‌ పేరిట చరవాణి నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు అడిగారంటే.. మోసం చేసేందుకే అని గుర్తించమంటున్నారు పోలీసు అధికారులు. ఫేస్‌బుక్‌ల్లో ఇలాంటి మోసపు ప్రకటనలు వస్తుంటాయి. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన పలు సైబర్‌ నేరాల్లో ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయిన వారే అధికంగా ఉన్నారు.

లింక్‌లు క్లిక్‌ చేయవద్దు...

చరవాణులు, మెయిల్స్‌కు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను అసలు క్లిక్‌ చేయవద్దంటున్నారు సైబర్‌ నిపుణులు. వాటిని క్లిక్‌ చేస్తే చరవాణితో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. మీ చరవాణికి మేసేజ్‌ రాకుండానే, మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తారని చెబుతున్నారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను నమ్మొద్దు. చరవాణులు, మెయిల్స్‌కు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయకూడదు. సైబర్‌ నేరగాళ్లు కొందరు మోసం చేయాలనే ఉద్దేశంతో ఇలా పంపిస్తున్నారు. ఆయా లింక్‌లను క్లిక్‌ చేస్తే మీ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు తెలిసిపోతాయి. మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ మోసానికి గురైతే త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ సొమ్మును వెనక్కి తీసుకువచ్చేందుకు వీలుంటుంది.

- కాంతిరాణా టాటా, పోలీస్‌ కమిషనర్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని