logo

ఈఎన్‌టీ ఓపీ రెట్టింపు

వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం, ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం అధికమవ్వడం.. వంటి కారణాలతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విజయవాడ

Published : 17 Jan 2022 04:55 IST

కొత్తాసుపత్రికి వచ్చే రోగుల్లో 20శాతం వీరే

కాలుష్యం, స్మార్ట్‌ఫోన్ల అధిక వినియోగమే కారణం

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, విజయవాడ వైద్యం

కొత్తాసుపత్రి ఈఎన్‌టీ విభాగానికి చెందిన వైద్య బృందం

వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం, ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం అధికమవ్వడం.. వంటి కారణాలతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈఎన్‌టీ విభాగానికి పెరుగుతున్న బాధితుల తాకిడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. గత ఏడాదిలోనే కేసుల సంఖ్య అమాంతం రెట్టింపు అయింది. 2021 ఫిబ్రవరిలో వెయ్యి లోపే ఓపీ ఉండగా.. డిసెంబర్‌కు వచ్చేసరికి రెట్టింపు పెరిగారు. వాతావరణ కాలుష్యం కారణంగా సైనస్‌ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. సెల్‌ఫోన్లు, ఇయర్‌పాడ్స్‌ వాడకం పెరగడంతో అధిక శాతం మందికి చెవికి సంబంధించిన సమస్యలు కూడా కొవిడ్‌ సమయంలో బాగా పెరిగాయి.

కొవిడ్‌ రెండో దశ అనంతరం ప్రభుత్వాసుపత్రిలో సాధారణ సేవలు పునరుద్ధరించిన తర్వాత 2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలల్లో 270కు పైగా ఈఎన్‌టీకి సంబంధించిన సర్జరీలను కొత్తాసుపత్రిలో నిర్వహించారు. ఆరు నెలల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా అధిక సంఖ్యలో జరిగాయి. గతంతో పోలిస్తే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని అన్ని వైద్య విభాగాల కంటే ఈఎన్‌టీకే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. అత్యాధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉండడంతో ఈఎన్‌టీకి సంబంధించినంత వరకు ప్రభుత్వాసుపత్రికే అధిక సంఖ్యలో వస్తున్నారు.

వినికిడి శస్త్రచికిత్సలే అధికం..

స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంగా మారిపోవడంతో పాటు ఇయర్‌ ఫోన్స్‌తోనే రోజంతా ఉండే వారి సంఖ్య పెరిగిపోయింది. అందుకే అత్యధికంగా వినికిడి సమస్యకు సంబంధించిన సర్జరీలే ఆసుపత్రిలో జరుగుతున్నాయి. కొవిడ్‌ సమయంలో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, టీవీల వినియోగం బాగా పెరిగిపోవడం కూడా దీనికి కారణమే. ఆ తర్వాత ముక్కుకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్లు, సైనస్‌ సమస్యలతో వస్తున్న వాళ్లే అధికంగా ఉన్నారు. పలు రకాల అలర్జీల బారినపడి వస్తున్న వారూ ఉన్నారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారి గొంతు, నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యల బారినపడుతున్న వాళ్లు విజయవాడ నగరంలో అధికంగా ఉన్నారు. ఇలాంటి వారికి సంబంధించిన సర్జరీలు కూడా కొత్తాసుపత్రిలో జరుగుతున్నాయి. ఆసుపత్రిలోని అన్ని వైద్య విభాగాలకు వచ్చే రోగులలో 20శాతం ఈఎన్‌టీకే ఉంటున్నారు.

కాలుష్యం బాగా పెరిగిపోవడంతో..- డా.కె.రవి, ఈఎన్‌టీ విభాగాధిపతి, విజయవాడ

ఎక్కువ శాతం రోగులు చెవి, గొంతు నొప్పులతో వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీనివల్ల అనేకరకాల అలర్జీల బారిన ప్రజలు పడుతున్నారు. ప్రజలంతా ముక్కు, గొంతును కప్పి ఉంచేలా మాస్క్‌ను వాడాలి. దీనివల్ల అలర్జీల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ప్రస్తుతం చలి కూడా అధికంగా ఉండడం వల్ల.. చెవి పోటు, తలనొప్పులతో వస్తున్న వాళ్లూ పెరిగారు.

కొవిడ్‌ క్లిష్ట సమయంలోనూ సేవలు.. - డా.స్వరూప్‌కాంత్‌, ఈఎన్‌టీ విభాగం

విజయవాడ జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య పరికరాలున్నాయి. అందువల్లే మెరుగైన వైద్యాన్ని అందించగలుగుతున్నాం. కొవిడ్‌ బాధితులు అధికంగా ఉన్న క్లిష్ట సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు మంచి వైద్యం అందించాం. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తున్న వారిలో గొంతు క్యాన్సర్‌ బాధితులు కూడా పెరుగుతున్నారు. వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది గొంతు, అలర్జీలతోనే ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని