logo

రాతి గోపురం..బంగారు తాపడం

ఇంద్రకీలాద్రిపై కొలువైన పురాతన శివాలయం కొత్తరూపు సంతరించుకోనుంది. శతాబ్దాల కిందట సున్నంతో నిర్మించిన గోపురం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయింది. తాజాగా రాతితో పూర్తిగా గోపురం నిర్మించేందుకు

Published : 17 Jan 2022 04:55 IST

రూ.4 కోట్లతో నిర్మాణం.. దాతల సాయం

ఇంద్రకీలాద్రిపై శివాలయానికి కొత్త రూపు

ఈనాడు, అమరావతి

ఇంద్రకీలాద్రిపై కొలువైన శివాలయం

ఇంద్రకీలాద్రిపై కొలువైన పురాతన శివాలయం కొత్తరూపు సంతరించుకోనుంది. శతాబ్దాల కిందట సున్నంతో నిర్మించిన గోపురం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయింది. తాజాగా రాతితో పూర్తిగా గోపురం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాతి గోపురంపై బంగారు తాపడం చేయించనున్నారు. దీని కోసం అవసరమైన బంగారం దాతల నుంచి విరాళాల రూపంలో సేకరించనున్నారు. శివాలయం గోపురం నిర్మాణానికి అవసరమైన రాళ్లను చిలకలూరిపేట క్వారీలోనే సిద్ధం చేయించి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసి పాత గోపురం తొలగించే పనులు ఆరంభించనున్నారు. అనంతరం అత్యాధునిక పద్ధతిలో నిర్మించబోయే రాతి గోపురం నాలుగు నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. అందుకే ముందుగానే అవసరమైన రాళ్లను పక్కాగా తయారు చేయించి తీసుకొస్తున్నారు. వాటిని వరుస క్రమంలో పేర్చుకుంటూ వెళ్లిపోయేలా నిర్మాణం ఉంటుంది.

విజయవాడ నగరంలో నుంచి చూస్తే ఇంద్రకీలాద్రిపై ఉండే శివాలయమే దర్శనమిస్తుంది. అమ్మవారి ప్రధాన ఆలయం లోపలి వైపు ఉంటుంది. బయట నగరం మొత్తం కనిపించేది శివాలయ గోపురమే. ఈ అతిపురాతనమైన గోపురం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతుండడంతో కొత్తగా రాతితో నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురానికి బంగారు తాపడం వేయడం చాలా కష్టం. గోపురానికి ముందుగా రాగి తాపడం వేస్తారు. దానిపైన బంగారు పూత వస్తుంది. తాపడం వేసేందుకు గోపురానికి రంధ్రాలు చేయాల్సి ఉంటుంది. సిమెంటు, సున్నంతో చేసిన గోపురం అయితే.. వర్షాకాలంలో నీళ్లు రంధ్రాల ద్వారా లోపలకు చేరి.. ఫంగస్‌ వచ్చేస్తుంది. బయటకు మాత్రం బంగారు తాపడం బాగానే కనిపిస్తుంది.. లోపలి వైపు ఫంగస్‌ పెరిగిపోతుంది. అందుకే రాతి గోపురం అయితే ఈ సమస్య ఉండదని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

బంగారం సేకరణకు బ్యాంకు ఖాతా..

శివాలయానికి బంగారు తాపడం చేయించేందుకు దాతల సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికే దాతల నుంచి బంగారం స్వీకరణకు ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.70 కోట్లలో నుంచి రూ.4 కోట్లను శివాలయం కోసం వినియోగించనున్నారు. శివాలయం గోపురం నిర్మాణం ఈ డబ్బులతో చేపట్టనున్నారు. ఇప్పటికే గోపుర నిర్మాణానికి స్లాబ్‌ ఎత్తు వరకు అవసరమైన రాళ్లను తయారు చేయించి తీసుకొచ్చారు. గతంలో ఆలయం నిర్మించే ప్రదేశం వద్దకే ముడి రాతిని తీసుకొచ్చి చెక్కేవాళ్లు. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకుండా క్వారీలోనే చెక్కించి తీసుకొస్తున్నారు.
అందుకే నాలుగు నెలల్లో రాతి గోపుర నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. శివాలయ కొత్త గోపురం పూర్తయిన తర్వాత బంగారు తాపడం ఏర్పాటు చేస్తే.. ఇంద్రకీలాద్రికి సైతం కొత్త వెలుగులు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు