logo

కత్తికొట్టినపందెంకోళ్లు

జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగాయి. పెద్ద, చిన్న బరులు వందల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. నోటీసులతో హడావుడి చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పండుగ వచ్చే సరికి వెనక్కి తగ్గారు. దీంతో దాదాపు

Published : 17 Jan 2022 04:55 IST

జిల్లాలో వందల సంఖ్యలో బరులు

చూసీచూడనట్లువ్యవహరించిన పోలీసులు

ఈనాడు - అమరావతి

అంపాపురంలో కోడి పందేలు...

జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగాయి. పెద్ద, చిన్న బరులు వందల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. నోటీసులతో హడావుడి చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పండుగ వచ్చే సరికి వెనక్కి తగ్గారు. దీంతో దాదాపు అన్ని మండలాల్లో బరులు వెలిశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జోరు కొంత తగ్గింది. బరుల సంఖ్య కూడా తగ్గింది. లావాదేవీల కూడా తగ్గాయి. కేసుల భయంతో పలువురు పందేలు కాయడానికి వెనుకాడారు. కత్తికట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం కాసేవారి పంతమే నెగ్గింది. కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు భారీగా ఆడారు. కోతముక్కలో అయితే డబ్బు భారీగా చేతులు మారింది. మద్యం ఏరులై పారింది. బరుల వద్ద వ్యాపారం కూడా అదే స్థాయిలో జరిగింది. జిల్లాల నుంచి పందెం కాసేందుకు తరలివచ్చారు. మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పలు చోట్ల వాగ్వాదాలు ఘర్షణలకు దారితీసింది. ఆదివారం రాత్రి వరకు కోడి పందేలు, జూదం జోరుగా సాగింది. ఎక్కువ చోట్ల అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే వీటిని ఏర్పాటు చేశారు. ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు.

* జిల్లాలోనే పెద్ద శిబిరం బాపులపాడు మండలం అంపాపురంలో ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పందేలు సాగాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో నియంత్రించేందుకు ప్రైవేటు గార్డులను నియమించారు. ఇది చెన్నై - కోల్‌కతా జాతీయ రాహదారి పక్కనే ఉండడంతో పందెం కాసేవారు భారీగానే తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీరి రక్షణ కోసం బౌన్సర్లను కూడా నియమించారు. పందేలను తిలకించేందుకు ఎల్‌ఈడీ తెరలను బిగించారు. ఇక్కడ వాహనాల పార్కింగ్‌కు రుసుము కూడా వసూలు చేశారు. కోతముక్క, గుండాట, కోడి పందేలు పెద్దఎత్తున జరిగాయి.  

* కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, కంకిపాడు, ఉప్పలూరు, ఉయ్యూరు మండలంలోని బోళ్లపాడు, ఆకునూరు, తదితర ప్రాంతాల్లో పందేలు భారీగా సాగాయి. పెనమలూరు మండలంలో ఏటా పందేలు భారీగా సాగేవి. ఈసారి యనమలకుదురు, చోడవరం, తదితర చోట్లకే పరిమితమయ్యాయి. నెంబర్లాట, గుండాట, కోతముక్క, రాట్నం, తదితర జూదక్రీడలు జరిగాయి. మద్యం ప్రభావం అధికంగా ఉంది. ఉయ్యూరు మండలంలో రెండు చోట్లా ప్రభుత్వ స్థలాల్లోనే బరులు ఏర్పాటు చేయడం గమనార్హం. బోళ్లపాడులో ఒకే వ్యక్తికి నాలుగు పందేలు గెలిచిన వ్యక్తికి బహుమతి కింద బుల్లెట్‌ను ప్రకటించారు. గుడివాడ మండలం లింగవరం, దొండపాడు, బిల్లపాడు, బొమ్ములూరు, తదితర ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పందేలు జరిగాయి.

* గుడివాడ నుంచి లింగవరం వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన బరిలో పెద్దఎత్తున డబ్బు చేతులు మారింది. కోడి పందేలు, గుండాట, పేకాటతో పాటు ఈ సారి క్యాసినో కూడా ఏర్పాటు చేశారు. దీనికి ప్రవేశ రుసుం కింద రూ.10వేలు వసూలు చేశారు. ఇందులో గోవా నుంచి రప్పించిన ఛీర్‌గర్ల్స్‌ నృత్యాలు చేశారు. ప్రత్యేకంగా లైటింగ్‌తో స్టేజిని ఏర్పాటు చేసి సినీ పాటలకు డ్యాన్యులు నిర్వహించారు. వత్సవాయి మండలం లింగాలలో పెద్ద బరి ఏర్పాటు చేశారు. ఇక్కడికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫుడ్‌స్టాల్స్‌ వెలిశాయి. పందేలు రూ.లక్షల్లోనే సాగాయి. చందర్లపాడు మండలం, నందిగామలో రెండేసి చొప్పున నిర్వహించారు. కంచికచర్ల మండలం పెండ్యాల, గండేపల్లిలో భారీగా సాగాయి. పెండ్యాలలో పేకాట ఆడేందుకు హైదరాబాద్‌ నుంచి కూడా వచ్చారు. ఒక్కో ఆటకు రూ.30 వేలు నుంచి రూ.లక్షల వరకు జరిగాయి.

* కైకలూరు నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో 20 వరకు బరులు ఏర్పాటయ్యాయి. అత్యధికంగా కైకలూరు మండలం ఆలపాడులో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పందేలు కాశారు. హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి పందెం కాసేవారు వచ్చారు. మద్యం విచ్చలవిడిగా దొరకడంతో గొడవలు ఎక్కువగానే జరిగాయి. పలుచోట్ల పోలీసు కేసులు నమోదు చేసే వరకు వెళ్లింది. వత్సవాయి మండలం లింగాల వద్ద ఏర్పాటు చేసిన బరుల్లో పేకాట నిర్వాహకులు, ఆడే వారి మధ్య గొడవ జరిగింది. దీంతో పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో నిర్వాహకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొందరు కూడా గాయాలపాలయ్యారు. గుడ్లవల్లేరు అంగలూరులోని కోడిపందేల బరి వద్ద యువకుల మధ్య ఘర్షణ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని