logo

ట్రాఫిక్‌ సిగ్నళ్లకుమోక్షం

విజయవాడలోని ముఖ్య కూడళ్లల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లకు మోక్షం కలగబోతోంది. వీటి మరమ్మతులకు సంబంధించి వీఎంసీ నిధులు మంజూరు చేసింది. దీంతో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుంది.

Published : 18 Jan 2022 03:35 IST

కీలక కూడళ్లలో మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు

రూ.60 లక్షలు మంజూరు చేసిన వీఎంసీ

ఈనాడు - అమరావతి

పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కూడలి వద్ద వెలగని సిగ్నళ్లు

విజయవాడలోని ముఖ్య కూడళ్లల్లో ట్రాఫిక్‌ సిగ్నళ్లకు మోక్షం కలగబోతోంది. వీటి మరమ్మతులకు సంబంధించి వీఎంసీ నిధులు మంజూరు చేసింది. దీంతో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇవన్నీ పూర్తి అయితే ట్రాఫిక్‌ పోలీసులపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. అసలే అరకొర సిబ్బందికి తోడు, సిగ్నలింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు కావడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఇవి పూర్తిగా పాడయ్యాయి. ఈ ప్రాంతాల్లో సిబ్బందే నియంత్రించాల్సి వస్తోంది. ఇప్పటికే అవసరానికి తగ్గట్లుగా ట్రాఫిక్‌ సిబ్బంది లేరు. దీనికి తోడు ముఖ్యమైన కూడళ్లల్లో ఎక్కువ మంది విధుల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో ఈ విభాగం అంతా కేవలం ట్రాఫిక్‌ నియంత్రణకే పరిమితమైంది. నగరంలో జరిగే ఉల్లంఘనలపై దృష్టి పెట్టే అవకాశం ఉండడం లేదు.

ఏళ్ల తరబడి నిర్లక్ష్యం

విజయవాడలో రద్దీ సమయాలలో ట్రాఫిక్‌ జామ్‌లు నిత్యకృత్యం అయ్యాయి. ట్రాఫిక్‌ విభాగంలో మొత్తం 450 మంది వరకు ఉన్నారు. నగర కమిషనరేట్‌ పరిధిలో సుమారు 180 వరకు విధులు నిర్వహించాల్సిన బీట్లు ఉన్నాయి. ఉన్న సిబ్బంది సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రధానమైన చోట్ల మాత్రమే వేస్తున్నారు. దీంతో 60 బీట్లలో అసలు సిబ్బందిని వేయలేని పరిస్థితి. సిగ్నల్స్‌ పనిచేయని ప్రధాన సర్కిళ్లలో ఎక్కువ మందికి విధులు కేటాయించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది నగరంలో 56 ముఖ్యమైన కూడళ్లలో సిగ్నళ్లు, బ్లింకర్లు ఉన్నాయి. వీటిలో కొద్ది చోట్ల మాత్రమే సిగ్నళ్లు పనిచేస్తున్నాయి. ఇవి కాక.. 25 చోట్ల బ్లింకర్లు ఉన్నాయి. వీటి పరిస్థితి కూడా ఇంతే. పలు చోట్ల ఉన్నవి పాతకాలం నాటివి. వీటిని నిర్లక్ష్యం చేయడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. చాలా కూడళ్లలో ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు నియంత్రిస్తున్నారు. సిగ్నళ్లు పనిచేస్తున్న చోట కూడా టైమర్లు లేవు. చాలా తక్కువ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. వీటికి బ్యాకప్‌ కూడా తక్కువే. త్వరగా మొరాయిస్తున్నాయి. వీటి నుంచి వైర్లు వేలాడుతుండడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

16 కూడళ్లల్లో..

నగరంలో ప్రజా రవాణా, ట్రాఫిక్‌కు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత వీఎంసీదే. సమస్య తీవ్రత గురించి వీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించి కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 16 చోట్ల మార్పు, చేర్పులు అవసరమని గుర్తించారు. ఇందుకుగాను రూ. 60 లక్షలు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. మూడు ఎస్టిమేట్లకు సంబంధించి టెండర్లు పిలిచి గుత్తేదారులను ఖరారు చేశారు. పనులు ప్రారంభమయ్యాయి. సీతంపేట గేట్‌, శారదా కాలేజి, ఫుడ్‌ జంక్షన్‌, మధురానగర్‌, పడవలరేవు జంక్షన్‌, పాత బస్టాండు కూడలి, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, అప్సర, చల్లపల్లి బంగ్లా, సీతారాంపురం కూడలి, మహానాడు, రమేష్‌ , నిర్మల, సిద్ధార్థ కూడళ్లు, తదితర ప్రాంతాల్లో మార్చుతున్నారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్నారు. పూర్తిగా పాడైన వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చనున్నారు.

బెంజిసర్కిల్‌ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదన

నగరంలోకెల్లా ముఖ్యమైన కూడలి బెంజి సర్కిల్‌. ఇక్కడ గతంలో వంతెనల నిర్మాణం సమయంలో సిగ్నల్‌ లైట్లను తొలగించారు. ప్రస్తుతం పైవంతెనల నిర్మాణం పూర్తి అయి, అవి వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఇక్కడ తిరిగి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నారు. దీనిపై నగరపాలక సంస్థకు ట్రాఫిక్‌ పోలీసులు లేఖ రాశారు. బెంజి సర్కిల్‌లోనూ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనిపై వీఎంసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 2019లో నేతాజీ వంతెన వద్ద రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ పట్టుమని పది నెలలు కూడా పనిచేయలేదు. అప్పటి నుంచి దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిని కూడా మరమ్మతు చేయించమని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని