logo

మందులు అందలే !

‘విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో నిత్యం ఓపీకి వచ్చేవారికి మందులు అందుకోవడం అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చి ఓపీ చీటీ తీసుకుని వైద్యులకు చూపించుకోవడం వరకూ ఒక ఎత్తయితే..

Published : 18 Jan 2022 03:35 IST

ఓపీకి వచ్చేవారికి ఇదే అతిపెద్ద సమస్య

ఈనాడు, అమరావతి

‘విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో నిత్యం ఓపీకి వచ్చేవారికి మందులు అందుకోవడం అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చి ఓపీ చీటీ తీసుకుని వైద్యులకు చూపించుకోవడం వరకూ ఒక ఎత్తయితే.. ఈ తర్వాత మందుల కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడడం మరో ఎత్తు. ఉదయం 9గంటల నుంచి మందుల కౌంటర్ల దగ్గర రద్దీ ఆరంభమవుతుంది. సోమవారం సహా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో మందుల కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటాయి. ఆసుపత్రికి పెరిగిన రోగుల తాకిడి దీనికి ఒక కారణమైతే.. సగం మందులు ఇచ్చి మిగతావి తర్వాత వచ్చి తీసుకోమంటూ సిబ్బంది చెప్పడం మరో కారణం.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని ఓపీకి నిత్యం 1500 నుంచి రెండు వేల మంది వస్తుంటారు. కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాలు, పక్కనే ఉన్న గుంటూరు, పశ్చిమగోదావరి నుంచి కూడా ఓపీకి పెద్దసంఖ్యలో వస్తుంటారు. కొవిడ్‌కు ముందు రద్దీ ఎలా ఉందో.. ప్రస్తుతం మళ్లీ అదేస్థాయిలో ఉంటున్నారు. అన్ని వైద్య విభాగాలకూ రద్దీ పెరుగుతోంది. ఆర్థో, ఈఎన్‌టీ లాంటివి నిత్యం ఓపీ రోగులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఆసుపత్రిలోని వరండాలు మొత్తం బాధితులతో నిండిపోతుంటాయి. అక్కడే గంటల తరబడి వేచి ఉంటారు. రోగులను పరీక్షించిన తర్వాత వైద్యులు రాసిన మందులను తీసుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. మందుల చీటీని తీసుకుని కౌంటర్‌ దగ్గరకు వచ్చాక.. కనీసం రెండు మూడు గంటలు క్యూలైన్లలో నిలబడితే తప్ప మందులు అందుకోవడం కష్టం.

రాసిన మందుల్లో కొన్నే ఇచ్చి..

ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రాసే మందుల్లో కొన్నే కౌంటర్లలో ఉంటున్నాయి. బాధితులకు అవసరమైన మందులన్నింటినీ వైద్యులు రాస్తున్నారు. కానీ.. వాటిలో అన్నీ మందుల కౌంటర్‌లో ఉండడం లేదు. ఈ సమస్య చాలాకాలంగా ఆసుపత్రిలో ఉంది. కొన్ని మందులను ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమంటూ కౌంటర్లలోని సిబ్బంది చెబుతున్నారు. పది మందిలో కనీసం ఐదుగురికి ఈ అరకొర మందుల సమస్య నిత్యం ఎదురవుతూనే ఉంది. మందుల కొరత లేదంటూ వైద్య అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా.. వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ఒక రోజు ఓపీకి వచ్చే రోగులకు ఇచ్చే మందులను పరిశీలించినా.. ఉన్నతాధికారులకు ఈ సమస్య స్పష్టంగానే అర్థమవుతుంది.

మరికొన్ని అదనపు కౌంటర్లు..

ఆసుపత్రిలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి మందులను ఇస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విపరీతమైన రద్దీ ఉంటోంది. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం పెరగడంతో మరీ పెద్ద అనారోగ్య సమస్య అయితేనే ఆసుపత్రిలో ఉండమని చెబుతున్నారు. ఎక్కువ మందికి మందులు ఇచ్చి ఇంటికే పంపించేస్తున్నారు. అందుకే.. మందుల కౌంటర్ల వద్ద మరింత రద్దీ పెరిగింది. కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో.. సమస్య ఇంకా తీవ్రం కానుంది. వైద్యులు రాసిన చీటీని పరిశీలించి ఒక్కొక్కరికి మందులను ఇచ్చేందుకు ప్రస్తుతం 15నిమిషాలకు పైనే పడుతోంది. ఈ లెక్కన చూస్తే.. కనీసం మరో నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు.

సగం మందులే ఇవ్వడంతో..

విజయవాడ కొత్తాసుపత్రిలోని మందుల కౌంటర్ల వద్ద భారీగా రద్దీ

ఓపీకి వచ్చే వారికి మందుల చీటీలో ఉన్న వాటిలో సగమే ఇస్తున్నారు. రెండు వారాలకు మందులను వాడాలని రాస్తే.. వాటిలో వారానికే ఇస్తున్నారు. మిగతావి వారం తర్వాత వచ్చి తీసుకోమంటూ కౌంటర్‌లోని సిబ్బంది చెబుతున్నారు. దీంతో వారం రోజులు మందులు వాడిన తర్వాత మళ్లీ బాధితులు ఆ మందుల చీటీని తీసుకుని ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. దీంతో మందుల కౌంటర్ల వద్ద రద్దీ రెట్టింపు అవుతోంది. ప్రతిరోజు ఇలా సగం మందులను ఇచ్చి మళ్లీ రమ్మని చెప్పడంతో.. వాళ్లు వారం తర్వాత వచ్చి ఉదయాన్నే క్యూలైన్లలో నిలబడుతున్నారు. అందుకే.. కనీసం కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా రెండుసార్లు కాకుండా ఒకేసారి మందులను పూర్తిగా ఇచ్చి పంపించే ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి పెడితే.. కొంత రద్దీ తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని