logo

దత్తత తీసుకోండిలా..

సృష్టిలో తీయనైన పిలుపు అమ్మ.. ప్రతి స్త్రీ ఆ రెండక్షరాల పిలుపు కోసం పరితపిస్తుంటుంది.. పుట్టగోయే బిడ్డ కోసం ప్రాణాలను పణంగా పెడుతుంది.. సంతానం లేకపోవడానికి కారణాలేవైనా ఆ తల్లి పడే బాధ మాటల్లో చెప్పలేనిది..

Published : 18 Jan 2022 05:07 IST

అభాగ్య చిన్నారులను అక్కునచేర్చుకుంటున్న దంపతులు

గ్రామీణ పామర్రు, న్యూస్‌టుడే

అంకమ్మగుంట: 2021 జులై 07న రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో లభించిన నవజాత శిశువుని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

సృష్టిలో తీయనైన పిలుపు అమ్మ.. ప్రతి స్త్రీ ఆ రెండక్షరాల పిలుపు కోసం పరితపిస్తుంటుంది.. పుట్టగోయే బిడ్డ కోసం ప్రాణాలను పణంగా పెడుతుంది.. సంతానం లేకపోవడానికి కారణాలేవైనా ఆ తల్లి పడే బాధ మాటల్లో చెప్పలేనిది.. ఇలాంటి తరుణంలో దత్తత ప్రక్రియ మాతృత్వానికి మరో మార్గం చూపుతోంది. ఈ క్రమంలో సంతానం లేని ఎంతో మంది దంపతులు చట్టప్రకారం పిల్లల్ని దత్తత తీసుకొని ఆనందంగా జీవిస్తూ తమ కుటుంబాల్ని తీర్చిదిద్దుకుంటున్నారు.

పిల్లల్ని పోషించలేక విడచిపెట్టిన, బయట ప్రదేశాల్లో పడేసిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రభుత్వం మహిళాభివద్ధి, శిశు సంక్షేమ శాఖ అధీనంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా జిల్లాలోని గన్నవరం మండలం బుద్ధవరం, మచిలీపట్నం షార్కే కాలనీలో రెండు శిశుగృహాలను నిర్వహిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్లలోపు గల వారు మచిలీపట్నంలో 09 మంది ఉండగా, బుద్ధవరంలో 14 మంది ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. వాటితోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న 83 ఛైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (సీసీఐ)లలో 6 నుంచి 18 సంవత్సరాలలోపు 2,209(బాలికలు 1204, బాలురు 1005) మంది వసతి పొందుతున్నారు. 2007 నుంచి ఇంతవరకూ జిల్లాకు చెందిన 275 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. వారిలో మన దేశంలో 247 (బాలికలు 90, బాలురు 157), ఇతర దేశాలకు 28 (బాలికలు 9, బాలురు 19) మంది ఉన్నారు.

నిబంధనల మేరకే..

భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల ప్రకారం పిల్లల్ని దత్తతిస్తాము. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కారా’ చట్ట ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్తోమత లేని, పెంచుకోలేని స్థితిలో ఉన్న వారు పిల్లలను నేరుగా శిశుగృహంలో ఇవ్వొచ్చు.  

- ఎండూరి జాన్సన్‌, జిల్లా దత్తత పర్యవేక్షణాధికారి, ఇన్‌ఛార్జి డీసీపీవో (జిల్లా బాలల సంరక్షణాధికారి)


ఇవీ అర్హతలు

స్టెప్‌-1

దత్తత తీసుకోవాలనుకుంటున్నవారు కారా(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఏఆర్‌ఏ.ఎన్‌ఐసీ.ఇన్‌) అనే వెబ్‌సైట్లో పాన్‌కార్డుతో నమోదు చేసుకొని ఎకనాలెడ్జ్‌మెంట్‌ ప్రింట్‌ తీసుకోవాలి.

స్టెప్‌-2 ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాల్సినవి..

1) కుటుంబ చిత్రం(మ్యాక్సి సైజ్‌)
2) నివాస ధ్రువపత్రం (ఆధార్‌కార్డు/ఓటర్‌ ఐడీ కార్డు/రేషన్‌కార్డు/పాస్‌పోర్టు/కరెంట్‌ బిల్‌)
3) సంవత్సర ఆదాయ ధ్రువీకరణ పత్రం(తహశీల్లార్‌ జారీ చేసిన/ఉద్యోగులైతే జీతం సర్టిఫికెట్‌)
4) రిజిస్ట్రార్‌ కార్యాలయం ద్వారా వివాహ ధ్రువీకరణ
5) దంపతులిద్దరి పుట్టన తేదీ ధ్రువపత్రాలు / నోటరీ ద్వారా పుట్టన తేదీ అఫిడవిట్‌.
6) వైద్య పరీక్షల నివేదికలు ఇద్దరివి
ఎ) టీబీ-స్పుటమ్‌, బి) వీడీఆర్‌ఎల్‌ సి) హెచ్‌ఐవీ డి) హెపటైటిస్‌- బి

స్టెప్‌-3 హోమ్‌ స్టడీ (గృహ అభ్యసన నివేదిక)

1) హోమ్‌ స్టడీ సమయంలో అప్‌లోడ్‌ చేసిన ధ్రువీకరణ పత్రాలతో పాటు రూ.6000 డీడీ (ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి పథక సంచాలకులు, జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా వారికి చెల్లుబాటయ్యేలా)తోపాటు దరఖాస్తు సమర్పించాలి.

స్టెప్‌-4 దత్తత తీసుకోవడం

1) తల్లిదండ్రుల ఆస్తి వివరాల పత్రాలు ఒక సెట్‌ నకళ్లు గెజిటెడ్‌ ఆఫీసర్‌ అటెస్టేషన్‌ చేయించి సిద్ధంగా ఉంచుకోవాలి
2) బిడ్డను దత్తత తీసుకొనే సమయంలో సంస్థ వారికి రూ.40,000 డీడీ రూపంలో అందించాలి.
3) దత్తత నిర్ధారణకు బిడ్డను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బిడ్డతో కలిసి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు హాజరుకావాలి.
4) బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం దత్తత తీసుకున్న జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ద్వారా తల్లిదండ్రులకు అందజేస్తారు.
5) దత్తత తీసుకున్న తరువాత 6 నెలలకోసారి రెండేళ్లపాటు గృహ విచారణ సమయంలో రూ.2 వేలు డీడీ రూపంలో జిల్లా అధికారికి సమర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని