logo

అనారోగ్యంతో ఖైదీ మృతి

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీ తానికొండ పేతురు(68) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. కొవిడ్‌ నిబంధనల మేరకు 60 ఏళ్ల పైబడిన ఖైదీలందరికీ వ్యక్తిగత పూచీకత్తుపై కొవిడ్‌-19 బెయిల్‌ మంజూరు

Published : 18 Jan 2022 06:14 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీ తానికొండ పేతురు(68) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. కొవిడ్‌ నిబంధనల మేరకు 60 ఏళ్ల పైబడిన ఖైదీలందరికీ వ్యక్తిగత పూచీకత్తుపై కొవిడ్‌-19 బెయిల్‌ మంజూరు చేయాలన్న కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పేతురు గత ఏడాది జులై 25న పెరోల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో అతను అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువుల నుంచి వివరాలను సేకరించి సెంట్రల్‌ జైల్‌కు తెలియజేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వగృహానికి తరలించినట్లు చెప్పారు. నాలుగు సంవత్సరాల కిందట హత్య కేసులో అతనికి గుంటూరు కోర్టు జీవిత ఖైదు విధించిందని జైలు అధికారులు తెలిపారు.

కానిస్టేబుల్‌పై రౌడీషీటర్‌ దౌర్జన్యం

మంగళగిరి : పోలీసు కానిస్టేబుల్‌పై రౌడీషీటర్‌ దౌర్జన్యానికి దిగిన ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా రౌడీషీటర్లందరినీ మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. ద్వారకానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ ఆలా సుబ్బారావు హాజరు కాలేదు. అతన్ని పోలీసుస్టేషన్‌కు రమ్మని పిలవడానికి కానిస్టేబుల్‌ చల్లా కిరణ్‌కుమార్‌ సుబ్బారావు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌పై సుబ్బారావు తిరగబడి బలంగా నెట్టివేయగా...కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రౌడీషీటర్‌ ఆలా సుబ్బారావుతోపాటు అతని కుటుంబ సభ్యులు సాంబయ్య, సురేష్‌, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్సై నారాయణ సోమవారం వివరించారు.


అసభ్య సందేశాలపై ప్రశ్నించినందుకు చంపేశారు!

హత్య కేసులో నిందితుల అరెస్టు

బాపట్ల, న్యూస్‌టుడే : పెదనందిపాడు మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులు గుమ్మడి వెంకటేశ్వర్లు, ఏసుదాసు, గంగమ్మ, ఆయుధం వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాపట్ల పోలీసు సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరెస్టు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఓ వ్యక్తి కుమార్తెకు గుమ్మడి వెంకటేశ్వర్లు సెల్‌ఫోన్‌ ద్వారా అసభ్య సందేశాలు పంపించాడు. దీనిపై వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులను సదరు వ్యక్తి గట్టిగా ప్రశ్నించటంతో గొడవ జరిగింది. ఈ నెల 7న అతనిపై వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇనుప మేకులు కలిగిన బొంగు కర్రలతో తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యా నేరం, పోక్సో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పెదనందిపాడు పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో పొన్నూరు గ్రామీణ సీఐ ఆళహరి శ్రీనివాస్‌, ఎస్సై అశోక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని