logo

తెల్లరాయి లోడు ట్రాక్టరు ఢీకొని విద్యార్థికి గాయాలు

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో తెల్లరాయి లోడుతో అతి వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టరు ఢీకొని స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థికి సోమవారం గాయాలయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు రహదారిపై

Published : 18 Jan 2022 06:14 IST

గాయపడ్డ విద్యార్థి నాగరాజు

దాచేపల్లి, న్యూస్‌టుడే : గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో తెల్లరాయి లోడుతో అతి వేగంగా వెళ్తున్న ఓ ట్రాక్టరు ఢీకొని స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థికి సోమవారం గాయాలయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు రహదారిపై అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. దాచేపల్లి ఆదర్శ పాఠశాలకు సమీపంలో వైకాపా నేతలకు చెందిన తెల్లరాయి క్వారీ నడుస్తోంది. అందులోంచి రోజు వారీగా 50కు పైగా ట్రాక్టర్లు, టిప్పర్లతో తెల్లరాయి ముడిసరకు నడికూడి, పిడుగురాళ్ల రవాణా అవుతోంది. ఈ ప్రక్రియ అంతా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి చీకటి పడే వరకు సాగుతుంది. ఈ లోడు వాహనాలన్నీ పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాల మీదుగా ముత్యాలంపాడు రోడ్డు మార్గంలో పిడుగురాళ్ల, నడికూడి పారిశ్రామికవాడకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో వాటి వేగానికి అడ్డూ అదుపు ఉండటం లేదు. డ్రైవర్లు పాటలు పెట్టుకొని రోడ్డు వైపు సక్రమంగా చూడకుండా వాటిని నడుపుతుంటారు. అదనపు లోడుతో వెళ్లే వాహనాల్లో నుంచి రాళ్లు కింద పడుతుంటాయి. వాటి వెనుకగా వెళ్లే ఇతర వాహనాల్లో వెళ్లే వాహనదారులపై అవి పడి గతంలో పలువురు గాయపడ్డారు. ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న తన అక్కను ద్విచక్ర వాహనంపై వదిలిపెట్టి తిరిగి ఇంటికి వెళ్తున్న దాచేపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి బొంబోతుల నాగరాజుపైకి సోమవారం ఓ ట్రాక్టరు దూసుకొచ్చింది. అతి వేగంతో ఉన్న ట్రాక్టరు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముందుకు ఈడ్చుకెళ్లింది. దీంతో విద్యార్థి ఛాతి, నోటికి గాయాలయ్యాయి. నారాయణపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన తోటి విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని భరోసా ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు