AP News: ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం...

Published : 19 Jan 2022 01:19 IST

అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన అధికారి సరిగా వ్యవహరించటం లేదని అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ఫిట్‌మెంట్‌ 23శాతం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే రాతపూర్వకంగా తెలిపాం, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ అంశాలను ప్రభుత్వం తప్పకుండా పునఃసమీక్షించాల్సిందేనని స్పష్టం చేశారు.  అధికారులు ఏం చెప్పినా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. పీఆర్సీ జీవోలపై పునః సమీక్ష చేయాల్సిదేనన్నారు. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామనడం ఏమిటో అర్ధం కావడంలేదన్నారు. మధ్యంతర భృతిని రికవరీ చేసిన పరిస్థితి చరిత్రలో లేదని, అధికారులు సీఎంను తప్పుదోవ పట్టించారని భావిస్తున్నట్టు చెప్పారు. 

రాజకీయ కోణంలో చూస్తే ఏ సీఎం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని భావించడం లేదన్నారు. సెంట్రల్‌ పే కమిషన్‌ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉద్యోగులపై అధికారాన్ని వదిలేసుకుంటారా? అని ప్రశ్నించారు. పీఆర్‌సీ జీవోలను వెంటనే నిలిపివేయాలని, సీఎం నేతృత్వంలో కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. మరో రెండు నెలలు జాప్యమైనా ఫర్వాలేదు.. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ను కొనసాగించి ఉద్యోగులకు మేలే చేసేలా కసరత్తు చేయాలన్నారు.  ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవో వల్ల 4 నుంచి 12శాతం జీతం కోతపడే ప్రమాదం ఉందని, ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికమీదకు రావాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని