logo

కరోనా తీవ్రరూపం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 50మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడగా.. వారిలో 20మంది వైద్యులే ఉన్నారు. అందరికీ స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకవైపు కొవిడ్‌ సేవలు, మరోవైపు సాధారణ రోగులకు వైద్యం అందించడం సిబ్బందికి కత్తిమీదసాములా మారింది. కొవిడ్‌ వార్డులో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సిబ్బందిని మారుస్తూ విధులను కేటాయిస్తున్నారు.

Published : 19 Jan 2022 03:31 IST

పాజిటివ్‌ వచ్చిన 50లో 20 మంది వైద్యులే

రోజువారీ 300 దాటిన కేసులు

ఈనాడు, అమరావతి

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 50మంది సిబ్బంది కొవిడ్‌ బారినపడగా.. వారిలో 20మంది వైద్యులే ఉన్నారు. అందరికీ స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకవైపు కొవిడ్‌ సేవలు, మరోవైపు సాధారణ రోగులకు వైద్యం అందించడం సిబ్బందికి కత్తిమీదసాములా మారింది. కొవిడ్‌ వార్డులో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సిబ్బందిని మారుస్తూ విధులను కేటాయిస్తున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో 45మంది వరకు కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. రోజుకు ఐదుగురు చొప్పున కొత్తగా వచ్చి చేరుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు మాత్రమే ఆక్సిజన్‌పై ఉన్నారు. మిగతా వారంతా సాధారణ కొవిడ్‌ వార్డులో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో ముందస్తుగా 300 పడకలను ఆక్సిజన్‌తో సిద్ధం చేసి ఉంచారు. మంచాలు, ఆక్సిజన్‌ పుష్కలంగానే ఉన్నప్పటికీ.. వైద్య సిబ్బంది కొరత మాత్రం వేధిస్తోంది.

24గంటల్లో 326 మందికి వైరస్‌
కృష్ణా జిల్లాలో తాజాగా 24గంటల్లో 326 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌తో చికిత్స పొందుతున్న వారు 2,232మంది ఉన్నారు. ఇప్పటివరకూ మొత్తంగా 1,23,093మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 1,19,379మంది సురక్షితంగా వైరస్‌ బారినుంచి బయటపడ్డారు. 1482మంది చనిపోయారు. జిల్లాలో ప్రస్తుతం రోజువారీ 300కు పైగానే పాజిటివ్‌ కేసులు వస్తుండగా.. ఇవన్నీ అధికారికంగా పరీక్షలు చేయించుకుంటున్న వారి లెక్కలు మాత్రమే.

ప్రస్తుతం ఇంటి దగ్గరే కొవిడ్‌ పరీక్షలు చేయించుకునే కిట్లు కూడా మందుల దుకాణాల్లో అందుబాటులో ఉండడంతో.. వాస్తవంగా ఎంతమంది పాజిటివ్‌ అనేది బయటకు రావడం లేదు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నవారు, పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన వాళ్లు పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరికి పెద్దగా లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ వస్తోంది.

కొవిడ్‌ సెంటర్లలోనూ బాధితులు..
జిల్లాలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ బాధితులు చేరుతున్నారు. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న గూడవల్లి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఇప్పటికే 22మంది పాజిటివ్‌ వచ్చిన వాళ్లు చేరారు. వీరిలో కొందరిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇక్కడికి తరలించారు. తాజాగా వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో కొవిడ్‌బారిన పడుతుండడంతో.. ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు సాధారణ లక్షణాలు ఉన్న వారిని గూడవల్లి సెంటర్‌కు తరలించారు. తాజాగా పాజిటివ్‌ వస్తున్న వారిలో కొంతమందికి పెద్దగా లక్షణాలు లేకపోయినా.. ముందుజాగ్రత్త చర్యగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరుతున్నారు.  

విద్యా సంస్థల్లోనూ...
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిడమానూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడ్డారు.  కానీ.. ఎక్కడా కేసుల విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పాజిటివ్‌ కేసులు వస్తున్నా.. బయటకు చెప్పడం లేదు.


అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..

* ప్రస్తుతం వస్తున్న పాజిటివ్‌ కేసుల్లోనూ విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటున్నాయి. కానీ.. నగరంలో బహిరంగ ప్రదేశాలన్నింటిలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రధానంగా దుకాణాల్లో ఉండేవాళ్లు కూడా చాలాచోట్ల మాస్కులు ధరించడం లేదు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని లక్షల మంది నగరానికి వచ్చారు. అందుకే.. వైరస్‌ వ్యాప్తి అత్యంత ఎక్కువగా జరిగే సమయం ఇది.

* మరో వారం రోజులు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారులు సూచిస్తున్నారు. బయటకు వస్తే ఖచ్చితంగా మాస్కును ధరించడం, దుకాణాలు, మార్కెట్లలో భౌతిక దూరం పాటించడం, ఏదైనా తినేముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని