logo

108 వాహనం ఆలస్యం.. ఆటోలోనే పోయిన ప్రాణం

ఆపదలో ఉన్నవారు ఫోన్‌చేస్తే కుయ్‌.. కుయ్‌ మంటూ 5 నిమిషాల్లో వాలిపోయే 108 వాహనం సమాచారం ఇచ్చిన అర్ధగంట తర్వాత ఆలస్యంగా రావడంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన పుట్టగుంటలో

Published : 19 Jan 2022 03:31 IST

యెహోషువాను పరీక్షిస్తున్న 108 వైద్య ఉద్యోగిని

పుట్టగుంట(నందివాడ), న్యూస్‌టుడే: ఆపదలో ఉన్నవారు ఫోన్‌చేస్తే కుయ్‌.. కుయ్‌ మంటూ 5 నిమిషాల్లో వాలిపోయే 108 వాహనం సమాచారం ఇచ్చిన అర్ధగంట తర్వాత ఆలస్యంగా రావడంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన పుట్టగుంటలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లె మురళీ అలియాస్‌ యెహోషువ(61)కు మధ్యాహ్నం 1.15 గంటలకు గుండె నొప్పి రావడంతో జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గర పడిపోయాడు. అక్కడే ఉన్న అతని భార్య సువర్ణ ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో వరండాలో పండుకోబెట్టి అతనికి సపర్యలు చేశారు. ఉపాధ్యాయులు 108కి ఫోన్‌చేయడంతో నందివాడ అంబులెన్స్‌ ఖాళీగా లేదని, గుడివాడ వాహనం మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించే క్రమంలో రోడ్డు మార్గంలో ఉందని సమాధానం వచ్చింది. అప్పటికే రెండు సార్లు గుండెనొప్పి రావడంతో తట్టుకోలేక పడుకున్న వ్యక్తి మెలికలు తీరిగిపోవడం అక్కడ ఉన్నవారందర్నీ కలచివేసింది. అతని బాధను చూసి తట్టుకోలేక 20 నిమిషాల తర్వాత మరోసారి 108కు ఫోన్‌లో ప్రయత్నించారు. పెదపారుపూడి మండలానికి చెందిన అంబులెన్స్‌ అందుబాటులో ఉందని వివరాలన్నీ తీసుకున్నారు. మరో 10 నిమిషాలకుపైగా సమయం గడవడంతో రోగి పరిస్థితి విషమించింది. దారినపోయే ఆటోవాలాలను బతిమలాడినా ఎవరూ ముందుకు రాలేదు. అర్ధగంట తర్వాత ఒక ఆటోవాలా రోగిని ఎక్కించుకొని బుడమేరు వంతెనకు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా గుడివాడకు చెందిన 108 వాహనం వచ్చింది. 108 సిబ్బంది అతడ్ని పరీక్షించి మృతి చెందినట్లు చెప్పడంతో మృతుని భార్య, బంధువులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టారు. మృతుని భార్య సువర్ణ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేస్తుంది. కొన్నిసార్లు ఆమె భర్త యోహోషువ కూడా వచ్చి మధ్యాహ్నం విద్యార్థులకు భోజనం వడ్డిస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్న భోజనాలు పూర్తవడంతో భార్యని ఇంటికి తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చి హుద్రోగానికి గురయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు