logo

రమణీయం రంగుల ఉత్సవం

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం రంగుల ఉత్సవానికి సిద్ధమైంది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే వేడుక ఈ నెల 20న ప్రారంభమై ఫిబ్రవరి 16న జరిగే తిరుపతమ్మ, గోపయ్య స్వాముల కల్యాణం, పెద్ద తిరునాళ్లతో ముగుస్తుంది.

Published : 19 Jan 2022 03:31 IST

జగ్గయ్యపేటకు తిరుపతమ్మ దేవతామూర్తులు
పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం రంగుల ఉత్సవానికి సిద్ధమైంది. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా నిర్వహించే వేడుక ఈ నెల 20న ప్రారంభమై ఫిబ్రవరి 16న జరిగే తిరుపతమ్మ, గోపయ్య స్వాముల కల్యాణం, పెద్ద తిరునాళ్లతో ముగుస్తుంది. రంగుల ఉత్సవం వచ్చిందంటే పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు పెద్ద పండగ. వేడుకలో భాగంగా ఆలయంలో కొలువైన పెనుగంచిప్రోలు అంకమ్మ, వినుకొండ అంకమ్మ, చంద్రమ్మ, మల్లయ్య, పెద్దమ్మ, మద్దిరావమ్మ తదితర విగ్రహాలతో పాటు, తిరుపతమ్మ, గోపయ్యల ఉత్సవమూర్తులను జగ్గయ్యపేట తరలిస్తారు. మళ్లీ అక్కడ నుంచి తీసుకువస్తారు.

11 ఎడ్ల బళ్లపై...
ఉత్సవంలో అనేక రకాల సంప్రదాయాలు, సామాజికవర్గాల ప్రజలు మమేకమవుతారు. ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసిన తరువాత రజకులు వాటిని తలపై పెట్టుకొని ఊరేగింపుగా గ్రామంలోని రంగుల విడిది మండపం వరకు తీసుకొస్తారు. అక్కడ పూజల అనంతరం గ్రామ రైతులు 11 ఎడ్ల బళ్లపై ఒక్కో విగ్రహాన్ని ఉంచి వేడుకగా మక్కపేట, చిల్లకల్లు మీదుగా జగ్గయ్యపేట రంగుల మండపానికి తీసుకెళ్తారు. తిరుగు ప్రయాణంలో విగ్రహాలను పల్లకీల్లో ఉంచి రజకులు మోసుకుంటూ చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం గ్రామాల మీదుగా పెనుగంచిప్రోలు రంగుల విడిది మండపం వరకు తీసుకొస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక రథంపై ఆలయానికి తీసుకురావడంతో ఉత్సవం ముగుస్తుంది.

ఎందుకు వేడుక?
ఆలయంలో విగ్రహాలన్నీ పూర్వకాలంలో చెక్కతో తయారు చేశారు. వాటికి చిన్నపాటి మరమ్మతులు అవసరం అవుతుంది. రంగులు కూడా వేయాలి. అందుకే రెండేళ్లకోసారి విగ్రహాలను జగ్గయ్యపేట ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ చెక్క విగ్రహాల తయారీ, రంగుల అద్దే కళలో నిష్ణాతులైన నకాసి వంశీయులు  విగ్రహాలకు మరమ్మతులు చేసి, రంగులు అద్దుతారు. జగ్గయ్యపేట రంగుబజార్‌లోని మండపంలో విగ్రహాలను ఉంచి ఆ ప్రక్రియ పూర్తి చేస్తారు. సుమారు 20 రోజుల పాటు జగ్గయ్యపేటలో ఉండే అమ్మవారు, పరివార దేవతలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


విజయవంతానికి చర్యలు
- యింజం చెన్నకేశవరావు, ఆలయ ఛైర్మన్‌

ఉత్సవంలో కొవిడ్‌ నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకుంటాం. వెళ్లేటప్పుడు ఉత్సవ సమయాన్ని కొంత కుదించాం. వేడుకలో పాల్గొనే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, దూరం పాటించేలా చర్యలు తీసుకుంటాం. అందరి సహకారంతో ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని