logo

వరికూటివారిపాలెంలో బాంబుల కలకలం

మండలంలోని వరికూటివారిపాలెంలో బాంబు పేలిందనే కలకలం ఈ ప్రాంతవాసుల్లో భయాందోళనలు రేకెత్తించింది.  వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రేపల్లె మండలం పేటేరుకు చెందిన వరికూటి

Published : 19 Jan 2022 03:31 IST

పొలాల్లో బాంబులున్న సంచిని పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం

భట్టిప్రోలు, న్యూస్‌టుడే:   మండలంలోని వరికూటివారిపాలెంలో బాంబు పేలిందనే కలకలం ఈ ప్రాంతవాసుల్లో భయాందోళనలు రేకెత్తించింది.  వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రేపల్లె మండలం పేటేరుకు చెందిన వరికూటి శ్రీరామకోటేశ్వరరావు సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై తన సోదరి ఇంటికి వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో ఆయన తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రధాన రహదారిలో ఆయన వెనుక ఓ పెద్ద శబ్దం విన్పించింది. భయపడిన ఆయన పక్కనే ఉన్న దళితవాడ వైపునకు పరుగుతీశారు. అక్కడ కుప్పకూలిపోయి, అపస్మారక స్థితికి చేరారు.  స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు 108 వాహనం ద్వారా ఆయన్ను రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మంగళవారం వారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై శామ్యూల్‌రాజీవ్‌కుమార్‌ ఆ ప్రాంతాన్ని డాగ్‌, వేలిముద్రల నిపుణులు, బాంబు స్క్వాడ్‌ బృందాలతో పరిశీలించారు. శబ్దం వచ్చిన చోట రహదారి కొద్దిగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. సమీప ప్రాంతాల్లో తనిఖీ చేయగా.. ఓ తెల్ల సంచిలో నాలుగు నాటుబాంబులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి బాంబులు ఎలా వచ్చాయోనని ఆశ్చర్యపోయారు. అయితే పేలింది నాటు బాంబులు కాదని, దీపావళి టపాసులని భావిస్తున్నట్టు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. ప్రత్యేక బృందాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఎస్సై శామ్యూల్‌రాజీవ్‌కుమార్‌ చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని