logo

కొవిడ్‌ నిబంధనలు పాటించని ఎగ్జిబిషన్‌ సీజ్‌

గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ని సీజ్‌ చేశామని నగరపాలక సంస్థ కమిషనరు చల్లా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో

Published : 19 Jan 2022 03:31 IST

ఎగ్జిబిషన్‌ని మూయించిన జీఎంసీ అధికారులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), నెహ్రూనగర్‌,  న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని గుంట గ్రౌండ్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ని సీజ్‌ చేశామని నగరపాలక సంస్థ కమిషనరు చల్లా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో సీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి, కొత్తపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు, జీఎంసీ సిబ్బంది మంగళవారం కొత్తపేటలో ఎగ్జిబిషన్‌ జరుగుతున్న గుంటగ్రౌండ్‌కు చేరుకుని పరిశీలించారన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సిబ్బంది మాస్కులు పెట్టుకోకుండా, స్టాల్‌లో శానిటైజర్‌ ఏర్పాటు చేయకపోవడంతో ప్రదర్శనని నిలుపుదల చేసి సీజ్‌ చేశారన్నారు. నగరంలో కొవిడ్‌ కేసులు వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు అధిక సంఖ్యలో గుమికూడుతున్న ఎగ్జిబిషన్‌ని సీజ్‌ చేశామన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోకుంటే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా వర్తక, వాణిజ్య సముదాయాల్లో గుర్తిస్తే ఆయా దుకాణాలపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించటంతో పాటు వాణిజ్య సంస్థలను సీజ్‌ కూడా చేస్తారని వివరించారు. నగరంలో కొవిడ్‌ నిబంధనల అమలుపై ప్రత్యేక అధికారులతో బృందాలను నియమించామన్నారు. ప్రార్థన స్థలాలు, సూపర్‌ బజార్లు, టీ స్టాళ్లు, మార్కెట్లలో గుంపులుగా ప్రజలు ఉండకూడదన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని