logo

బాధితులకు రక్షణ ఇలాగేనా?

తన ఆదేశాలను పట్టించుకోని అధికారులపై రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ తన కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో

Published : 20 Jan 2022 03:15 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో భగ్గుమన్న ఎస్పీ గున్నీ

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : తన ఆదేశాలను పట్టించుకోని అధికారులపై రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ తన కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. తెనాలిలోని ఓ ఎస్సైకి ఛార్జిమెమో జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం ఓ మహిళ నేరుగా ఎస్పీకి ఫోన్‌ చేసి తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే నాలుగు నెలలుగా పట్టించుకోవడం లేదని వాపోయింది. ఆమె ఫిర్యాదుపై స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడితే ఆమె అసలు ఫిర్యాదు చేయలేదని సమాధానమివ్వడంతో ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. రిసెప్షన్‌లోని సిబ్బంది ఆరోజు వచ్చిన ఫిర్యాదులను వెంటనే ఎస్సై, సీఐలకు తెలియజేయాలన్నారు. అలా చేయకపోతే చర్యలు తప్పవన్నారు. మరో మహిళ ఎస్పీకి నేరుగా ఫోన్‌ చేసి తన ఇంట్లో మూడు నెలల కిందట 10 సవర్ల బంగారం, నగదు చోరీ జరగగా...పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందింది. తాము కూలి పనులు చేసుకొని ఆడపిల్లల వివాహానికి దాచుకున్న బంగారపు వస్తువులని కన్నీళ్ల పర్యంతమయ్యింది. దీనిపై ఎటువంటి ఆధారాలు లభించలేదని సంబంధిత ఎస్‌ఐ సమాధానమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్థుల వివరాలు సేకరించి, వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎంతమంది జైలు నుంచి విడుదలయ్యారని తెనాలిలో ఓ ఎస్‌ఐని ప్రశ్నించారు. జాబితా లేదనడంతో ఆ ఎస్సైకి ఛార్జి మెమో జారీ చేయాలని అప్పడీఎస్పీ కమలాకర్‌రావును ఆదేశించారు. ఎస్పీ సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఫోన్లలో తమ ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడంపై ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. అధికారులందరూ బాధ్యతగా పనిచేయాలని, పాత నేరస్థులపై నిఘా పెట్టి పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని